శ్రీ భాగ్ ఒప్పందం ఆధారంగా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయి ఆంధ్రరాష్ట్రంగా ఏర్పడిన అక్టోబర్ 1 వ తేదీనే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోవాలని, రాయలసీమ ప్రస్తుత దుస్థితిని ప్రపంచానికి ఎలుగెత్తి చాటాలని రాయలసీమ ప్రజాసంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథరామి రెడ్డి విజ్ఞప్తి చేశారు.
అప్పటి మద్రాస్ రాష్ట్రంలో వివక్షకు గురి అవుతున్న తెలుగు ప్రజలకు ప్రత్యేక రాష్ట్రం కావాలని కోస్తాంధ్ర నాయకులు అనేక దశాబ్దాలు అలుపెరగని పోరాటం చేసారు. ఆ పోరాటంలో భాగంగా రాయలసీమ మద్దతు సాధించడానికి, కోస్తాంధ్ర నాయకులు అన్ని రంగాలలో వెనుకపడి, కరువుతో అల్లాడుతున్న రాయలసీమను ఆదుకుంటామని ప్రకటించి శ్రీభాగ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. కోసాంధ్ర నాయకుల కోరిక మేరకు రాయలసీమ నాయకులు, ప్రజలు రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. ఫలితంగా అక్టోబర్ 1, 1953న తెలుగు ప్రజల ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది.
“ఆంధ్ర రాష్ట్రం పుట్టిన దినం అక్టోబర్ 1నే జరుపుకుందాం!రాయలసీమ దుస్థితిని ప్రపంచానికి చాటుదాం!!”
అయితే ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల కారణంగా కోస్తా నాయకులు, తెలంగాణాతో కలసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నవంబర్ 1, 1956లో ఏర్పడినప్పటి నుండి రెండు ప్రాంతాల నాయకులు వారి ప్రాంతాల ప్రయోజనాల కోసం రాయలసీమను బలి పశువుగా మార్చారు.
తెలంగాణను, ఆంధ్ర, రాయలసీమలను కలిపి 1956 నవంబర్ 1న అంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నవంబర్ 1ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినంగా జరుపుకున్నాము . అయితే 2014 జూన్ 2న తిరిగి తెలంగాణ, ఆంధ్ర రెండు ప్రత్యేక రాష్ట్రాలుగా ఏర్పడిన తర్వాత జూన్ 2న తెలంగాణా ఆవిర్భావ దినం కాగా, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఎపుడు జరుపుకోవాలన్న సందిగ్ధం ఏర్పడింది.
ఈ నేపథ్యంలో శ్రీ భాగ్ ఒప్పందం కుదిరిన (1937) నవంబర్16న కానీ, మద్రాస్ నుండి విడిపోయి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన (1953)అక్టోబర్ 1న కానీ, తిరిగి (2014) జూన్ 2న కానీ రాష్ట్ర అవతరణ దినంగా జరుపు కోవాల్సి ఉంది. అన్ని అంశాలు పరిగణనలోకి తీసుకుంటే 1953 అక్టోబర్ 1న ఏర్పడ్డ ఆంధ్ర రాష్ట్రంలోని భూభాగాలే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్లో మిగిలాయి కాబట్టి అక్టోబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడం సముచితమని దశరథ ప్రజలకు వివరించారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం ఎందుకు జరపాలంటే ?
ఆంధ్రరాష్ట్ర ఏర్పాటుకు ముందు జరిగిన చారిత్రిక పరిణామాలను, రాయలసీమ కోసం జరిగిన శ్రీభాగ్ ఒప్పందాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకొని రాయలసీమ అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలను అందరికీ (కోస్తా నాయకులకు, పాలక, ప్రతిపక్ష పార్టీలకు, ఇతర రాజకీయ పార్టీలకు) గుర్తు చేయడానికి, సమస్యల పరిష్కారానికి ఆయా నాయకులను కార్యోన్ముఖులను చేయడానికి అక్టోబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
మద్రాసు రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రజలకు ప్రత్యేక తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం ఉద్యమం నడుస్తున్నపుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే ఆంధ్ర ప్రాంత పాలకులతో రాయలసీమకు అన్యాయం జరుగుతుందని సీమ నాయకులు అనుమానించారు. అనంతపురంలో పెట్టాల్సిన ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని విశాఖపట్నంలో పెట్టడంతో వీరి అనుమానాలు బలపడ్డాయి. ఇలాంటి మోసాలు పునరావృతం కాకుండా నివారించడానికి రెండు ప్రాంతాల పెద్ద మనుషులు కలిసి 1937 నవంబర్ 16న శ్రీబాగ్ ఒప్పందం కుదుర్చుకుని, ఉద్యమించి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని సాధించారు.
“ఏరుదాటిందాకా మల్లన్న- ఏరు దాటిన తర్వాత బోడి మల్లన్న” అన్న నానుడిని నిజం చేస్తూ కోస్తా నాయకులు శ్రీభాగ్ ఒప్పందా,న్ని రాయలసీమకు ఇచ్చిన హామీలను తుంగలో తొకారు. ఒప్పందాన్ని కుదిర్చిన పెద్దలు పట్టించుకోలేదు. పాలకులు అమలు చేయలేదు. నేటి రాయలసీమ దుస్థితికి ఈ ఒప్పందం అమలు చేయకపోవడమే కారణం అని అందరికీ తెలుసు. ఈ పరిస్థితిని సరిదిద్ది శ్రీబాగ్ ఒప్పందాన్ని మరోసారి అందరికీ(పాలకులకు, ప్రజలకు) గుర్తు చేసి రాయలసీమకు న్యాయం చేయాలని కొరడానికే రాష్ట్ర అవతరణ దినాన్ని అక్టోబర్1న నిర్వహించుకోవాలి.
ఈ ఒప్పందంలో ….
ఈ ఒప్పందం ప్రకారం రాయలసీమ, నెల్లూరు జిల్లాలు కోస్తా జిల్లాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకూ “నీటి కేటాయింపులు, పారుదల రంగంలో పది సంవత్సరాలు ప్రాధాన్యత ఇవ్వాలని, అవసరమైతే ఈ ప్రాంత అవసరాలు తీరేవరకు ఒప్పందాన్ని పొడిగించాలి”. కృష్ణా, తుంగభద్ర, పెన్న నదులపై ప్రాజక్టుల నిర్మాణంలో రాయలసీమ జిల్లాల అవసరాలకే ప్రాధాన్యమివ్వాలనేది ఒప్పంద సారాంశం. అయితే సీమలో నిర్మించాల్సిన క ష్ణా-పెన్నార్ ప్రాజెక్టు కు బదులు నాగార్జున సాగర్ నిర్మించి, రాయలసీమకు మొండి చేయిచూపి కృష్ణాజలాలను కోస్తాజిల్లాలకు తరలించుకొనిపోయారు.
ఈ ఒప్పందం ప్రకారం “రాయలసీమ ప్రజల కోరిక మేరకు” రాష్ట్ర రాజధాని లేదా హైకోర్టులలో ఒకదాన్ని రాయలసీమలో ఏర్పాటు చేయాలి. 1953లో తాత్కాలికంగా కర్నూల్లో రాజధాని ఏర్పటు చేసి,1956లో హైదరాబాదుకు తరలించారు. 2014లో తిరిగి తెలంగాణ ఏర్పడ్డాక నాయుడిగారి తెలుగుదేశం ప్రభుత్వం ఏక పక్షంగా రాజధానిని, హైకోర్టును కోస్తాకు తరలించి రాయలసీమపై మూడవ కన్ను తెరచి రాయలసీమకు తీరని ద్రోహం చేశారు.
ప్రాంత విస్తీర్ణ పరంగా కోస్తా జిల్లాల కంటే ఏంతో పెద్దదైన రాయలసీమలో జనాభా తక్కువ ఉందని, కోస్తా ప్రాంతంలో జనాభా ఉందని, అందువల్ల జనాభా ప్రాతిపదికన శాసనసభలో కోస్తా నాయకుల ప్రాతినిధ్యం అధికంగా ఉంటుందని, అందువల్ల అప్పటి పెద్దలు రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు మిగిలిన ఆంధ్ర ప్రాంతంతో సమాన సంఖ్యలో శాసన సభ స్థానాలు కల్పించాలని శ్రీభాగ్ ఒప్పందంలో పేర్కొన్నారు. ఇది కూడా అమలులోకి రాలేదు.
రాష్ట్రంలో రాయలసీమ నాయకులే ముఖ్యమంత్రులుగా పని చేస్తున్నా, శాసనసభలో సంఖ్యాబలం ఉన్నఆంద్ర నాయకులు, వారి మద్దతుపై ఆధారపడిన ప్రభుత్వాలు రాయలసీమకు అన్ని రంగాలలో అన్యాయం చేసాయి. వారి, వారి రాజకీయ కారణాలవల్ల సీమ నాయకులు ఈ అన్యాయాలను సరిదిద్దలేక పోతున్నారు.
రాయలసీమ వాసుల కర్తవ్యం
రాయలసీమ అభివృద్ధికి కీలకమైన శ్రీబాగ్ ఒప్పందంలోని అంశాలను అమలు చేయడానికి రాయలసీమ ప్రజలు, ఉద్యోగులు విద్యార్థులు, రైతులు సంఘటితమై తమకు జరిగిన అన్యాయాన్ని అందరి దృష్టికితెచ్చి “రాయలసీమకు సాగు,తాగునీరు, పరిశ్రమలు, విద్యా, ఉపాధి అవకాశాలు, శాసన సభ స్థానాలు సమానంగా దక్కించుకోడానికి” నాయకులపై, ప్రభుత్వంపై వత్తిడి తేవడానికి కృషి చేయాలని దశరథరామి రెడ్డి కోరారు.
ఈ విషయాలను గుర్తు చేసుకొని, రాయలసీమ హక్కుల కోసం, శ్రీబాగ్ ఒప్పందం అమలు కోసం చేస్తున్న దీక్షగా జరపులోవాలని, సీమ భవిష్యత్తు కోసం కార్యాచరణ నిర్దారించుకోడానికి, శ్రీబాగ్ ఒప్పందం సాక్షిగా అక్టోబర్1ని ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినంగా పాటించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.