20, 21 శతాబ్దాల భిన్న దశలలో జీవించి, ఆ కాలాల ప్రజా ఉద్యమాల ముందు నిలబడ్డ రాజకీయ నాయకుడు తెలంగాణ బాపూజీ . బాపూజీ అంటే మనకి తెలిసిన పేరు మహాత్మాగాంధీ మాత్రమే. ఆ తర్వాత బాపూజీ అనే మూడుక్షర మాటకు నిలువెత్తు సాక్ష్యం లా నిలబడిన మరొక పేరు కొండా లక్ష్మణ్ బాపూజీ యే.
ఆయన జీవితం ఈ మాటకు తగ్గట్టునే మహర్షి జీవితంలాగా ఉంటుంది. తను పుట్టిన నేల, తన సమాజం, తన రాష్ట్రం, తన సంస్కృతి అని ఆవేదన చెంది వాటికోసం పోరాటమే తప్ప తన కుటుంబం, తన పిల్లలు, తన వారసులు, తన పదవి, తన డబ్బు, తన వ్యాపారాలనే వ్యామోహంలో పడిన నాయకుడు కాదు. రాజకీయాల్లో నా అనే మాటకు చోటీయలేదు. ఆయన ఎపుడే మనం గురించే ఆలోచించాడు.
ఈ గుణాలే ఆయనకు ఏ పదవి రాకుండా అడ్డుకున్నాయి. అందుకే ఆయనను ప్రజలు ఇంకా బాపూజీ యే అని పిలుస్తారు.
ఫ్రొపెసర్ కె. శ్రీనివాసులు (ఉస్మానియా యూనివర్శిటీ) ఒక సందర్భంలో చెప్పినట్లు ‘అది స్వాతంత్య్రానంతర భారతదేశపు కంపుగొడుతున్న మురికి రాజకీయాల చట్రానికి వెలుపల ప్రజారాజకీయాలకు అద్దం పడుతుంది. ఏక కాలంలో నాలుగు విభిన్న ప్రజాఉద్యమాలతో ఆయన జీవితం ముడివడి ఉంది. అవి: నిజాం వ్యతిరేక పోరాటం, వెనుకబడిన కులాల ఉద్యమం, చేనేత సహకారోద్యమం, ప్రత్యేక తెలంగాణోద్యమం.’ కొండాలక్ష్మణ్ బాపూజీ దార్శనికత మీద ప్రొ. శ్రీనివాసులు చక్కటి పుస్తకం రాశారు.
పాదయాత్ర అనేది గాంధేయ వాదంలో కీలకమయినది. తెలుగు నాట ఈ పాదయాత్రలకు శ్రీకారం చుట్టింది ఆయనే నని చెబుతారు. 1961లో మూసీనదికి వరదులు వచ్చి విపరీతంగా నష్టం వాటిల్లినపుడు నల్గొండ జిల్లాలో 220 కి.మీ పాదయాత్ర నిర్వహించారు.
పేద చేనేత కుటుంబం నుంచి వచ్చినా, ఆయనకులవృత్తులు పతనమవుతుండటం చూసి ఆ కులాలను ఆదుకునేందుకు నడుం బిగించారు. అందుకే ఈ వర్గాలకోసం అనేక ఏర్పాట్లు చేశారు. ఇలా తెలంగాణాలో ఆయన అన్ని వెనకబడిన కులాలకు ఆత్మీయుడయ్యాడు. ఆంధ్రలో మాచాని సోమప్పలాగా, తెలంగాణలో కొండా లక్మణ్ బాపూజీ సహకార ఉద్యమాన్ని బాగా ప్రచారం చేశారు.
1943లో చేనేత సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు.
1945లో సిరిసిల్లలో నిజాం రాష్ట్ర చేనేత మహాసభ నిర్వహించారు. 1952లో హైదరాబాద్ చేనేత సహకారం సంఘం 1955 లో ఉన్ని పారిశ్రామిక కేంద్ర సహకార సంఘం ఏర్పాటు, 1959లో కల్లు గీత సహకారం సంఘం ఏర్పాటు,1961లో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు, 1961లో చర్మకార పారిశ్రామిక సంఘం ఏర్పాటు చేశారు.
అందుకే కొండా లక్ష్మణ బాపూజీకి మాడపాటి హనుమంతరావు సహకార రత్న అవార్డు ప్రదానం చేశారు. వెనకబడిన వారి ప్రయోజనాల కోసం ఆయన తీవ్రంగా కృషి చేశారు. 1953లో ప్రధాని నెహ్రూ వెనకబడిన వర్గాల స్థితిగతులను అధ్యయనం చేసేందుకు నియమించిన కాకా కాలేల్కర్ కమిషన్ ముందు, 1978లో జనతా ప్రభుత్వం ఏర్పాటుచేసిన మండల్ కమిషన్ ముందు బిసిల గురించి వాదించారు.వాళ్లకి ఏహక్కులు కావాలో వివరిస్తూ నివేదికలు అందించారు.
మానవాతా వాది
బాపూజీ 100 శాతం మానవతా వాది. ఆయన మీద రాడికల్ హ్యూమనిస్టు ఎంఎన్ రాయ్ ప్రభావం బలంగా ఉంది. 1940 జూన్ 3 డెహ్రాడూన్ లోజరిగిన రాడికల్ హ్యూమనిస్టు శిక్షణా శిబిరంలో పాల్గొన్నారు. ఎంఎన్ రాయ్ రాసిన ఇండియా ఇన్ ట్రాన్సిషన్ ను ఉర్దూ లోకి అనువాదం చేశారు.
గాంధీని మాట ఎత్తడమే నేరమయిన రోజుల్లో ఆయన నైజాం ప్రాంతాలో తెల్లషరాయిని చించి, గాంధీ టోపిగా కుట్టుకుని ధరించిన ధిక్కారం ఆయనది. చివరకు వరకు ఈ టోపీని వదలలేదు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ఆదిలాబాద్ జిల్లా వాంకిడి గ్రామంలో నిరుపేద కుటుంబంలో 27 సెప్టెంబర్ 1915న జన్మించారు.
తల్లిదండ్రులది చేనేత వృత్తి. మూడేళ్ళ వయసులోనే తల్లి కన్నుమూసింది. ప్రాథమిక విద్య వాంకిడి, ఆసిఫాబాద్‌లో గడిచింది. హైదరాబాద్‌లో మెట్రిక్యులేషన్ చదివారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయన చదువు కొనసాగించలేకపోయారు. అందువల్ల హైదరాబాద్ లోని రాత్రి కళాశాలలో చేరి న్యాయ వాద విద్య పూర్తి చేశారు. వ 1940ల నాటికే న్యాయవాద వృత్తిని చేపట్టారు. లాయర్ గా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన వారికి అండగా నిలిచారు. వారి తరఫున కేసులు వాదిస్తూ న్యాయపోరాటం చేశారు.
నిజానికి తొలి నుంచి ఉద్యమాల్లో ఆయనది చురుకైన పాత్ర. ఒక ఉద్యమాన్ని ఎలా నడపాలో, ఎక్కడ నడపాలో, ఎవరెవరిని కదిలించాలో బాగా తెలిసిన బాపూజీ ఆ మేరకు కృతార్థుడయ్యారు. 1938లో పౌరహక్కుల ఉద్యమం, 1940లో ఆంధ్రమహాసభ ఉద్యమం, భారతదేశ స్వాతంత్య్ర పోరాటంలో భాగంగా 1942లో క్విట్ ఇండియా ఉద్యమం, 1952లో నాన్‌ముల్కి ఉద్యమం, 1969లో తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమం, 1996లో మలిదశ తెలంగాణ ఉద్యమం వంటి ఎన్నో పోరాటాలను సలిపిన ధీశాలి. 1947లో డిసెంబర్ 4న నిజాం కాన్వారుపై బాంబులు వేయడం, ఖాసీం రజ్వీ సాగిస్తున్న దురాగతాలకు వ్యతిరేకంగా పోరాడడం ఆయన ఉద్యమ పంథాను తెలుపుతున్నది. క్విట్ ఇండియా ఉద్యమంలో భాగంగా అబిడ్స్‌లోని బ్రిటీష్ పోస్టాఫీస్, కోఠిలోని బ్రిటీష్ రెసిడెన్సీపై బాపూజీ జాతీయ జెండాను ఎగురవేయడం అప్పట్లో సంచలనం సృష్టించింది.
స్వాతంత్య్రానంతర రాజకీయాల్లో…
1952లో తొలిసారిగా ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి ఎం.ఎల్.ఏ గా ఎన్నికయ్యారు. ఆయన దామోదరం సంజీవయ్య, మంత్రివర్గంలో 1962 జనవరి నుంచి 1962 మార్చి దాకా పని చేసారు.చిన్న తరహా, కుటీర పరిశ్రమలు, అబ్కారీ శాఖలను నిర్వహించారు.1967,1972 అసెంబ్లీ ఎన్నికలో నాటి నల్గొండ జిల్లా భువనగిరి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి గెలిచారు. 1967-69 మధ్య కాసు బ్రహ్మానందరెడ్డి మంత్రి వర్గంలో కార్మిక, ప్రజా సంబంధాలు, పర్యాటక శాఖల మంత్రిగా పనిచేశారు.