మాజీ ఆర్థిక మంత్రి పి చిదంబరం అరెస్టుకు ఉన్న అడ్డంకులను తొలగించిన ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తికి కేంద్రంలో చాలా ఉన్నత పదవి లభిస్తున్నది.
ఢిల్లీ హైకోర్టు జడ్జిగా మూడు రోజుల కిందట రిటైరయిన జస్టిస్ సునీల్ గౌర్ (62)ను కేంద్ర ప్రభుత్వం మనీ లాండరింగ్ ట్రిబ్యునల్ ( అపెల్లేట్ ట్రిబ్యునల్ ఆఫ్ ప్రివెన్షన్ అఫ్ మనీ లాండరింగ్ యాక్ట్) కు ఛెయిర్మన్ గా నియమించబోతున్నది.
ఆయన సెప్టెంబర్ 23న ఈ పదవీ బాధ్యతులు స్వీకరిస్తున్నారని తెలిసింది.
చిదంబరం అరెస్టుకు దారితీసిన ఉత్తర్వులను జారీ చేసిన మూడు నాలుగు రోజుల్లోనే కేంద్రం ఆయనను ఈ పదవికి ఎంపిక చేసింది.
మనీ లాండరింగ్ ట్రిబ్యునల్ కు ఇపుడు జస్టిస్ మన్మోహన్ సింగ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన సెప్టెంబర్ 23న రిటైరవుతారు. అదే రోజు ఢిల్లీ హైకోర్టు రిటైర్డ్ జడ్జి సునీల్ గౌర్ బాధ్యతలు స్వీకరిస్తారని ట్రిబ్యునల్ వర్గాలు మీడియాకు వెళ్లడించాయి.
చిదంబరం అరెస్టుకు దారి తీసిన ఉత్తర్వులను ఆయన రిటైర్ మెంట్ కు రెండు రోజుల ముందు జారీ చేశారు. ఐఎన్ ఎక్స్ మిడియా కేసులో తనని సిబిఐ అరెస్టు చేయకుండా తాత్వాలిక రక్షణ ఇవ్వాలని చిదంబరం వేసిని పిటిషన్ ను ఢిల్లీ హైకోర్టె న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సునీల్ గౌర్ ఆగస్టు 20 న తిరస్కరించారు.
చిదంబరం మనీ లాండరింగ్ కేసులో కింగ్ పిన్ (కీలకనాయకుడు) అని జస్టిస్ గౌర్ వ్యాఖ్యానించారు.అయితే, జస్టిస్ గౌర్ సిబిఐ కోర్టుకు సీల్డ్ కవర్ లో సమర్పించిన ఒక నోట్ ను మొత్తంగా తన ఉత్తర్వులో మక్కీకి మక్కీ దించారని చిదంబరం న్యాయవాదులు ఆరోపించారు.
గతంలో కూడా జస్టిస్ గౌర్ నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీలకు వ్యతిరేకంగా ఉత్తర్వులిచ్చారు. కోర్టుడివిజినల్ బెంచ్ సమర్థించింది. అయితే సుప్రీంకోర్టు నిలిపివేసింది.
జస్టిస్ గౌర్ 2008లో హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2012 లో పర్మనెంట్ జడ్జి అయ్యారు. హైకోర్టుకు ప్రమోషన్ పొందక ముందు ఢిల్లీ హయ్యర్ జ్యుడిషియల్ సర్వీసులో పనిచేశారు.