ఆగస్టు 25, 2019 క్రీడా చరిత్రలో ఓ అత్యద్భుతమైన రోజు. మన భారత క్రీడారంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించ దగిన రోజు. ఈ ఆదివారం రోజున ప్రపంచంలోని మూడు వేర్వేరు మూలల్లో మూడు అద్భుత ఘట్టాలు విచ్చుకున్నాయి.
*మన తెలుగు బంగారు కొండ పి వి సింధు స్విట్జర్లాండ్ లోని బాసెల్ లో ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ సువర్ణ శిఖరం అధిరోహించింది.
*యూరప్ లోనే మరోమూల లీడ్స్ క్రికెట్ మైదానంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో క్రికెట్ టెస్టులో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ కు అనూహ్యమైన అత్యద్భుత విజయాన్ని సాధించి పెట్టాడు.
*ఇంకో మూల ఆంటిగ్వాలో వెస్టిండీస్ పై భారత క్రికెట్ జట్టు తొలిటెస్టులో అత్యధిక పరుగుల ఘన విజయం సాధించింది.
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుల్లో 1980లో ప్రకాష్ పడుకోన్, దాదాపు 20 ఏళ్ల తర్వాత 2001లో పుల్లెల గోపీచంద్ లు ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ షిప్ గెలిచారు గానీ ప్రపంచ ఛాంపియన్ షిప్ మాత్రం ఇన్నేళ్లుగా మనకు అందని పండుగానే మిగిలింది.
ప్రపంచ ర్యాంకింగ్ లో ఆ ఏడాది నంబర్ వన్ గా కొనసాగినా 1983 ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మాత్రం ప్రకాష్ కాంస్యంతో సరిపెట్టుకోవలసి వచ్చింది.
ప్రకాష్ స్థాపించిన బ్యాడ్మింటన్ అకాడెమీలో శిక్షణ పొందిన మన తెలుగు తేజం పుల్లెల గోపీచంద్ గురువుకు తగ్గ శిష్యుడిగా తనూ ఆల్ ఇంగ్లండ్ ఛాంపియన్ షిప్ సాధించాడే తప్ప భారతక్రీడాకారులకు ప్రపంచకిరీటం మాత్రం కలగానే మిగిలింది.
ఇప్పుడు మళ్లీ గోపీచంద్ శిక్షణలోనే పెరిగి పెద్దయిన సింధు బ్యాడ్మింటన్ ప్రపంచ శిఖరంపై విజయగర్వంతో నిలబడటం భారతీయులకందరికీ గొప్ప స్ఫూర్తి నిస్తున్నది.
ఆదివారం నాటి తుది సమరంలో సింధు ధాటికి ఎదురే లేకపోయింది. క్రితం ఏడాది 110 నిమిషాల సుదీర్ఘ అంతిమ సమరంలో స్వర్ణం చేజారిన సింధు ఈ సారి కేవలం 33 నిమిషాల్లోనే అదే ప్రత్యర్థి జపాన్ కు చెందిన నొజోమి ఒకుహరను స్ట్రెయిట్ సెట్లలో 21-7, 21-7 స్కోరుతో చిత్తు చిత్తుగా ఓడించింది.
గోపీచంద్ సంధించి వదిలిన బాణాల్లా సైనా నెహ్వాల్, సింధు దూసుకురావటంతో గత ఏడెనిమిదేళ్లలో అంతర్జాతీయ రంగంలో చైనా, జపాన్ ల గుత్తాధిపత్యానికి కళ్లెం వేసినట్టయింది. 2013, 14 ప్రపంచ ఛాంపియన్ షిప్ లలో సింధు రెండు సార్లూ సెమీస్ లో ఓడి కాంస్యంతో సరిపెట్టుకుంది.
సైనా 2015లో రజతాన్నీ, 2016లో కాంస్యాన్ని గెల్చుకుంది. పోతే, గత మూడేళ్లుగా ప్రతి సారీ ఫైనల్ చేరిన సింధుకు ముచ్చటగా మూడో ప్రయత్నంలో కిరీటం చేజిక్కింది.
మన దేశంలో క్రికెట్ పై మోజు కారణంగా మిగత క్రీడలన్నీ ఆదరణలేక వెలవెలపోతున్న తరుణంలో సైనా, సింధు ప్రపంచ స్థాయిలో వీరవిహారం చేయడం వల్ల బ్యాడ్మింటన్ కి ఉన్నట్టుండి ఆదరణ పెరిగింది.
ఐపిఎల్ మాదిరే బ్యాడ్మింటన్ కు కూడా మన దేశంలో ఓ ప్రిమియర్ లీగ్ టోర్నీ జరుగుతున్నదంటే నేడు పరిస్థితి ఎంతగా మారిపోయిందో అర్థం చేసుకోవచ్చు.
సింధు విజయ సంరంభాల్లో ఎవరూ గమనించలేదు గానీ మన తెలుగు కుర్రాడే అయిన భమిడిపాటి సాయి ప్రణీత్ ఇదే ప్రపంచ ఛాంపియన్ షిప్ పురుషుల విభాగంలో కాంస్యం గెలిచాడు.
1983లో ప్రకాష్ పడుకోనే సాధించిన ఈ విజయం తర్వాత మన క్రీడాకారుడొకరు సెమీస్ దాకా వెళ్లడం ప్రపంచ ఛాంపియన్ షిప్ లో మళ్లీ ఇదే ప్రథమం.
ఇంకో తెలుగు తేజం కిడాంబి శ్రీకాంత్ గత ఏడాది ప్రపంచ నంబర్ వన్ ర్యాంకు పొందిన మొట్టమొదటి భారత క్రీడాకారుడుగా ఘనత పొందాడు. గోపీచంద్ అకాడెమీ కుర్రాళ్లు సాధిస్తున్న విజయాలు గమనిస్తే ప్రపంచ ఛాంపియన్ షిప్ ను భారత క్రీడాకారుడు చేజిక్కించుకునే శుభతరుణం ఎంతో దూరం లేదనిపిస్తుంది.
బెన్ స్టోక్స్ వీరవిహారం
ఇటు లీడ్స్ మైదానంలో ఆసీస్ తో జరిగిన టెస్టు సమరంలో ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పోరాట పాటవం ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు అనూహ్య విజయం చేకూర్చింది.
359 పరుగుల టార్గెట్ ను ఛేదించడం గొప్ప విషయం కాదు గానీ అపజయం అంచుల్లో కత్తి అంచుపై నడుస్తున్నట్టుగా సాగిన చివరి వికెట్ భాగస్వామ్యంలో స్టోక్స్ చూపిన పోరాట పాటవం, సంయమనం, అన్నింటినీ మించి ఎంతటి విపరీత విపత్కర పరిస్థితుల్లోనైనా అపజయమంగీకరించని కరడు గట్టిన మొండితనం అందరిలోనూ అన్నివేళలా కనిపించే లక్షణాలు కావు.
బెన్ స్టోక్స్ కే ఇంకోసారి బ్యాట్ చేతికిచ్చి పంపినా ఇంత గొప్పగా ఆడలేకపోవచ్చు.
ఇంగ్లండ్ స్కోరు 159 పరుగులు ఉండగా రూట్ అవుటై నప్పుడు స్టోక్స్ క్రీజులోకి వచ్చాడు. ఈ రోజు తనదే ననీ, తానో అత్యద్భుతమైన ఇన్నింగ్స్ ఆడబోతున్నానని బహుశ స్టోక్స్ కూడా అనుకొని ఉండడు.
ఆసీస్ బౌలర్లు హాజిల్ వుడ్, కమ్మిన్స్, స్పిన్నర్ లియాన్ మంచి ఊపులో ఉండగా ప్రతి బంతీ ఒక్కో పెద్దసవాలుగా, ఆటలో క్షణక్షణం దుర్గమంగా సాగడంతో అసలు స్టోక్స్ పరుగుల ఖాతా తెరిచేందుకే దాదాపు 20 బంతులు పైగా తీసుకున్నాడు.
పార్ట్ నర్ బార్ స్టో ధాటిగా ఒకటి రెండు బౌండరీలు కొట్టాక కానీ తాను సైతం అలా ఆడగలనని అతనికి గుర్తొచ్చినట్టు లేదు. 261 పరుగుల వద్ద క్రిస్ వోక్స్ అవుటయ్యేసరికి స్టోక్స్ ఇంకా అప్పుడే అర్ధ సెంచరీ దాటాడు. 286 వద్ద జోఫ్రా ఆర్చర్, క్రిస్ బ్రాడ్ వెంటవెంటనే అవుటయ్యేసరికి ఇంగ్లండ్ విజయానికి 73 పరుగుల దూరంలో ఉంది. అప్పటికి స్టోక్స్ వ్యక్తిగత స్కోరు 61. ఆ పరుగులు చేసేందుకతను 174 పరుగులు ఎదుర్కొన్నాడు.
ఇదిగో ఈ దశ నుంచి స్టోక్స్ లోని ఓ మొండి మనిషి, అపజయభారం భరించలేని ఓ అసహాయశూరుడూ కవచం విప్పుకొని క్రమక్రమంగా బయటకు రాసాగాడు. ఈ కొత్త స్టోక్స్ ను గుర్తుపట్టి కంగారు పడేలోగానే కంగారూల పని అయిపోయింది.
పదో వికెట్ భాగస్వామి జాక్ లీచ్ తో కలిసి విజయలక్ష్యం 359కి ఇంకో మూడు అదనంగా కలిపి 362 పరుగులు చేసేసరికి, మొత్తం 76 పరుగుల ఆఖరి అజేయ భాగస్వామ్యంలో లీచ్ వాటా ఒకే ఒక్క పరుగు. టెస్టు ఆఖరి సన్నివేశంలోని రౌద్రావతారంలో స్టోక్స్ చేసిన 75 పరుగులకు అవసరమైంది కేవలం 54 బంతులే. ఈ పతాక సన్నివేశంలో అవుటయ్యే ప్రమాదం నుంచి స్టోక్స్ రెండు మూడు సార్లు త్రుటిలో బయటపడ్డాడు.
అయినా ఎవరూ నొచ్చుకోలేదు. ఫార్చూన్ ఫేవర్స్ ది బ్రేవ్ అనుకున్నారంతే. ఒకవేళ స్టోక్స్ అవుటై ఉంటే, తొలి ఇన్నింగ్స్ లో 67కు ఆలౌట్ అయిన అదే జట్టు రెండో ఇన్నింగ్స్ లో 359 పరుగులు ఛేజ్ చేసి గెలవడం, అందునా ఒకే ఒక్కడు 135 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయపథాన నిలపడమనే ఓ అద్భుత చారిత్రక సన్నివేశాన్ని ప్రపంచం మిస్సయ్యేది.
రహానే, బుమ్రా మెరుపులు
ఇండియా, వెస్టిండీస్ ల మధ్య ఆంటిగ్వాలో జరిగిన తొలిటెస్టులో రెండు రికార్డులు బద్దలయ్యాయి. 318 పరుగుల తేడాతో సాధించిన విజయం భారత జట్టుకు పరుగుల రీత్యా విదేశాల్లో జరిగిన సిరీస్ లో అతి భారీ విజయం. మరోవైపు విండీస్ రెండో ఇన్నింగ్స్ లో 100 పరుగులకు ఆలౌట్ కాగా ఆ జట్టుకు భారత్ పై అత్యల్ప స్కోరు కూడా ఇదే కావడం విశేషం.
ఇండియా రెండో ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 343 పరుగుల స్కోరు వద్ద డిక్లేర్ చేయగా, అజింక్య రహానే (102), యువతరంగం హనుమ విహారి (93) ఓ వెలుగు వెలిగారు.
రెండో ఇన్నింగ్స్ లో విండీస్ ను కుప్పకూల్చడంలో జస్ ప్రీత్ బుమ్రా చండప్రచండంగా బంతులు విసిరాడు. ఎనిమిది ఓవర్లలో మూడు మెయిడిన్ లు వేసి కేవలం ఏడు పరుగులకు ఐదు వికెట్లు కూల్చడం (8-3-7-5) బహుశ టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓ అత్యద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనగా నిలిచిపోతుంది.