కడప జిల్లా ప్రజలపై మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు అక్కసు వెళిగక్కుతున్నారు.
అధికారంకోసం అంగలారుస్తూ అన్ని రకాల చట్ట వ్యతిరేకమైన పనులకు పాల్పడుతూ రాజకీయ అవినీతిని పెంచి పోషిస్తూన్న నాయకుల ముఠా కక్షల, కరువు మధ్య నిరంతరం నలుగుతూ ఉంది.
ఇపుడు జిల్లా ప్రజలపై మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ప్రతిపక్షనేత చంద్రబాబు ఎందుకు కక్ష పునారో అర్థం కావడం లేదని, ఇటీవల కడప జిల్లాపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర మనస్తాపం కలిగిస్తున్నాయని మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ ఆవేదన వ్యక్తం చేశారు.
తన తన నోటికాడి అధికారాన్ని గద్దలా తన్నుకు వెళ్లిన జగన్మోహన్ రెడ్డి పై ఉన్న ఆక్రోశం మొత్తం జిల్లా ప్రజలపై చూపడం చంద్రబాబుకు తగదని ఆమె అన్నారు.
ఇటీవల కాలంలో చంద్రబాబు అసెంబ్లీలను,అసెంబ్లీ లోను, బయట పత్రికా విలేఖరుల సమావేశంలోనూ కడపను, పులివెందులను తిడుతూ పతాక శీర్షికలకు ఎక్కారని ఆమె గుర్తు చేశారు.
తనని శంకరగిరి మాన్యాలు పట్టించిన జగన్మోహన్ రెడ్డిని తిట్టాలనుకుంటే నేరుగా ఆయన్ను తిట్టడం సబబుగా ఉంటుందని జిల్లాను తిట్టడం తగదని ఆమె చంద్రబాబుకు చెప్పారు.
“తమలపాకుతో తానొకటంటే కాడిమానుతో తాను రెండు తిరగబెట్టే” అనేది పురాతన కాలం నాటి సామెత. ప్రస్తుత స్థితిలో “మీరు జగన్ ను తమలపాకుతో తాకితే వారు కాడిమానుతో మోదగలరనే” భయంతో మీరు జిల్లా ప్రజలను తిట్టడం భావ్యం కాదని జయశ్రీ చంద్రబాబుకు సూచించారు.
కృష్ణ దేవరాయల కాలం నుండి ఈ ప్రాంత ప్రజలు పాలెగాళ్ళ పాలనలో మగ్గిపోయారని, ఆ తర్వాత వచ్చిన నాయకులు ప్రజాస్వామ్యం ముసుగులో పాతకాలం నాటి పాలెగాళ్లను, వారిని మించిన రౌడీలను నాయకులుగా తీర్చిదిద్ది ప్రజలపై వదిలారని, ఇందుకు మీరుకూడా మినహాయింపు కాదనే గుర్తుంచుకోవాలని ఆమె అన్నారు. 1978 నుండి రాజకీయాలలో ఉండి మీరు ఏమి చేశారో చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.
1985లో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతొ టీడీపీలో చేరిన మీరు ఆ తర్వాత ఈ జిల్లాలో ముఠాలను, రౌడీలను ఎందుకు ప్రోత్సహించారో చెప్పాలని, 1995-2004, 2014-2019 మధ్య ముఖ్యమంత్రిగా, 1990-94, 2004-2014 మధ్య ప్రతిపక్ష నేతగా ఉండి మీరు చేసింది కూడా ముఠాలను పెంచి పోషించడం కాదా? అని ఆమె ప్రశ్నించారు.
ప్రస్తుతం మాత్రం మీరు ముఠా నాయకులను కాకుండా గాంధీ వారసులను, స్వాతంత్ర పోరాట యోధులను ప్రోత్సహిస్తున్నారా? 1985 నుండి మొన్నటి ఎన్నకల వరకు మీ పార్టీ పోటీలో పెట్టిన అభ్యర్థుల చరిత్ర గురించి దేశమంతా తెలుసు. మీరు, జగన్మోహన్ రెడ్డి “దొందు దొందే”. మీరు మీరు తిట్టుకోవడం, వ్యవస్థలను నాశనం చేయడం బాగుంటుంది కానీ తిన్నా- తినకున్నా వారి మానాన వారు బ్రతుకుతున్న ప్రజలను, మీ లాంటివారు పుట్టిన పాపానికి ఆయా ప్రాంతాలను తిట్టడం సబబు కాదని , మీరు ఇలాగే వ్యవహరిస్తే ప్రజల ఆగ్రహాన్ని చవి చూడాల్సి ఉంటుందని, అలాగే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు. ఈ సమావేశంలో జయశ్రీతో పాటు పౌరహక్కుల సంఘం నాయకురాలు వరలక్ష్మి, సిపిఐ, సీపీఎం నాయకులు పాల్గొన్నారు.