(అర్జున్ రెడ్డి2 + గీత గోవిందం2) – పెళ్లి చూపులు = “డియర్ కామ్రేడ్”
“అర్జున్ రెడ్డి”హీరో, “గీత గోవిందం”హీరో (మళ్లీ ) హీరోయిన్లు, ఆ రెండు సినిమాల్లో కొన్ని సీన్లు, అక్కడ (గీత గోవిందం) హీరో హీరోయిన్ వెంట పడితే ఇక్కడ కాసేపు తర్వాత హీరోయిన్ హీరో వెంటపడడం, “మీ- టూ ” ఉద్యమం నేపథ్యంలోని కథను “చల్లకొచ్చి ముంత దాయడం” లాగా చివరి వరకు దాచి బయట పెట్టడం, ఈతరం యూత్ కు నచ్చే కొన్ని సీన్లు, డైలాగులు, ఫైట్లు, వెరసి “డియర్ కామ్రేడ్” సినిమా! విజయ్ దేవరకొండ పాత సినిమాల జాడలు, కొన్నిఅవశేషాలు ఈ సినిమాకు అడ్డంకి గా మారే అవకాశం ఉంది.
ఒక ఉద్యమం – ఒక ప్రేమ కథ – ఇద్దరు విడిపోవడం – మళ్లీ కలవడం – చివర్లో హీరోయిన్ లక్ష్యం కోసం విజయ్ దేవరకొండ హీరోయిక్ గా (భీభత్సంగా) ప్రయత్నాలు చేయడం – (చివరికి ఏమౌతుందో చెప్పాల్సిన అవసరం లేదు) ఇది స్థూలంగా’ చిత్ర కథ.
పెళ్లి చూపులు లాంటి లో బడ్జెట్, సక్సెస్ ఫుల్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమా తో యూత్ కు, గీతగోవిందం సినిమాతో ఇతరా ప్రేక్షకులకి బాగా కనెక్ట్ అయ్యాడు. అయితే ఆ సినిమా ల హ్యాంగోవర్ (నిజంగా హ్యాంగోవరే!) నుంచి ఇంకా బయట పడినట్లు అనిపించడం లేదు. మూడు సినిమాల్లో కలిపి అతను తాగిన సిగరెట్లు, మందు ఎక్కువే! ఒక్క గీతగోవిందం లోనే కాస్త తక్కువ.
సినిమాటిక్ గా అయినా సరే హీరో తో పాటు ఫ్రెండ్స్ కలిపి మందు సిగరెట్ల ఖర్చు బాగానే అయ్యుంటుందని సినిమా చివర్లో ఎవరో జోక్ చేశారు.
సినిమాలో వాళ్ళు మందు తాగుతున్నప్పుడు కింది వర్గాల్లో ” ఏ brand తాగుతున్నార్రా?” అన్నకామెంట్ కి పై వర్గాల్లో నుంచి (జానీ వాకర్) అని ఎవరో కేకేస్తే, మళ్ళీ కింది వర్గాల్లో నుంచి “అంత లేదన్నా, blenders spride అన్న కేక వినబడింది.
దీన్ని బట్టి సినిమా అప్పటి వరకు బోర్ కొట్టిందని అర్థం చేసుకో వచ్చు. (లేదా కామెంట్స్ చేసినవారు మందు సన్నివేశాలను ఎంజాయ్ చేస్తున్నారని కూడా అర్థం చేసుకోవచ్చు). రెండు కూడా సినిమాకు ఉపయోగపడవు!
ఈమధ్య దాదాపు అన్ని సినిమాల్లోనూ, హీరో ఫ్రస్ట్రేషన్ లో మందు, సిగరెట్లు తాగడం వంటివి చూపిస్తున్నారు. ఈ సినిమా మొదటి సీన్ లోనే హీరో వాష్ రూమ్ లో మందు ఫుల్లుగా తాగేసి సంబంధం లేని వ్యక్తుల తో గొడవపడి తన చూపించడంతో సినిమా గురించి ప్రేక్షకులకు కొంచెం అర్థమవుతుంది.
విజయ్ దేవరకొండ ప్రతి సినిమాలో ముగ్గురో నలుగురో క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్లందరికీ మందు అలవాటు ఉంటుంది. వాళ్లు ఏం చేస్తుంటారు అన్నది అర్థం కాదు. ఇందులోనూ అంతే. వాళ్లంతా కలిసినప్పుడల్లా మందు తాగడం తప్ప వేరే డిస్కషన్స్ ఉండవు. ఈ సినిమాలో చాలా రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయి యువతకి. మందు తాగి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం హీరోయిజానికి(కొండొకచో విజయ్ కి కూడా) సూచిక గా మారింది!?
ఇంత చెప్పాక సినిమా లో ఉన్న సినిమాటిక్ అంశాలను ప్రస్తావించడం సమంజసం. హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ బావుంది.. కానీ ఫిజిక్స్ అంత బాలేదు.
పైగా దర్శకుడు అల్లుకున్న కథలో ముఖ్యమైనన్నీ వదిలేసి ఇతర అంశాల పట్ల ఫోకస్ చేయడం వల్ల, సినిమా అంతగా ఆకట్టుకోదు. నటీనటుల విషయానికి వస్తే దేవరకొండకు ఇటువంటి పాత్ర నల్లేరు మీద నడకే! (బాగా అలవాటు ఉంది కనుక) కొన్ని చోట్ల బ్రిలియంట్ గా అనిపించినా, పాత్ర క్యారెక్టరైజేషన్ సరిగ్గా లేకపోవడం తో కొంచెం ఇబ్బంది ఉంది. రష్మిక పాత్ర కూడా అంతే. అయితే హీరో హీరోయిన్ ల మధ్య కొన్ని సన్నివేశాలు హార్ట్ టచింగా ఉన్నా, కథనం లో ఉన్న కన్ఫ్యూజన్ వల్ల అవి తేలిపోయే అవకాశం ఉంది.
ఈ సినిమా కున్న మరో లోపం “ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమా కూడా దీనిలో కి రావడం. సినిమా మలి భాగంలో మండి మోటార్ సైకిల్ వేసుకొని అలా గుట్టల్లోకి పర్వతాల్లోకి వెళ్లిపోతాడు. దాంతో కథ ఎటో వెళ్ళిపోతుంది. ఇలాంటి సైడ్ ట్రాక్స్ ఎన్నో ఉంటూ చివర్లో మళ్ళీ మీ-టూ ఉద్యమం లోకి వచ్చేసి కథ నడపడం వల్ల పెద్దగా ఉపయోగం కనపడదు.
ఫోటోగ్రఫీ, సంగీతం ఈ సినిమా కున్న పాజిటివ్ పాయింట్లు. అయితే దర్శకుడు బ్రిలియంట్ గా సినిమాను కొంతవరకు నడిపినా తర్వాత సినిమాను ఎటో తీసుకు వెళ్లిపోవడం వల్ల బిగువు తగ్గి, బోర్ కొట్టే అవకాశం ఉంది.
అయితే ఈ సినిమా కొంతవరకు యూత్ కి నచ్చే అవకాశం ఉంది.విజయ్ దేవరకొండ కోసం సినిమాలు నచ్చే వాళ్లు ఈ సినిమాను చూడగలుగుతారు. ఇతర ప్రేక్షకులకు ఇది అంతగా కనెక్ట్ కాకపోవచ్చు