పిల్లలు ఎలా చదువుతున్నారో మనం గమనిస్తున్నామా?

[ajax_load_more post_type=”post” pause=”true” destroy_after=”1″ scroll_distance=”10″ progress_bar=”true” progress_bar_color=”ed7070″]
( త్రిభువన్)
ఈ సమాజం, ప్రపంచం సరిగ్గా నడవడానికి, అభివృద్ధి చెందడానికి, ముందుకు వెళ్లడానికి, మనిషి ఇంకా మంచి మనిషిగా మారడానికి చదువు ఒక్కటే మార్గం. చదువులేని వారికైనా, ఉన్నత విద్యావంతులకైనా తమ పిల్లలు బాగా చదువుకోవాలని ఉంటుంది.
పిల్లల చదువు కోసం ఎంతఖర్చు పెట్టడానికైనా ఈకాలం తల్లిదండ్రులు వెనకాడ్డంలేదు. దీన్ని అదనుగాచూసి అనేక రకాల కార్పొరేట్ స్కూళ్లు వెలిసి పెద్దమొత్తంలో ఫీజులు వసూలుచేస్తున్నాయి. ఈ ట్రెండ్ తెలుగురాష్ట్రాల్లో అధికంగా ఉండడం చూస్తూనే ఉన్నాం.
అసలు పిల్లలు ఏ విఙ్ఞాన నైపుణ్యాలను, పరిణితులను ఆశించి చదువుకుంటారు? మనపిల్లలు సరైన పద్దతుల్లో చదువుతున్నారా? వాళ్లలో చదువు తేవలసిన మార్పులు వస్తున్నాయా? అనేవి ప్రతి తల్లి, తండ్రి పరీక్ష చేసుకుంటూ సరైన విధంగా చదివించాలి. లేకపోతే పిల్లలకి డిగ్రీలు మాత్రమే వస్తాయి, వాళ్లలో అవసరమైన మార్పు రాదు. నిజమైన మార్పు రాకపోతే మొదట్లో మంచిఉద్యోగం తెచ్చుకున్నా ఆపైన వృత్తిలో, జీవితంలోకూడా ఒడిదుడుకులకే అవకాశం ఎక్కువ.
అందుకే పిల్లల సరైన పెంపకం అంతసులభమైన పనికాదు. తల్లిదండ్రులు అవగాహన కలిగివుండి, పిల్లలు పుట్టినప్పట్నుండి దీర్ఘకాలంపాటు శ్రమించాల్సివుంటుంది.
మనిషి మిగతా అన్ని జంతువులకంటే చాలా పరిణామం చెందిన మెదడుతో పుడతాడు. పుట్టినప్పుడే అతడు తనను తాను రక్షించుకుంటూ సంపూర్ణంగా జీవించడానికి తగిన మౌలిక శక్తియుక్తులతో పుడతాడు. అడవిలోవున్నా అవసరమైనవన్నీ మొదటి అయిదారేళ్లలో నేర్చుకుంటాడు.
ఐతే నాగరికత అభివృద్ధి చెంది, సాంకేతికత పెరిగి మనుషులు వ్యవస్థాత్మక సమాజాలేర్పరుచుకున్నారు. కాబట్టి ఆ మెళుకువలు సరిపోవు. అందుకే స్కూళ్లూ కాలేజీలు ఏర్పడ్దాయి.
అయినాసరే వీటిల్లో నేర్చుకునే చదువంతా సహజంగా మెదడు పనిచేసే ఆ మౌలిక సూత్రాలు, పద్దతులననుసరించి మాత్రమే చేయాలి. అప్పుడే మనిషిలో అభిలషణీయమైన మార్పులు కలుగుతాయి. అలాకాకుంటే డిగ్రీలు సంపాయించినా చాలారకాల బలహీనతలు, లోట్లు తప్పవు.
అసలు ఈ మౌలిక సూత్రాలు ఎలా ఉంటాయి? తరచి చూస్తే ఇది సముద్రమంత విషయం. క్లుప్తంగా కొన్ని విషయాలు ఇక్కడ ప్రస్తావించుకోవడం వల్ల మిగతా విషయాలు తెలుసుకోవడంపట్ల ఆసక్తి కలుగుతుంది. ప్రతి తల్లీ, తండ్రి ఇవన్నీ తప్పనిసరిగా తెలుసుకోవాలి.
నేర్చుకోవడం అనే ప్రక్రియ మనిషిలో పుట్టుకనుంచీ సహజంగా ఉంటుంది.
ఇది వయసు పెరిగేకొద్దీ తగ్గుతూపోతుంది. కాబట్టి చిన్నప్పటినుంచే తల్లిదండ్రులు దీనికి ఆటంకం కలగకుండా చూడడమేకాక దీన్ని వివిధరకాలుగా ప్రోత్సహించాలి.
తల్లిదండ్రులు మొదటి గురువులు కాబట్టి వాళ్లు సరైన రీతిలో పిల్లలు నేర్చుకోవడంపట్ల శ్రద్ధ వహించాలి.
పిల్లలు చుట్టూ ఉన్నవాటిని చూసి, గమనించి నేర్చుకుంటారు. వారి అనుభవంలో లేని, ఊహలకందని పెద్దల వ్యవహారాలు, ఇతరుల అభిప్రాయాలు, మతసంబంధమైన సిద్ధాంతాలు, కార్యక్రమాల్లాంటివి మరీ చిన్నవయసులో బోధిస్తే వారికి అయోమయం పెరుగుతుంది. వాళ్లదృష్టితో కాకుండా పెద్దల దృష్టితో వాళ్లకు మంచిచెడులు నేర్పితే వాళ్ల సునిశితదృష్టి మందగిస్తుంది. పెద్దలకు తెలియకుండా వాళ్లు తమకు నచ్చిన వేరే విషయాలు నేర్చుకుంటారు. వయసునుబట్టి వారికి చెప్పే విషయాలు మారుతూంటాయి. వాళ్ల అనుభవానికందే చిన్న నీతికథలు, వాళ్ల పరిధిలో ప్రపంచాన్ని అర్థంచేసుకోవడం ఇలాంటివి లాజికల్ గా చెబితే వారి మేధస్సు సరైన పద్ధతిలో వికసిస్తుంది. భయపెట్టడం, బలవంతంగా రుద్దడం, బట్టీకొట్టించడం వల్ల సున్నితమైన నేర్చుకునే ప్రక్రియ దెబ్బతింటుంది.
పిల్లలు సహజంగా నేర్చుకునే పద్ధతులు, విధానాలు వీటిమీద పురాతనకాలం నుంచి ఆధునిక కాలం వరకూ అనేక పరిశోధనలు జరిగి కొన్ని మౌలిక అంశాలను రూపొందించడం జరిగింది. కొన్ని ఇలావున్నాయి.
ఉదాహరణకు వేదకాలంలోనే పిల్లలు ఒక చదువుకునే విషయాన్ని 25% ఉపాధ్యాయుడి (తల్లిదండ్రులుకూడా కావచ్చు) ద్వారా, 25% ఇతరపిల్లలతో చర్చించడం ద్వారా, 25% స్వంతంగా, చివరి 25% ఉత్తరోత్తర కాలంలో (లోతుగా ఆలోచించడం, అనుభవాలు, పరిశోధనలద్వారా) నేర్చుకుంటారని ప్రమాణీకరించారు.
ఇప్పుడు మొత్తం విషయాన్ని (100%) స్కూల్లో టీచరుద్వారానే నేర్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది ఎంత అసమంజసమో వేరే చెప్పక్కర్లేదు.
మిగతా దారులన్నీ మూసేయడంవల్ల ఉపాధ్యాయుడెంతసేపు బోధించినా పిల్లలు నిజంగా నేర్చుకునేది పరిమితంగానే ఉంటుంది. కాబట్టి స్కూల్లో పద్ధతులు మార్చుకోవడమేకాక, తల్లిదండ్రుల పర్యవేక్షణలో ఒక్కరే ఇంట్లో, అప్పుడప్పుడు స్నేహితులతో కలసి పిల్లలు చదువుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. హోమ్ వర్క్ ఇవ్వడం ఆ ఉద్దేశ్యంతోనే మొదలైంది, కానీ సరైన విధంలో ఇవ్వకపోవడం వల్ల ఇప్పుడది ఒక మొక్కుబడిప్రక్రియగా తయారైంది.
ఆధునిక శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం పిల్లలు వివిధ పద్ధతుల్లో నేర్చుకుంటారు. కొంత మాటల (వాచ్యంగా, ఉపాధ్యాయుడిద్వారా లేక అచ్చులో) మరికొంత బొమ్మలద్వారా (చిత్రాలు, గ్రాఫులు విడియో లు), కొంత సమాచారం ద్వారా మరికొంత ఆలోచనద్వారా, కొంత వెంటనే మరికొంత నిదానంగా… ఇలా వివిధరకాలుగా. కాబట్టి చదువునేర్పే పద్ధతుల్లో ఇవన్నీ ఉన్నప్పుడే నేర్చుకోవడం సంపూర్ణమౌతుంది.
విద్యార్థులు పెరిగేకొద్దీ వాళ్లు నేర్చుకోవలసిన విఙ్ఞాన, నైపుణ్య విధానాలను కూడా విద్యావేత్తలు క్రోడీకరించారు. అంటే చిన్నప్పుడు సరళమైనవిధంగా పెరిగేకొద్దీ క్లిష్టమైనవిధంగా నేర్చుకోవాలి. చదువు ముగిసే సమయానికి సంక్లిష్టమైన విషయాలను అర్థంచేసుకోవడమేకాక అంతకంటే సంక్లిష్టమైనవి రూపొందించాల్సిన బాధ్యతకూడా ఎప్పటికప్పుడు యువతమీద ఉంటుంది. మనపిల్లలు అంత శక్తివంతులు కావాలంటే, ఉన్నతమైన జీవితాన్ని పొందాలంటే అలాంటి శక్తియుక్తులు నేర్చుకోక తప్పదు.
వీటిని ‘మాడిఫైడ్ బ్లూంస్ టాగ్జానమి’ అంటారు. సరళమైన నైపుణ్యాలనుంచి క్లిష్టమైన నైపుణ్యాలను నేర్చుకునేదిశగా అన్నమాట. అది ప్రస్తుతం స్థూలంగా ఇలా ఉంది.
1. Information (విషయ క్రోడీకరణ)
2. Knowledge (విషయాన్ని ఒకక్రమంలో నిర్మించుకోవడం)
3. Comprehension (విషయాన్ని అవగాహన చేసుకోవడం)
4. Application (విషయాన్ని సంబంధిత కార్యాలకు అన్వయించుకోవడం)
5. Analysis (విశ్లేషణ, విషయం సరైందాకాదా అని పరీక్షించడం)
6. Communication (విషయాన్ని లేక విశ్లేషణను తెలియబరచడం)
7. Evaluation or Judgement (విషయంలో తప్పొప్పులు నిర్ణయించడం)
8. Problem solving (అందులోని సమస్యలు పరిష్కరించడం)
9. Creativity (ఇప్పుడు ఉన్నదానికంటే మంచిది రూపొందించడం)
పై పట్టీలో 1 నుంచి 4 వరకు క్రిందిస్థాయి నైపుణ్యాలని, 5 నుంచి 9 వరకు పైస్థాయి నైపుణ్యాలని అంటారు. ఇందులో 4 నుంచి 9 స్థాయిల వరకూ ఉన్న నైపుణ్యాలను మన స్కూళ్లల్లో, కాలేజీలల్లో సరిగ్గా నేర్పించడంలేదనీ, కేవలం బట్టీ కొట్టిస్తున్నారని అందుకే మనపిల్లలు మంచి ఉద్యోగాలకు పనికిరావడంలేదని నిపుణులు చెప్పడం మనం వింటూనే ఉన్నాం.
విద్యాసంస్థలు, తల్లిదండ్రులు ర్యాంకులమీది మోజుతో పిల్లలని సరైనవిధానాల్లో చదివించడంలేదని వారి ఆరోపణ. బట్టీని ప్రోత్సహించే మన పరీక్షావిధానమే లోపభూయిష్టంగా ఉండడంకూడా దురదృష్టకరం.
మనపిల్లలు KG నుంచి PG దాకా చదుకునే క్రమంలో వరుసగా పై నైపుణ్యాలను నేర్చుకుంటున్నారా లేదా అనేది ప్రతి తల్లి, తండ్రి గమనిస్తూ ఉండాలి. అంతేకాదు అవన్నీ LKG లోనే వచ్చేయాలనే దురాశకు పోతే మొదటికే మోసం వస్తుంది. అవన్నీ ముందువెనకలుగా, సమాంతరంగా ఒక క్రమంలో నేర్చుకున్నప్పుడే మనపిల్లలు జీవితంలో వారు ఎంచుకున్న ఏరంగంలోనైనా విజయాలు సాధించడమేకాక పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. జాగ్రత్తగా చూస్తే పైస్థాయి నైపుణ్యాలు వృత్తి, ఉద్యోగాల్లోనేకాదు, వ్యక్తిగతజీవితంలోకూడా అవసరమని తెలుస్తుంది.
ఇవన్నీ తల్లిదండ్రులు చాలా ఓపికతో పిల్లల్లో గమనించి, పరీక్షించి ప్రోత్సహించాల్సిన విషయాలు, ఆందోళనచెంది, సంయమనంకోల్పోయి రుద్ది, భయపెట్టి తెచ్చుకోగలిగినవి కాదు. హైస్కూలు ముగిసే సమయానికి కిందిస్థాయి నైపుణ్యాలు బాగాను, పైస్థాయి నైపుణ్యాలు కొద్దిగానూ వచ్చివుండాలి. కాలేజీ చదువయ్యేసరికి పై స్థాయి నైపుణ్యాల్లో పూర్తిగా ఆరితేరివుండాలి. తమపిల్లలు చదివే స్కూళ్లల్లో, కాలేజీలల్లో దానికి తగిన పాఠ్యప్రణాళికలు ఉన్నాయా లేవా అనేది తల్లిదండ్రులు తెలుసుకోవాలి.
లేకపోతే ఏర్పాటు చేయించాలి. అలాకాకపోతే నష్టపోయేది వాళ్లే.
ఇవేకాక ఈ గ్లోబలైజేషన్ కాలంలో పిల్లలు టీములో పనిచెయ్యగలగడం, టీముకు నాయకత్వం వహించగలగడం, గ్లోబల్ స్థాయిల అవగాహన, దూరప్రాంతాల్లో పనిచెయ్యగలగడం, ఇతర సంస్కృతి సంప్రదాయాలపట్ల సహానుభూతి ఉండడం, తన చర్యలకు బాధ్యతవహించే ధైర్యం కలిగివుండడం, సామాజికసేవ లాంటి ఈతరం విలువలు కూడా నేర్చుకునివుండాలి. వీటికి అనుగుణమైన పాఠ్యప్రణాళిక విద్యాసంస్థల్లో ఉందోలేదో చూసుకోవడమేకాక ఇంటిదగ్గరకూడా ఇవి నేర్చుకునే వాతావరణం ఉండాలి.
పైన చెప్పినవి కొన్ని మాత్రమే. ఇలాంటి విషయాలన్నీ విద్యకు సంబంధించిన అనేక పుస్తకాలలో, ఇంటర్ నెట్ లో ఎవరికైనా లభిస్తాయి. ఉపాధ్యాయులకు వారి శిక్షణలో ఇవన్నీ చెబుతారు. మరి మనవిధ్యావిధానంలో ఇవి ఎందుకు సరిగ్గా లేవంటే దానికి సమాధానం చెప్పడం కష్టం. ఎవరెలావున్నా ఉపాధ్యాయులేకాక, తల్లిదండ్రులుకూడా తమ పిల్లల మంచి భవిష్యత్తుకోసం ఇలాంటివిషయాలన్నీ తెలుసుకుని తమ పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉంటూ తాము చెయ్యాల్సిన పనులను చేస్తూ వారి భవిష్యత్తును కాపాడుకోవడం అవసరం. తద్వారా దేశభవిష్యత్తు కూడా బాగుంటుంది.