రాయలసీమ నాలుగు జిల్లాలలో అనేక పురాతన క్షేత్రాలు ఉండటమేకాకుండా వాటిని కలుపుతూమంచి రవాణా వ్యవస్థకూడా ఉన్నందున ఈప్రాంతాన్ని ఒక హెరిటేజ్ సర్క్యూట్ గా ప్రకటించి అభివృద్ధి చేయాలని నంద్యాల పార్లమెంటు సభ్యుడు పోచా బ్రహ్మానందరెడ్డి కేంద్రాన్ని కోరారు.
ఈ రోజు ఆయన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి ప్రహ్లాద్ పటేల్ ను ఆయన కార్యాలయంలో కలసి ఈ మేరకు ఒక వినతి పత్రం సమర్పించారు.
ఈప్రాంత ప్రాముఖ్యాన్ని వివరించిన తర్వాత పోచా సూచనకు కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.
కర్నూల్ జిల్లా ఓర్వకల్లు, కడప, తిరుపతి తో పాటు విమానాశ్రయాలుండటంతో హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులో ఉండటం, అనేక రైళ్ల సదుపాయం , హైవేలతో అనుసంధానమయి ఉండటంవల్ల రాయలసీమ ప్రాంతం హెరిటేజ్ సర్క్యూట్ ఏర్పాటు చేసేందుకు అన్ని విధాల యోగ్యమయినదని పోచా కేంద్రమంత్రికి వివరించారు.
ఈ విషయంలో ఇప్పటికే బాగా జాప్యం జరిగిందని ఆయన చెప్పారు.
రాయలసీమ జిల్లాల పురాతనాలయాల ప్రాముఖ్యం వివరిస్తూ రేణిగుంట సమీపంలోని గుడిమల్లం, ఆత్తిరాల పరశు రామాలయం, ఒంటిమిట్ట,సిద్ధవటం, అమీన్ పీర్ దర్గా, పుష్పగిరి, గండికోట,అహోబిలం, మహానంది, యాగంటి, బెలుంగుహలు, తాడిపత్రి ఆలయాలు, కదిరి, పెనుగొండ,లేపాక్షి లాంటి ప్రదేశాలకు రోజూ వేలాది మంది సందర్శకులు వస్తున్నారని ఎంపి వివరిచారు.
అందువల్ల ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని మరింత అభివద్ధి చేసేందుకు వీలుగా రాయలసీమ హెరిటేజ్ సర్క్యూట్ ప్రారంభించి భారత్ దర్శన్ లో భాగస్వామిని చేయాలని ఆయన కోరారు.
నవనరసింహుల కొలువైన అహోబిలం లో స్వాతి నక్షత్రం రోజున వేలాది యాత్రికులు వస్తున్నారని చెబుతూ దట్టమైన అడవిలో ఉన్న ఈక్షేత్రంలో యాత్రికుల కోసం ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని, దీని కోసం అహోబిలాన్ని ప్రసాద్ ( PRASAD-Pilgrimage Rejuvenation and Spirituality Augmentation Drive) స్కీంలో చేర్చాలని కూడా ఆయన కోరారు.
ఇదే విధంగా బెలుమ్ గుహలను ఐకానిక్ సైట్ జాబితాలో చేర్చాలని కర్నూలులో సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హోటెల్ మేనేజ్ మెంటును స్థాపించాలని ఎంపి కేంద్ర మంత్రినికోరారు.
అన్ని యోగ్యతులు ఉన్న రాయలసీమలో పర్యాటక రంగం వృద్ధి అయితే, స్థానికులకు ఉపాధి, ఆదాయాలు పెరుగుతాయని ఆయన చెప్పారు. కేంద్ర మంత్రి ఈ ప్రతిపాదనలను పరిశీలించేందుకు అంగీకరించారు.