ఆగస్టు 9న తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మీ వ్రతం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి పట్టపు దేవేరి అయిన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 9న శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీ వ్రతం జరుగుతుందని టిటిడి తెలిపింది.
శ్రీ అలిమేలుమంగ అవతరించిన దివ్యస్థలం తిరుచానూరు. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామివారి తపోదీక్షకు ప్రతిఫలంగా సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీ తిరుచానూరులోని పద్మసరోవరంలో అవతరించింది.
ప్రతి సంవత్సరం పవిత్రమైన శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారంనాడు వరలక్ష్మీ వ్రతం నిర్వహిస్తారు..
వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీ దేవిని కొలుస్తారు. వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తే అష్టలక్ష్మీ పూజలతో సమానంగా భక్తులు విశ్వసిస్తారు. స్కంద, భవిష్యోత్తర పురాణాల ప్రకారం పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించాల్సిన విధానాన్ని తెలియజేశాడు.
ఈ ప్ర‌కారం ఉదయాన్నే మంగళస్నానం చేసి ఆలయంలో అర్చకులు ఏర్పాటు చేసిన మంటపంలో కొలువైన వరలక్ష్మీదేవిని దర్శించాలి. లక్ష్మీమాతను పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం అర్చకులు ఆవాహనం చేసి షోడశోపచార పూజలు చేస్తారు.
స్వ‌ర్ణ‌ ర‌థంపై సిరుల‌త‌ల్లి క‌టాక్షం
వ్రతం రోజున సాయంత్రం 6 గంటలకు శ్రీ పద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడవీధులలో భక్తులకు దర్శనమిస్తారు.
ఆర్జిత సేవ‌లు ర‌ద్దు
వరలక్ష్మీ వ్రతం కారణంగా ఆగ‌స్టు 9న‌ ఆలయంలో అభిషేకానంతర దర్శనం, లక్ష్మీపూజ, కల్యాణోత్సవం, కుంకుమార్చన, సహస్రదీపాలంకరణ సేవలతోపాటు ఉద‌యం, సాయంత్రం బ్రేక్ ద‌ర్శ‌నాల‌ను రద్దు చేయడమైనది. భక్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోర‌డ‌మైన‌ది.