భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అవసాన దశలో ఉంది. ఈ దశలో రాజ్యసభ సభ్యుడు డి.రాజా పార్టీకి నాయకత్వం వహించబోతున్నారు. ఆయనను ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
ప్రపంచంలో చాలా దేశాల్లో కమ్యూనిస్టు పార్టీలు అంతరించినా ఆ రాజకీయాలను భారతదేశంలో మొన్న మొన్నటి దాకా ప్రజలు బాగా అదరించింది.
అయితే, బిజెపి వచ్చి ప్రతిపక్ష పాత్రను కమ్యూనిస్టు లనుంచి లాగేసుకుంది. దీనితో కమ్యూనిస్టులను ప్రజలు దూరంగా పెట్డడం మొదలుపెట్టారు.
కమ్యూనిస్టులుకూడా కాంగ్రెస్ కు ప్రతిపక్ష పార్టీగా ఉండటం చాలా కిందటే మానేశారు. బిజెపి రావడంతో కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీతో కలసి పని చేయడం ప్రారంభించారు.
ఫలితంగా భారతీయ జనతాపార్టీ కాంగ్రెకు, కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వానికి నిజమయిన ప్రతిపక్షంగా తయారైంది. ఇదే కమ్యూనిస్టు రాజకీయాలను దెబ్బతీసింది.
2019 ఎన్నికలలో కమ్యూనిస్టులను చట్టసభల నుంచి పారదోలడంలో బిజెపి విజయవంతమయింది. బెంగాల్ లో ఓడిపోయారు. కేరళకు పరిమితమయి, కమ్యూనిస్టులు ప్రాంతీయ పార్టీగా కుదించుకుపోయారు. పార్లమెంటులో వాళ్ల బలగం భూతద్దంతో వెదికితే తప్ప కనిపించని స్థాయికి వచ్చింది.ఈసారి పార్టీకి ఇద్దరంటే ఇద్దరే లోక్ సభ సభ్యులున్నారు.
పార్టీకి జాతీయ పార్టీ హోదా తీసేసేందుకు ఎన్నికల కమిషన్ సిద్ధమవుతూ ఉంది. ఆ పార్టీలు పురావైభవం సంపాదించడం సాధ్యం కాదేమో.
ఇక ముందు కమ్యూనిస్టులు ట్రేడ్ యూనియన్లకే పరిమితమయ్యే గడ్డు రోజులొచ్చాయి. ఇలాంటపుడు ఢిల్లీ అజయ్ భవన్ లో పెద్ద మార్పు జరిగింది. సిపిఐ జనరల్ సెక్రెటరీ పదవినుంచి తెలుగు నాయకుడు సురవరం సుధాకర్ రెడ్డి దిగిపోయారు.
తమిళనాడుకు చెందిన సాధుజీవి డి. రాజా (70)ని జనరల్ సెక్రెటరీ ని చేశారు. రాజా తమిళనాడుకు చెందిన దళిత నాయకుడు. అంటే సిపిఐకి గడ్డురోజుల్లో దళిత నాయకత్వం లభించింది.
ఒక విధంగా ఇది రాజాకు నిబద్దతకు గుర్తింపు, మరొక విధంగా ఇది ముళ్ల కిరీటం. దాదాపు వందేళ్ళ చరిత్రలో కమ్యూనిస్టుపార్టీ అట్టడుగు కుల నాయకత్వాన్ని గుర్తించడం ఇదే మొదటి సారి.
డి. రాజాతో పరిమయమున్నవాళ్లు ఆయనను ప్రేమించకుండా ఉండటం సాధ్య పడదు. ఆయన మృదు స్వభావి.లోతయిన విషయ పరిజ్ఞానం ఉన్నవాడు.గంభీరోపన్యాపం చేయలేకపోవచ్చ గాని, అవతలి వాడిని ఒప్పించగలిగే సత్తా ఉన్నవాడు. అందరికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే నేత.
కమ్యూనిస్టుపార్టీలకు శ్రామిక జన నాయకత్వం ఉండాలనేది ఒక నినాదంగా ఉండిపోయింది. పార్టీ స్వర్ణ యుగాలలో అగ్రకులస్థులే నాయకత్వంలో ఉన్నారు.
శ్రామికులను, రైతులను నాయకత్వంలోకి తెచ్చే ప్రయత్నం పెద్దగా జరగలేదు. కమ్యూనిస్టులు క్లాస్ (వర్గం) ను నమ్మారే గాని, క్యాస్టు (కుల) ప్రాముఖ్యాన్ని ఇటీవలి దాకా గుర్తించలేదు.
అంబేద్కర్ ని కమ్యూనిస్టులు 1980 దశకం దాకా సీరియస్ గా తీసుకోనేలేదు.దీనికి కారణం ఆయన క్యాస్టు పరంగా సమాజాన్ని విశ్లేసించడమే. అందుకే 1925లో పుట్టిన పార్టీకి మేధావులు, అగ్రకులాల వాళ్లే నాయకులుగా ఉన్నారు తప్ప అట్టడుగు కులాల వారు నాయకులు కాలేకపోయారు.
ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీయే కమ్యూనిస్టులకంటే బాగా ముందుంది.
మొదటి సారి దళితుడిని పార్టీ అధ్యక్షుడి (బాబు జగ్జీవన్ రామ్,1969) )ని, ముఖ్యమంత్రి (దామోదరం సంజీవయ్య 11జనవరి1960 నుంచి 12 మార్చి 962 దాకా )ను చేసింది కాంగ్రెస్ పార్టీయే.
కమ్యూనిస్టులకు దళితుడి నాయకత్వం గుర్తొచ్చేందుకు 95 సంవత్సరాలు పట్టింది.
తమిళనాడు వెలూరు జిల్లా చిత్తాతూర్ చెందిన డి.రాజా 1967లో సీపీఐ విద్యార్థి విభాగం ఏఐఎస్ఎఫ్తో తన వామ పక్ష రాజకీయ జీవితం ప్రారంభించారు. తర్వాత ఎఐవైఎఫ్ తమిళనాడు నాయకుడయ్యారు.
ఈ నెల 18,19 తేదీలలో సమావేశమయిన సిపిఐ నేషనల్ సెక్రెటేరియట్ ప్రధాన కార్యదర్శి పదవికి ఆయన పేరును ఖరారు చేసింది. జూలై 20 న జరిగిన జాతీయ కార్యవర్గం ఈ నియామకాన్ని ధృవీకరించింది.
1985లో ఈ సంస్థ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో సేవ్ ఇండియా, ఛేంజ్ ఇండియా నినాదంతో ఆయన దేశమంతా సైకిల్ యాత్ర చేశారు..
హైదరాబాద్లో 1994లో నిర్వహించిన పార్టీ సమావేశంలో జాతీయ కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2006లో తమిళనాడు నుంచి పార్టీ తరఫున రాజ్యసభ సభ్యుడిగా డి. రాజా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఎంపీగా కొనసాగుతున్నారు. ఈ జులై 24న ఆయన రాజ్యసభ నుంచి రిటైర్ అవుతున్నారు.
ఢిల్లీ రాజకీయ వర్గాల్లో బాగా పరిచయమున్న ముఖం డి. రాజా. ఆయన స్వభావానికి భిన్నంగా పార్టీని బలపరిచేందుకు ఆయన భారతీయ జనతా పార్టీ విస్తరణను అడ్డుకునేందుకు చాలా తీవ్రంగా పోరాడాల్సి వస్తుంది.
ఈ కాలపు రాజకీయాలలో అరుదైన వ్యక్తిత్వం ఉన్న రాజాకు శుభాకాంక్షలు.