శ్యామ్ బెనెగల్ ‘వెల్ డన్ అబ్బా’ చూశారా, హైదరాబాద్ ఐడిబిఐ లో జరిగిందదే…

(టిటిఎన్ డెస్క్)
ఆ మధ్య శ్యామ్ బెనెగల్ ‘వెల్ డన్ అబ్బా’ (Well Done Abba) అని అద్భుతమయిన సినిమా తీశారు గుర్తుందా?
శ్యామ్ బెనెగల్ హైదరాబాద్ వాడే. ఈ సినిమా కథనడిచేది కూడా హైదరాబాద్ పక్కన ఉన్న చిక్కడ పల్లి అనే కల్పిత గ్రామంలో.
 ప్రభుత్వం ఎలా నడుస్తున్నదో, ప్రభుత్వ కార్యాలయాల్లో లంచగొండి తనం ఎలా పనిచేస్తుందో, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ఎలా అమలవుతున్నాయి, రుణాలు ఎలా మంజూరవుతాయి, రుణం కోసం లబ్ది దారులుపడే కష్టాలను  శ్యామ్ బెనెగల్  గొప్పగా, చాలా సరదగా చూపించారు.
అవినీతిలాంటి సీరియస్ సబ్జక్టును శ్యామ్ బెనెగల్ ఒక పొలిటికల్ సటైర్ గా మలచి చూపించాడీ చిత్రంలో. సినిమాచూస్తున్నంత సేపు నవ్వుకుంటూనే, వ్యవస్థ ఇంతకుళ్ళిపోయిందాఅని ఆశ్యర్యపోయేలా చేస్తుందీ సినమా.
కథేంటంటే కరువు పీడిత ప్రాంతాల్లో పేదరైతులు బోర్ బావులు తవ్వుకునేందుకు రుణం మంజూరుచేసే పథకాన్నొకదాన్ని ప్రభుత్వం ప్రవేశ పెడుతుంది.

 

బిపిఎల్ సర్టిఫికేట్ ఉంటే బోర్ బావి తవ్వేందుకయ్యే ఖర్చును ప్రభుత్వం మంజూరుచేస్తుంది.
ఒక వ్యక్తి ఈపథకం వినియోగించుకోవాలనుకుని బిపిఎల్ సర్టిఫికెట్ తెచ్చుకుంటాడు. గవర్నమెంట్ ఆఫీస్కు వెళ్లి డబ్బువిడుదలచేయండని కోరతాడు. డబ్బు మంజూరవుతుంది.
అన్ని స్థాయిల్లో కమిషన్ తీసుకుంటారు వాళ్ల ‘రూల్’ ప్రకారం. చివరకు లబ్దిదారు  దగ్గిర మిగిలేది చిల్లరే.
అయితే, ఈ మధ్యలో బావితవ్వేందుకు ఎంపిక చేసిన భూమిని తనిఖీ చేసినట్లు, బావి తవ్వినట్లు, బావి ఉన్నట్లు ఫోటోలను కూడా అధికారులే సృష్టించేస్తారు.
అంటే పేపర్ మీద అంతా జరిగిపోతుంది. బావి లేదు గాని, తను ప్రభుత్వపథకం కింద ఆర్థిక సహాయం పొందిన లబ్దిదారుడవుతాడు.
అయితే,  వీళ్లని ఒక ఆటపట్టించాలనకుని బావి గురించిన మొత్తం సమాచారాన్ని ఆర్ టిఐ కింద సంపాయిస్తాడు మనహీరో (అర్మాన్).
అన్ని సర్టిఫికేట్లు దొరికాక, తన బావిని ఎవరో దొంగిలించుకుపోయారని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేస్తాడు. ఇక చూడు నా సామి రంగా, అధికారులందరికి   చెమటలే.  ఎందుకంటే బావి కోసం ఎంపిక చేసిన భూమిని తనిఖీ చేసినట్లు ఇన్స్ పెక్షన్ సర్టిఫికేట్ ఉంది, బావితవ్వినట్లు కాంట్రాక్ట్ర్ సర్టిఫికేట్ ఉంది, బావి ఉన్నట్లు ఫోటో గ్రాఫర్ తీసిన ఫోటోలున్నాయి. మరి బావి ఏమయింది?
ఇలాంటి కేసొకటి  ఇపుడు  ఐడిబిఐ (IDBI) లో బయటపడింది. కాకపోతే, ఇక్కడ లబ్దిదారులు బ్యాంకు వాళ్లతో కుమ్మక్కయిపోయి దోచుకున్నారు.
శ్యామ్ బెనగల్ కథలో అర్మాన్ పేదవాడు, అమాయకుడు. అధికారులు వాడితో అడుకున్నారు చివరిదాక. చివర్లో అర్మాన్ కథని అడ్డం తిప్పుతాడు.
హైదరాబాద్  తాజా కథలో తెలివిగా అధికారులు, లబ్దిదారులు చేతులు కలిపారు. తేడా అంతే.
హైదరాబాద్ లో ఏంజరిగిందంటే… చేపల చెరువులు తవ్వేందుకని చెప్పి కొంతమంది రుణాలివ్వాలని బ్యాంకుకు వస్తారు. ఒకె తీసుకోండని ఐడిబిఐ   అధికారులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లలో 44 మంది లబ్దిదారులకు రు.743 కోట్లు విడుదల చేశారు.
తాము ఫిష్ పాండ్స్ డెవెలప్ చేస్తామని, ఫిష్ సీడ్ కల్చర్ బిజినెస్ చేస్తామని చెప్పి రుణాలు తీసుకున్నారు రైతులు. ఉత్తిదే. అంతా బోగస్ అని,రైతులు బోగస్, పట్టాదార్ పాస్ పుస్తకాలు బోగస్, ఫిష్ పాండ్స్ బోగస్… అని విచారణలో తేలింది.
ఫిష్ ఫాండ్స్ లేవు, ఫిష్ సీడ్ కల్చర్ లేదు. అన్నీ ఉన్నట్లు చూపారు. చూసినట్లు ఐడిబిఐ అధికారులు రికార్డు చేసుకున్నారు. రుణాలు మంజూరు చేసుకున్నారు. పంచుకున్నారు.
2018లో సిబిఐ ఈ లోన్ ఫ్రాడ్ మీద కేసులు నమోదు చేసింది. వీళ్లంతా కిసాన్ క్రెడిట్ కార్డు సంపాయించి 2009 -2014 మధ్య రుణాలకు ఐడిబిఐ కి దరఖాస్తు చేశారు.
హైదరాబాద్ లోని హబ్సీగూడ, బషీర్ బాగ్,విశాఖలోని సిరిపురం బ్రాంచ్,ఆదిలాబాద్, గుంటూరు బ్రాంచ్ ల నుంచి ఈ రుణాలు పొందారు.
వీళ్లంతా అన్ని ఒరిజినల్ డాక్యమెంట్లు (బోగస్) సమర్పించి, పూచీ (బోగస్ )చూపించి లోన్ లు కావాలన్నారు.బ్యాంకు వాళ్లిచ్చారు. లోన్ తీసుకున్నాక ఎగ్గొట్టారు. ఇందంతా మొండి బాకీ (NPA)లయ్యాయి.
దీనితో రుణాలు తీసుకున్నవారి మీద కేసు నమోదు చేశారు. వెరిఫై చేస్తే వాళ్లు చూపించిన స్థలంలో ఫిఫ్ పాండ్స్ లేవు. ఫిష్ సీడ్ కల్చర్ యాక్టివిటీ లేదు. అంతా ఫ్రాడ్ అని తేలింది. ఈ 740 కోట్ల రుపాయలను వాళ్లరు వేరే అకౌంట్లోకి మార్చుకున్నారు.
ఇపుడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టొరేట్ (ED) అధికారులు ఈ లోనుతో సంబంధం ఉన్నవారి ఇళ్లలో సోదాలు చేస్తున్నారని టైమ్స్ ఆఫ్ ఇండియా రాసింది. ఇడి అధికారులు ఈ కేసులో ప్రధాన నిందితులయిన బత్తు సుబ్బారావు ( ఆరోజుల్లో జనరల్ మేనేజర్ ), ఆర్ దామోదరన్ (ఆ రోజుల్లో చీఫ్ మేనేజర్ ) విచారించబోతున్నారు.
అదీ సంగతి.