భారతదేశంలో హీరో సైకిల్స్ మించిన ఉత్తేజకరమయిన విజయగాధ మరొకటి ఉండదేమో…
ఈ కంపెనీ ఎలా పుట్టింది, సంస్థాపకులు ఎలా కష్టపడి ఈ రోజు ప్రపంచంలోనే నెంబర్ సైకిళ్లు తయారుచేసే సంస్థగా తీసుకువచ్చారనే విషయం ఇపుడు మరొక సారి చర్చకు వచ్చింది. ఈ కంపెనీ చరిత్రను అతికష్టం మీద సంస్థాపకుడి మనుసుపొరల్లోకిచొరబడి శోధించి బయటకు తీసుకువచ్చి ప్రియా కుమార్ Inspiring Journey of a Hero అనే పుస్తకం రాశారు.
పుస్తకం గొప్పదనం కంపెనీ స్థాపించిన ఓం ప్రకాశ్ ముంజల్ సైకాలజీని అర్థం చేసుకోవడం. ఆయన ఎవరినీ కలవడు, పత్రికలకు ఇంటర్వ్యూ లు ఇవ్వడు. తన గురించి నలుగురు చర్చించుకోవాలనుకోడు. మీ గురించేమమయినా చెప్పండనిఅడిగితే , ‘నా కంపెనీలో పనిచేస్తున్న 2000 వేల మందితో మాట్లాడితేనే నా చరిత్ర సంపూర్ణమ వుతుంది,’అని దాటవేసేవాడు.
ఇలా ఎపుడు ఎవరికి చిక్కని ముంజల్ ప్రియాకుమార్ కు దొరికారు అతికష్టం మీద. వాళ్లకుటుంబంలో తనకు తెలిసినవ్యక్తి ద్వారా ఆయనకు చేరువయి, ఆయన ఫిలాసఫీని, వర్క్ కల్చర్ ను, నైతిక విలువలను, మానవ సంబంధాలను లోతుగా అర్థం చేసుకుని, చాలా సాదాసీదా భాషలో ఉత్తేజకరంగా ప్రియాకుమార్ ఈ పుస్తకం రాశారు. (ఫోటోలు ఫేస్ బుక్ నుంచి)
అందుకే మొదలుపెడితే, పూర్తిగా చేసే దాకా వదలనీయదు. నేనయితే, ఒక్క సిటింగ్ లోనే ఈ పుస్తకం చదివాను.
‘మేక్ ఇన్ ఇండియా’ అని భారత ప్రభుత్వం ఈ మధ్య ఒక నినాదం తీసుకువచ్చింది గాని, దీనికి పునాది ఎపుడో పడింది.ఎందరో వేశారు.
అలాంటి వాళ్లలో మొదట చెప్పుకోవలసిన పేర్లలో మొదట ఉంటుంది ఓం ప్రకాశ్ ముంజల్ పేరు.
ఇది కూడా చదవండి: అనగనగా ఒక విజయవాడ స్కూల్, దాని కథేంటో చదవండి
‘అయిదేళ్లపుడు నాకు మా తల్లితండ్రులు ఒక సైకిల్ కొనిచ్చారు. ఉదా రంగులో ఉండేది, హాండిల్ బార్ కు ఆరంజ్ రంగు జడలు వేలాడుతూ ఉండేవి. సైకిలొచ్చింది గాని, నేర్చుకునేందుకు ఎంత కష్టపడ్డాననుకున్నారు. అపుడు ట్రైనింగ్ వీల్స్ లేకుండా సైకిల్ నేర్చుకోబోయి కిందపడినపుడు మోకాలికి దెబ్బ తగిలింది. ఆ మచ్చ ఇంకా ఉంది. దెబ్బ తగిలినా వదల్లేదు. చివరకు సైకిల్ నేర్చుకున్నాను,’ అని ముంజల్ గుర్తు చేసుకున్నారు.
సైకిల్ నేర్చుకోవడంలో చిన్నపుడు ఆయన చూపిన పట్టుదల సైకిళ్ల తయారీలో, సైకిల్ మార్కెట్ ను ఇండియాలోనే కాదు, ప్రపంచమంతా జయించడంలో కూడా చూపారు.
అందుకే ‘హీరో’ సైకిళ్లు 2012 నాటికే 13 కోట్లకు చేరుకున్నాయి. ఇపుడు నాలుగు తయారీ యూనిట్లో 7 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.
రోజుకు 18,500 సైకిళ్లు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రపంచ సైకిల్ మార్కెట్లో హీరో షేర్ 48 శాతం. సైకిళ్ల తయారీలో 1986లోనే ఈ సంస్థ గినీస్ బుక్ లోకి ఎక్కింది.
ఇంతకీ ఈ ఉత్తేజకరమయిన స్టోరీ ఎక్కడ మొదలయిందో తెలుసా?
పాకిస్తాన్ లో…దేశ విభజనకు ముందు ఉమ్మడి పంజాబ్ రాష్ట్రంలోని లాల్పూర్ జిల్లా కమాలియా అనే వూర్లో హీరోసైకిల్ యాత్ర మొదలయింది.
ఆ రోజుల్లో ప్రధానయిన జనసామాన్య వాహనం సైకిలే.
సైకిళ్లున్నాయి గాని వాటిని రిపేర్ చేసే వాళ్లు తక్కువ, విడిభాగాలు దొరికేవి కాదు. అందువల్ల నలుగురు అన్న తమ్ముళ్లు (దయానంద్, సత్యానంద్, బ్రిజ్ మోహన్ లాల్, ఓం ప్రకాశ్) లాహోర్ లో 1944లో విడిభాగాల బిజినెస్ ప్రారంభించారు.
విదేశాల నుంచి సైకిల్ విడిభాగాలు ఇండియాలోకొస్తే చాలు, వాటిని తీసుకువచ్చి స్థానికంగా ఉండే కమ్మరి వాళ్ల చేత అలాంటి విడిభాగాలు తయారుచేయించే విక్రయించే వాళ్లు.
అపుడూ దేశ విభజన మేఘాలు కమ్ముకుంటున్నాయి.
ముప్పురానున్నదని ముంజల్ బ్రదర్స్ గమనించారు. పాకిస్తాన్ లో ఉండలేమని గ్రహించి బిజినెస్ ను అమృత్ సర్ కు మార్చారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చింది.విభజన జరిగిపోయింది.
అమృత్ సర్ లో విభజన తర్వాత ఏర్పడిన కల్లోల పరిస్థితుల వల్ల అక్కడి నుంచి వారు మకాంను లూధియానాకు మార్చాల్సి వచ్చింది. అక్కడే హీరో సైకిల్ చరిత్ర మొదలవుతుంది. వాళ్ల వ్యాపారం విడి భాగాల నుంచి సైకిళ్లు తయారుచేసేస్థాయికి వచ్చారు.
నలుగురు అన్నదమ్ముల్లో ఓం ప్రకాశ్ ముంజల్ సైకిల్ బిజినెస్ లో స్థిరపడ్డారు. ‘సైకిల్ మన్ ఆఫ్ ఇండియా’ అని అయనకు పేరొ స్తే, లూధియానాకు ‘సైకిల్ సిటి ఆఫ్ ఇండియా’ అని పేరొచ్చింది.
1956 లో పంజాబ్ గవర్నమెంట్ నుంచి సైకిల్ తయారీ లైసెన్స్ తీసుకుని రు. 50 వేల బ్యాంకు లోన్ తో ఉత్పత్తి ప్రారంభించారు. అపుడు రోజుకు 25 సైకిళ్లు తయారయ్యేవి.
1975నాటికి రోజుకు 7,500 సైకిళ్లు తయారుచేస్తూ దేశంలోనే అతిపెద్ద సైకిల్ తయారీదారు అయ్యారు.
1986 నాటికి రోజుకు 18,500 సైకిళ్లతయారీతో ప్రపంచంలో అత్యధిక సైకిళ్ల తయారీదారుగా గినిస్ బుక్ లోకి ఎక్కారు.
1984లో కంపెనీ జపాన్ కు చెందిన హోండా మోటార్ కంపెనీతో పొత్తు పెట్టుకుని హీరో హోండా మోటార్ సైకిళ్లు తయారుచేయడం మొదలుపెట్టింది.
ఓం ప్రకాశ్ ముంజల్ 1927లో జన్మించాడు. బహదూర్ చంద్ ముంజల్ తండ్రి, ఠాకూర్ దేవీ తల్లి. కూరగాయల హోల్ సేల్ బిజినెస్ చేసే వాళ్లు. అందువల్ల నలుగురు కుమారులు కూడా వ్యాపారంలోకే వచ్చారు. కాకపోతే అప్పటి మార్కెట్ డిమాండ్ ను కనిపెట్టి సైకిళ్ల విడిభాగాల వ్యాపారంలోకి దిగారు.
హీరో సైకిల్ వ్యాపారాన్నిచూసుకునే ఓం ప్రకాశ్ ముంజల్ కు కవిత్వం బాగా ఇష్టం. ఎంత ఇష్టమంటే ఆయన కవిత్వంలోనే మాట్లాడతారు. ఉర్దు కవితలు చెప్పకుండా ఆయన ప్రసంగాలుండవు.
తను రాసిన కవితలు అందరికి వినిపిస్తూ ఉంటారు. బోర్డు మీటింగ్ లో ప్రసంగం కూడా ఆయన రాసిన కవిత్వంతోనే మొదలవుతుంది. కంపెనీకి వచ్చే అతిధులకు కూడా తన కవిత్వం వినిపిస్తూనే ఆయన స్వాగతం పలుకుతారు.
ముంజల్ కు ప్రత్యేక వర్క్ కల్చర్ ఉంది. ఒక సారి పంజాబ్ లో జనరల్ స్ట్రైక్ జరిగినపుడు ఆయనే స్ప్రేయర్ తీసుకుని సైకిల్ అసెంబుల్ చేసే పనిచేశారు. ఒక సారి ట్రక్కు డ్రైవర్లు సమ్మెచేస్తే ఆయనే బస్సులలో సైకిళ్లను రవాణాచేశారు. డాలర్ ధర పడిపోయినపుడు బాగా లాభాలొస్తే ఆయన కంపెనీలో ఉన్న వాళ్లందరికి పంచాడు.
లూధియానాలో ఉన్న యూనిట్ అత్యాధునిక ఆర్ అండ్ డి సౌకర్యంతో ఉంటుంది. ఇక్కడే ప్రధాన మయిన విడిభాగాలు తయారవుతాయి. ఇపుడు హీరో సైకిళ్లు దాదాపు 70 దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఇందలో పోలెండ్, జర్మనీ, ఆఫ్రికా, ఫిన్లండ వంటి దేశాలున్నాయి.
ఇండియాకు సైకిళ్లందించి వూరూర కదలిక తీసుకువచ్చిన హీరో సైకిల్ కంపెనీ హీరో హోండా మోటార్ సైకిల్ తో టూవీలర్ చరిత్రనే మార్చేసింది.
అంతవరకు పాపులర్ టూ వీలర్ అంటే బజాజ్ స్కూటరే. హీరో హోండా మోటార్ సైకిల్ తో భారతీయ యువకులు కొత్త జర్నీ ప్రారంభించారు.
ఈ మధ్యలో హీరో సైకిల్స్ నుంచి ఒక మోపెడ్ కూడా వచ్చింది. దాని పేరు హీరో మెజెస్టిక్. కొన్ని విదేశీ కంపెనీలో సహకారంతోమోపెడ్ తీసుకురావాలనుకున్నా, ఒప్పందం కుదరక వాళ్లే సొంతంగా మోపెడ్ ను తీసుకువచ్చారు.
ఓం ప్రకాశ్ ముంజల్ 2015 ఆగస్టు 13న చనిపోయారు.