తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో జూలై 13 నుండి 15వ తేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి.
వీటి కోసం జూలై 12న శుక్రవారం సాయంత్రం అంకురార్పణ జరుగుతుంది. సాయంత్రం 6 నుండి రాత్రి 8.30 గంటల వరకు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తారు.
కపిల తీర్థం పవిత్రోత్సవాలలో జూలై 13న శనివారం పవిత్ర ప్రతిష్ట, జూలై 14న ఆదివారం గ్రంధి పవిత్ర సమర్పణ, జూలై 15న సోమవారం మహాపూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు.
ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలలో, ఉత్సవాల్లో తెలిసి కొన్ని, తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి.
వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా శైవాగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో పౌర్ణమి ముందున్న చతుర్దశి నాటికి పూర్తయ్యేలా మూడు రోజుల పాటు స్వామివారికి పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ప్రతిరోజూ ఉదయం సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి అభిషేకం నిర్వహిస్తారు.