నేను పోరాడుతూనే ఉంటాను… సంజీవ్ భట్ మోదీకి గుర్తు చేసిన కవిత

(ఇటీవల యావజ్జీవశిక్షకు గురైన  పోలీసు అధికారి సంజీవ్ భట్ ప్రధాని నరేంద్ర మోడీకి ఒక బహిరంగ లేఖ రాస్తూ దానిని ఒక టిబెటన్  కవితతో ముగించాడు. ఆ కవిత రాసింది భుచుంగ్ సోనమ్ (Bhuchung Sonam). ఈ కవితకు తెలుగు అనువాదం ఇది. భట్ రాసిన లేఖ ఇక్కడ చదవవచ్చు. భట్ గుజరాత్ క్యాడర్ ఐపిఎస్ అధికారి. లాకప్ డెత్ నేరారోపణలతో ఆయననను  ఉద్యోగం నుంచి తొలగించారు.ఈ కేసులోనే ఆయనకు శిక్ష పడింది.)
నాకు నీతి ఉంది
కాని అధికారం లేదు
నీకు అధికారం ఉంది
కాని నీతి లేదు
నువ్వు నువ్వే
నేను నేనే
మన మధ్య రాజీ లేదు
ఇక యుద్ధం జరగనీ…
నాకొక సత్యం ఉంది
కాని శక్తి లేదు
నీ దగ్గర శక్తి ఉంది
కాని సత్యం లేదు
నువ్వు నువ్వే
నేను నేనే
మన మధ్య రాజీ లేదు
ఇక యుద్ధం జరగనీ…
నువు నా తల బద్దలు కొట్టొచ్చు
నేను పోరాడుతాను
నువు నా ఎముకలు పిండి చెయ్యొచ్చు
నేను పోరాడుతాను
నువు నన్ను సజీవంగా పాతిపెట్టొచ్చు
నేను పోరాడుతాను
నా నరాల్లో ప్రవహించే సత్యం సాక్షిగా
నేను పోరాడుతాను
నా ప్రాణంలో ప్రతి బొట్టునూ వెచ్చించి
నేను పోరాడుతాను
చిట్టచివరి మృత్యుశ్వాస దాకా
నేను పోరాడుతాను
అబద్ధాలతో నిర్మించిన నీ కోట
కుప్పకూలి పోయేదాకా
నేను పోరాడుతాను
నీ అబద్ధాలతో నువు ఆరాధించే
బ్రహ్మరాక్షసి
నా సత్యదేవత ముందు
ఓడిపోయేదాకా నేను పోరాడుతాను
(తెలుగు: ఎన్ వేణుగోపాల్)

(సోషల్ మీడియా నుంచి తీసుకున్నది)