చివరి కప్పు చాయ్ కి పిలుస్తున్న హైదరాబాద్ ఇరానీ కేఫె

ఇరానీ చాయ్ ప్రియులకు ఇది మరొక దుర్వార్త. హైదరాబాద్ నగరంలో మరొక పేరు మోసిన ఇరానీ చాయ్ హోటల్ మూత పడుతూ ఉంది.
అయితే, ఇతర ఇరానీ హోటళ్లకు భిన్నంగా ఈ హోటల్ యజమానులు నిశబ్దంగా మూసేయకుండా అభిమానులతో చివరి రోజు, చివరి కప్ చాయ్ బాధలో ఆనందం వెదుక్కోవాలనుకుంటున్నారు. జ్ఞాపకాలు  పంచుకోవాలనుకుంటున్నారు.
ఇన్నాళ్లు తమ హోటల్ ని ఆదరించిన వాళ్లకి  రేపటి నుంచి తాము టీ అందించే స్థితిలో లేమని యాజమాన్యం క్షమాపణలు చెబుతూ విచారం వ్యక్తం చేస్తూ ఉంది.
అందుకే చివరి రోజు అంటే జూన్ 30(ఈ రోజు ఆదివారం)  9 am నుంచి 12 pm దాకా కేఫె తెరచి ఉంచుతామని, మిత్రులందరూ రావచ్చని ఈ హోటల్ యజమాని అలీ రెజా (టివి సీరియల్ నటుడు) ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టారు.
పూర్వం హైదరాబాద్ , సికిందరాబాద్ లలో సినిమా హాళ్ళ తర్వాత ఇరానీ హోటల్స్ పాపులర్ ల్యాండ్ మార్క్స్. ఇవి తప్ప అంతపాపులర్ లోకేషన్స్ ఉండేవి కావు. ఎవరికైనా అడ్రసు చెప్పాలన్న, ఎవరినైనా కలుసుకునేందుకు రమ్మని చెప్పినా వివరాలు ఇరానీ హోటళ్ల చుట్టే తిరిగేవి.
ఏ నలుగురు మిత్రులు కలిసి కాసేపుకూర్చుని కబుర్లాడుకోవాలనుకున్నా, సాయంకాలం అలా వూరి కే కాలక్షేపం చేయాలనకున్నా ఇరానీ హోటలే అడ్డా.

అప్పటి యువతరం కూడా ఇప్పటి మిల్లినియల్స్ లాగా చేతినిండా డబ్బున్న తరం కాదు. అపుడు బార్లు రెస్టారెంట్లు ఇలా ప్రతి వీధి మలుపునా ఉండేవి కావు.  టీ చుట్టూర కూర్చోవడం, ఉస్మానియా బిస్కెట్, లేదా కారా బిస్కట్ , లేదా చోటావాలా సమోస నమల్తూండటమే కాలక్షేపం.
లిక్కర్ యువకుల జీవితాల్లోకి చొరబడేందుకు ఇంకా జంకుతూ ఉండేది. ఈ నేపథ్యంలో ఒక టీ తాగి, ఎంతసేపయినా కూర్చునేందుకు అవకాశం కల్పించింది ఇరానీ హోటలే.
ఇరానీ హోటల్ చుట్టూ చాలా సోషియాలజీ వుంది. అప్పటి లీజర్, లేజీ జీవితం, నిరుద్యోగం లేదా చిరుద్యోగాలు, అల్పదాయాలు, సిటీ బస్సుల కోసం గంటల తరబడి వేచివుండటాలు… ఇలాంటీ జీవితాలతో ఇరానీ హోటల్ పెనవేసుకుని పోయింది.
అందుకే హైదరాబాద్ , సికిందరాబాద్ లలోని జంక్షన్ లలో తప్పని సరిగా చిన్నదో  పెద్దదో ఒక  ఇరానీ హోటల్ ఉంటుంది.
చాదర్ ఘాట్ లో నయా గరా… ఆర్టీస్ క్రాస్ రోడ్స్ లో ఆస్టోరియా, అబిడ్స్ జంక్షన్ లో హోటెల్ గ్రాండ్, వోల్డ్ సిటిలో మదీనా, నాంపల్లిలో అజీజియా, సికిందరాబాద్ స్టేషన్ దగ్గిర ఆల్పా, క్లాక్ టవర్ దగ్గిర గార్డెన్ కెఫే, కొంచెం ముందుకు సాగితే ప్యారడైజ్ . ఎర్రమంజిల్ లో రెడ్ రోజ్…. ఇలా ఇరానీ కెఫె లెన్నో ఫేమస్ ల్యాండ్ మార్క్స్ గా తయారయింది నాటి హైదరాబాద్ తరహా జీవన శైలి వల్లే.
ఇవన్నీ ఆ రోజుల్లో పోరగాళ్లకు తాజ్ (Temporary Autonomous Zone)లు అయ్యాయి. ఇంత తీరుబడిగా రిలాక్స్ అయ్యేందుకు చర్చించుకునేందుకు, తర్కించు కునేందుకు కొద్దిగా స్పేస్ ఇచ్చే ప్రదేశాలనే TAZ అంటారు.   అలాంటి అవకాశం కల్పించినందునే అనేక వామ పక్ష రాజకీయ ఉద్యమాలు కూడా ఇరానీ హోటళ్లోనే పురుడు పోపుకున్నాయని చెబుతారు.
ఇలాంటి ఫేమస్ ల్యాండ్ మార్క్స్ గా మారిపోయిన ఇరానీ కేఫేలలో మారేడ్ పల్లి లోని ‘కేఫె రామ్సెర్’  ఒకటి.
1962 లోరామ్సెర్ మొదలయింది. 57సంవత్సరాలు నడిచింది. ఈ మధ్య బిజినెస్ లేక కుంటూతూ నడుస్తూ ఉంది. ఇపుడు ఇక నడవ లేని పరిస్థితి వచ్చింది.
సోమవారం నాడు ఈ కేఫెని మూసేస్తున్నట్లు ప్రకటించారు. నిజమే… తరం మారింది. జీవితం మారింది… ఎపుడు కాలం ఒకలాగ ఉండదు. ఇరానీ చాయ్ ఇష్టపడే వాళ్ళ సంఖ్య తగ్గిపోయిది.
ఏవేవో డ్రింకులు మార్కెట్లోకి వచ్చాయి. రిలాక్సవుతూ ఇరానీ చాయ్ లో ఉస్మానియా బిస్కట్ ముంచుకు తింటూ కూర్చునేంత తీరుబడి ఎక్కడిది?
బస్టాండ్ లలో వచ్చే బస్సు కోసం ఇపుడు చాలా సేపు ఓపికగా ఎదురుచూసే పరిస్థితి లేదు. ఓలా, ఊబర్లు వచ్చాయి, ఈ తరం కోసం. అందుకే రామ్సెర్ ఈ కాలానికి చెల్లని కాసు అయింది.
కాలంతో పాటి మారేందుకు రామ్సెర్ కూడా చాలా ప్రయత్నాలు చేసింది. ఫాస్ట్ ఫుడ్ లోకి మళ్లింది. చికెన్ 65 లాంటి నాన్ ఇరానీ అలవాట్లు చేసుకుంది. ఇది కూడా బతుకు నావని ముందుకు తోయలేకపోయింది.
అన్ని ప్రయత్నాలు విఫలం కావడంతో చాలా ఇరానీ కేఫెల్లాగానే రామ్సెర్ ఒక మధురజ్ఞాపకంగా మిగిలిపోతూ  రేపు, అంటే జూలై1 న మాయమవుతున్నది.
ఒకపుడు రామ్సెర్ టీ ప్రియులతో కిటకిటలాడుతూ ఉండింది. ఆఫీసులకు పోయేటపుడో వచ్చేటపుడో ప్రతి హైదరాబాదీ కి ఒక కప్పయినా రామ్సెర్ టీ తాగకుండా రోజు గడిచేది కాదు. దీనికితోడు ఇసిఐఎల్, సైనిక్ పురి,సఫిల్ గూడ,మల్కాజ్ గిరిలకు వేళ్లే వాళ్లందరికి ఇదొక అడ్డా.
ఇక యువకులు, రిటైరయిన వాళ్లు, నిరుద్యోగులు… ఇక్కడే దినమంతా గడిపే వాళ్లు. దీనికితోడు పక్కనే ఉన్న పాలిటెక్నిక్ కాలేజీ స్టుడెంట్స కి రామ్సెరే సెంటర్.
ఇలాంటి చారిత్రక పరిణామాల రంగస్థలాన్ని క్లోజ్ చేస్తున్నందుకు బాధగా ఉందని, దీనిని నడపటం కష్టమై క్లోజ్ చేస్తున్నామని వోనర్ అబ్బాస్ అలీ ఖేరద్ మంద్ చెప్పారు.
‘ఈ కేఫెని మూసేస్తున్నామనే వార్త చాలామందిని బాధిస్తుందని మాకు తెలుసు. కాని మూయడం మినహా మాకు మరొక గత్యంతరం లేదు. 57 సంవత్సారాల సుదీర్ఘ యాత్రంలో మాతో కలసి నడిచిన వాల్లందరికి ధన్యవాదాలు,’ అని అబ్బాస్ అలీ చెప్పారు.
‘ఒక అందమయిన యుగం ముగుస్తున్నది. ఈ సందర్భంగా చివరి సారిగా జూన్ 30 తేదీన 9 am నుంచి  12 pm దాకా ఒక కప్పు టీ తాగుతూ చివరిరోజు గడుపుదాం రండి. ఇదే ఆహ్వానం,’ ఈ కుటుంబానికి చెందిన రెజా ఫేస్ బుక్ పోస్టు పెట్టారు.
ఇలా కాలం బుల్ డోజర్ లా గతాన్ని ఊడ్చేస్తూ  కేవలం జ్ఞాపకపు తునకగా మిగిల్చి పోతున్నది…


– జింకా నాగరాజు (సీనియర్ జర్నలిస్టు, హైదరాబాద్)