(సలీంబాష)
మంచి తెలుగు సినిమా అంటే ఏది? అని ఎవరైనా అడిగితే, ఇకనుంచి “మల్లేశం” పేరు కూడా చెప్పుకోవచ్చు. సినిమాకు ఏదైనా సామాజిక ప్రయోజనం ఉంది అనుకుంటే, మల్లేశం సినిమా దాదాపుగా దాన్ని చూపించినట్లే.
ఇంతవరకు తెలుగులో లేదా ఇతర భాషల్లో కూడా చూసుకుంటే చాలా బయోపిక్ లో వచ్చాయి. అందులో జనం మెచ్చి బ్రహ్మరథం పట్టిన సినిమాలు ఉన్నాయి, చూడ్డానికి నిరాకరించిన సినిమాలు ఉన్నాయి.
” దంగల్” అలాంటి ఒక సినిమా. తెలుగులో కూడా ఈ మధ్యకాలంలో గొప్ప నటుడు ఎన్టీఆర్, మహానటి సావిత్రి బయోపిక్ లు వచ్చాయి. “మహానటి” సినిమా చాలా వరకు విజయవంతం అయింది.
అయితే ఎన్టీఆర్ మీద తీసిన బయోపిక్ లు కొన్ని కారణాలవల్ల అంతగా విజయవంతం కాలేకలేకపోయాయి. అయితే ఇంతవరకు వచ్చిన బయోపిక్ లు కల్పన, సినిమాటిక్ అంశాలు వంటి వాటి వల్ల అనేక విమర్శలను ఎదుర్కొన్నాయి.
మల్లేశం పైన చెప్పిన లోపాలను దాదాపుగా అధిగమించిన సినిమాగా చెప్పుకోవచ్చు.
కమర్షియల్ అంశాలను ధైర్యంగా పక్కనపెట్టి ఒక జీవితాన్ని జీవితం లాగే చూపించాలని చేసిన ఒక గొప్ప ప్రయత్నం. వార్తలను బట్టి చూస్తే ఆ ప్రయత్నం బాగానే సఫలమైనట్లు గా అనిపిస్తోంది. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి. బయోపిక్ అంటే “ఆత్మ కథా సినిమా” అనేది తెలుగు తర్జుమా అయితే, ఇంతవరకు వచ్చిన చాలా బయోపిక్ ల లో ” ఆత్మ” కనిపించలేదు.
మల్లేశం సినిమా ఈ లోపాన్ని కూడా సరిదిద్దుకుంది అని చెప్పవచ్చు! బహుశా నాకు తెలిసి తెలుగులో( ఇతర భాషల్లో కూడా నా?!) ఇంత నిజాయితీగా, అంత సూటిగా, కేవలం ఆత్మను మాత్రమే చూపించాలని చేసిన ప్రయత్నం లేదు!! సినిమాలో అక్కడక్కడ చిన్న చిన్న లోపాలను నిజాయితీ అధిగమించింది. అందుకే ఇది ఘంటాపధంగా ఎవరైనా సరే చూడదగ్గ సినిమాగా రూపొందింది.
ఆవిష్కరణల మీద గతంలో వచ్చిన బయోపిక్ ల లో ” ప్యాడ్ మాన్” సినిమా ఒక మంచి ఉదాహరణ. అయితే దానికి, మల్లేశం సినిమాకి ఒక తేడా ఉంది. ప్యాడ్ మాన్ జీవితంలో మహిళలు ఎదురుకుంటున్న ఒక సమస్యకు పరిష్కారం ఉంది. మల్లేశం లో జీవితమే సమస్య అయినప్పుడు ఒక పరిష్కారం చూపించే ప్రయత్నం కథావస్తువుగా ఉంది.
ఒకప్పటినుండి.. ఇప్పటికి దాకా కూడా చితితికిపోయిన,పోతున్న చేనేత జీవితాలను హృద్యంగా ఆవిష్కరించిన సినిమాఇది . “మల్లేశం”, చేనేత జీవితాలకు ఒక సృజనాత్మక పరిష్కారం చూపించిన చింతకింది మల్లేశం జీవితం మీద ఆధారపడి తీసిన కాదు, మల్లేశం జీవితాన్నే తెరమీద ఆవిష్కరించిన సినిమా. ఇదే ఈ సినిమా గొప్పదనం. ఇదే ఈ సినిమాకు ఇతర ఆత్మ కథా సినిమాలకు తేడా!
నాకైతే ప్యాడ్ మాన్ కన్నా ఇది కొంచెం బెటర్ సినిమా. ఇది తెలుగు సినిమా కాబట్టి, నేను (తెలుగు వాడిగా)చెప్పటం లేదు,రెండు సినిమాలు చూసిన వాళ్ళు ఎవరైనా ఈ మాటే చెపుతారు.
ఇది ఆత్మ కథ కాబట్టి కథ గురించి చెప్పాల్సిన అవసరం ఉండదు. అయితే కొన్ని విషయాలు మాత్రం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమైనది నటినటుల గురించి. దీని మీద వచ్చిన ఒకానొక రివ్యూ లో చూశాను. మంచి నటన అంటే ఏది అంటే, ” ఏ గుడ్ యాక్టింగ్ ఇజ్ – నో యాక్టింగ్”. అంటే ఏది నటన కాదో అదే మంచి నటన అన్నమాట. ఈ సినిమా లో జరిగింది అదే.
ఈ సినిమా లో ఎవరూ నటించలేదు. సినిమా లో ఉన్నారు అంతే. ఈ విషయంలో చేసిన ఒకానొక తెలివైన పని అదే. ఇంకో విశేషం ఏంటంటే ఈ సినిమాలో పేరుపొందిన నటీనటులు ఎవరు లేరు. ఒక ఝాన్సీ, ప్రియదర్శి తప్ప. ఇద్దరు కూడా జీవించారు. ఇంకో అమ్మాయి అనన్య. నటన( సారీ) ఆమె కూడా బాగా జీవించింది.
ఇతర పాత్రధారులు కూడా అలానే ఉన్నారు. ఈ సినిమాకి రెండో బలం తెలంగాణ మాండలికంలో రాయబడిన సంభాషణలు. ఆ మాండలికం గురించి పెద్దగా తెలియని వాళ్లు కూడా సంభాషణల్ని మెచ్చుకోక తప్పదు.
ఈ సినిమాలో కొన్ని మాటలు హృదయాన్ని తాగితే, మరికొన్ని హృదయానికి హత్తుకుంటాయి, ఇంకా కొన్ని అయితే గుండెల్ని పిండేస్తాయి. మచ్చుకి ” ఈ చీర ఎంత బాగుందో, చీరలు నేసుడే గాని, ఎన్నడూ ఇసుంటివి వేసుకునే లేదు” అన్నది.
ఈ ఒక్క మాట ఇప్పుడు ఉన్న జీవితాలకు నిదర్శనం! పాటలు కూడా అంతో ఇంతో ప్రభావాన్ని చూపుతాయి. ఈ సినిమాల్లో 80, 90 దశకాల నాటి పరిస్థితులను ప్రతిబింబించే ప్రయత్నము పూర్తిగా సఫలం కాలేదు. అక్కడక్కడ చిన్న లోపాలు ఉన్నది ఈ సందర్భంగానే. అయినా అవి సినిమా ఆత్మను చెడగొట్ట లేవు! మొదటి సినిమానే అయినా దర్శకుడు రాజ్ ఆర్ ప్రతిభను ప్రశంసించి తీరాలి! అందుకే కొన్ని లోపాలను క్షమించాలి కూడాను.
ఈ సినిమా గురించి ఎన్ని పేజీలైనా రాయచ్చు. ఎందుకంటే దీని గురించి ఇలా రాస్తూ పోతే ఒక జీవితం గురించి రాయాల్సి వస్తుంది. అయితే ఈ సినిమాలో ఉన్న మరో అంశం కామెడీ. చార్లీ చాప్లిన్ సినిమాల్లో మాత్రమే చూడగలిగే కామెడీ సన్నివేశాలు ఇందులో ఉన్నాయ. ఒకటి రెండు ప్రస్తావనార్హం.
హీరో స్నేహితుడి ఇంట్లో ఫ్యాను బిగించే సన్నివేశం లో పండిన కామెడీ మన జీవితాల్లో ఉండేది. ఫ్యాన్ కింద పడినప్పుడు అవ్వ మాటలు మనల్ని నవ్విస్తాయి. ఇంకోసారి అదే అవ్వ గడగడ మాట్లాడుతూ ఉంటే, హీరో అక్కడినుంచి వెళ్ళిపోతూ ” తాత ఎందుకు చచ్చిపోయాడో ఇప్పుడు అర్థమైంది” అన్న డైలాగుకు మనం నవ్వక తప్పదు. ఇలాంటి అనేక కామెడీ సన్నివేశాలు నవ్వుకునేలా చూస్తాయి.
ఈ సినిమాలో పిల్లలు ఆడుకునే ఆటలు, మాట్లాడే మాటలు, కొట్లాటలు ఆ తరం వాళ్లను జ్ఞాపకాల్లోకి తీసుకెళ్తాయి. ఈ సందర్భంగా చిత్రీకరించిన పాట బాల్యాన్ని గుర్తు చేస్తుంది. ఈ సినిమాలో పిల్లలు కూడా అంతే సహజం గా ఉన్నారు.
నేను వేలకొద్ది సినిమాలు చూశాను. ఇటువంటి సినిమాలు నేను చాలా తక్కువ చూశాను. ఈ సినిమా , సారీ, జీవితం ఒకసారి చూడదగ్గది అని ఘంటాపధంగా చెప్పగలను. ఎందుకంటే ఇది సినిమా కాదు, జీవితం కనుక! తమ తమ జీవితాల్లో కష్టపడి ఎదిగిన వాళ్ళు ఈ సినిమా చూస్తే మరోసారి తమ కష్టాలను స్పృశించే అవకాశం ఉంది.
నేను ఈ సినిమాకు ప్రచారకర్తను కాదు. అయినా ఈ సినిమాను చాలామంది చూస్తే, ఇలాంటి (ఇంకా మంచివి) సినిమాలు ఇంకొన్ని తీసే ధైర్యం చాలామందికి వస్తుంది. తెలుగు సినిమాకు ప్రతిష్ట పెరుగుతుంది.
సినిమా అయిపోయిన తర్వాత కొంతమంది మిత్రులు నన్ను అడిగారు, ఈ సినిమా ఆస్కార్ స్థాయి సినిమానేనా అని. ఎందుకు కాదు అన్నాన్నేను. మన దేశం నుంచి ఆస్కార్ కు వెళ్లిన. నామినేట్ అయిన. అవార్డు పొందిన విదేశీ సినిమాలు చూసిన తర్వాత ఈ సినిమా కూడా ఆస్కార్ సినిమానే! ఈ ఒక్క మాటనే సినిమాకు కితాబు!
(సలీంబాష, జర్నలిస్టు, కర్నూలు ఫోన్ నెం. 9393 737937)