చంద్రబాబు అక్రమ ప్రజావేదిక కూల్చివేతకు జగన్ ఆదేశాలు

అక్రమంగా కట్టిన భవనం నుంచి ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని చెబుతూ అమరావతి ఉండవల్లిలో నిర్మించినప్రజావేదిక నిర్మాణాన్ని కూల్చేయాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు.
ఈ రోజు ఆయన అక్కడ కలెక్టర్ల సమావేశం ఏర్పాటుచేసి ఈ ప్రకటన చేశారు.
‘నిబంధనలకు వ్యతిరేకంగా కట్టిన భవనంలో మనం కూర్చున్నాం.అవినీతితో కట్టిన భవనంలో కూర్చున్నాం.చట్టాలకు వ్యతిరేకంగా కట్టిన భవనం లో మనం కూర్చున్నాం. అవినీతి భవనం అని తెలిసి ఇక్కడే మీటింగ్ పెట్టుకున్నాం. లోకాయుక్త సూచనలు పట్టించుకోలేదు. నదీ సంరక్షణ చట్టాలను పట్టినచుకోకుండా కట్టిన భవనం,’ అని జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.   సీఆర్డీఏ అధికారులు ఇచ్చిన నివేదిక కాపీని సదస్సులో చూపించారు.
ఇక్కడ మీటింగ్ పెట్టిన కారణాన్ని ఆయన వివరిస్తూ , ‘ మన ప్రవర్తన ఎలా ఉండాలనేది చూపించాలని ఇక్కడే మీటింగ్ పెట్టాను. అన్ని చట్టాలు ప్రభుత్వమే భేఖాతరు చేసిందనేందుకు  ఈ భవనమే ఉదాహరణ.ఇదే భవనం ఎవరైనా కట్టి ఉంటే వెంటనే కూల్చేస్తాం. వ్యవస్థ ఏ స్థాయిలో దిగజారిందో చూపించాలనే ఇక్కడే సమావేశం పెట్టాను. ఈ భవనంలో ఇదే చివరి సమావేశం,’ అని ప్రకటించారు.
రాష్ట్రంలో మొట్టమొదటిగా కూల్చివేస్తున్న అక్రమ భవనం ఇదే. ఎల్లుండే కూల్చివేయాలని ఆదేశిస్తున్నాను అని  స్పష్టమమయిన ప్రకటన చేశారు.
ప్రజావేదికను నేల మట్టంచేయవద్దని దానిని ప్రతిపక్ష నేత అధికారిక నివాసంగా ప్రకటించాలని కోరుతూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి లేఖ రాశారు.
ఈ భవనాన్ని అయిదుకోట్ల ఖర్చుతో సిఆర్ డిఎ  నిర్మించింది. ముఖ్యమంత్రి అధికారిక సమావేశాల కోసం  ఈ భవనం నిర్మించారు.