జగన్  మోహనా, సీమగోడు వినిపించుకోవా!

(యనమల నాగిరెడ్డి)
రాయలసీమలో కరువు కరాళ నృత్యం ప్రారంభమైంది. తాగడానికి గుక్కెడు మంచినీళ్లు కూడా దొరకని దుస్థి ఏర్పడింది. ఇప్పటి వరకు వర్షాలు పడక పోవడం,  బావులు,బోరు బావులు ఎండిపోవడంతో రైతులు వ్యవసాయం చేయలేని స్థితికి చేరుకున్నారు.
రైతన్న లు,రైతు కూలీలు ప్రస్తుతం ఉన్న ఊరును వదలి బ్రతుకు తెరువు కోసం  పొట్ట చేత పట్టుకొని కూలీ పనుల కోసం పట్టణాలకు వలసలు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో “జగన్ మోహన్ రెడ్డి గెలిస్తే మా ప్రాంత సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశతో” రాయలసీమ ప్రజలు ఆయనకు  బ్రహ్మ రథం పట్టారు.
రాయలసీమ కరువు నివారణకు గోదావరీ జలాలే మల్లింపే శరణ్యమని గతంలో అనేక మంది నిపుణులు తేల్చి చెప్పారు. కెసిఆర్ జగన్ కు అందిస్తున్న స్నేహ హస్తం, చూపుతున్న సఖ్యత వల్ల   రాయలసీమ నీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి ఇదే అత్యంత అనువైన సమయమని నమ్మకం కలుగుతున్నది.
ఈ నేపథ్యంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవంలో తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ ఆహ్వానం మేరకు జగన్ పాల్గొన్నారు. నీటి పారుదల విషయాలలో  నిష్టాతుడైన కెసిఆర్ గోదావరి జాలాలనురెండు రాష్ట్రాలు వివాదాలకు అతీతంగా పూర్తిగా వినియోగించి అన్ని ప్రాంతాలను సస్యశ్యామలం చేయాలని జగన్ కు సూచించారు.
ఈ మేరకు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ నెల 27న సమావేశం కావాలని నిర్ణయించడం హర్షణీయం.   జగన్ ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధికి, కరువు శాశ్వత నివారణకు నిర్దిష్ట ప్రణాళికతో కార్యాచరణ చేపట్టి వెంటనే అమలు చేస్తారని రాయలసీమ ప్రజలు ఆశిస్తున్నారు. ప్రాంతీయ అసమానతలను తొలగించి రాయలసీమను మిగిలిన ప్రాంతాలతో సమానంగా అభివృద్ధి చేయడానికి  చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు.
రాయలసీమ   
నాలుగు జిల్లాలతో కూడిన రాయలసీమ భౌగోళికంగా  దేశంలో అతి పెద్ద నగరాలైన హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు అత్యంత సమీపంగా ఉంది. ప్రకృతి అన్ని సహజ వనరులను సమకూర్చినా పాలకుల కరుణ లేకపోవడం వల్ల ఈ ప్రాంతం కరవుకు కన్నతల్లిగా మారింది.
నిత్యం తీవ్ర  కరువుతో అల్లాడుతున్నాఅన్ని రకాల వాణిజ్య, ఆహార, ఉద్యానవన పంటల సాగుకు అనుకూలమైన భూములున్నాయి. కష్టించ గల తెలివైన రైతులు, రైతు కూలీలు ఉన్నా, అతివృష్టి, అనావృష్టి, అకాల వర్షాల కారణంగా ప్రజలు సాగునీరు, తాగునీరు  లేక అల్లాడే పరిస్థితి నెలకొనింది. రాయలసీమ ద్వారా ప్రవహిస్తున్నకృష్ణ, తుంగభద్ర, పెన్నా నదుల ద్వార సుమారు 1000 టిఎంసిల పైన నీరు ప్రతి సంవత్సరం పారుతున్నా ఈ ప్రాంత ప్రజలకు తాగడానికి కూడా నీరు దొరకడం లేదు.
ఈ ప్రాంతంలో అపారమైన అటవీ సంపద, అత్యంత విలువైన ఎర్రచందనం,  బెరైటీస్ తో సహా అనేక విలువైన భూగర్బ ఖనిజాలు, తిరుమల లాంటి అనేక  పవిత్ర దైవ క్షేత్రాలు నెలకొన్నాయి.
సీమను అతలాకుతలం చేస్తున్న కరువులు
రాయలసీమ ప్రాంతం గత 150 సంవత్సరాలుగా అనేక కరువులతో అతలాకుతలమైంది. “ధాతు కరువు, గంజి కరువు” లాంటి తీవ్ర కరువులు సీమలోని జనాభాలో మూడవ వంతు తుడిచి పెట్టాయి. గతంలో నాలుగు సంవత్సరాలకు ఒక సారి వచ్చే  కరువు ప్రస్తుతం ప్రతి సంవత్సరం ప్రజలను పలకరిస్తూ ఇక్కడే తిష్ట వేసింది. ఈ ప్రాంతంలో నెలకొన్న కరువుల గురించి పూర్తిగా చెప్పాలంటే మహా భారతమే అవుతుంది. పంటల సాగు సంగతి ప్రక్కన పెడితే, ప్రజలకు, పశువులకు తాగడానికి  కూడా నీరు దొరకడంలేదు. తాత్కాలిక ఉపశమనంగా వేసవిలో టాన్కర్ ల ద్వారా చేస్తున్న నీటి సరఫరా వల్ల కోట్లాది రూపాయల ప్రజాధనం వృధా కావడం, తప్ప ప్రజల కనీస అవసరాలు మాత్రం తీరడం లేదు.
రాయలసీమపై పాలకుల తీరని వివక్ష
రాయల కాలంలో స్వర్ణ యుగం చవిచూసిన రాయలసీమ నైజాం నవాబుల పాలన, బ్రిటీష్ పాలన, మన(సీమ) నాయకుల పాలనలలో  తీరని వివక్షకు గురైంది. గతం ఎలాఉన్నా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మద్రాసు నుండి విడిపోయి ఆంద్ర రాష్ట్రంగా మారే సమయంలో  రాయలసీమ ప్రయోజనాల పరిరక్షణ కోసం పెద్దమనుషులు చేసుకున్న “శ్రీభాగ్ ఒప్పందం” చెత్తబుట్ట పాలైంది. ఏలిన వారు సీమ నీటి అవసరాలు తీర్చకుండా కోస్తా ప్రాంతానికే  కొమ్ము కాసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రాజధానిని కూడా తరలించి ఈ ప్రాంతాన్ని సజీవంగా సమాధి చేశారు. బచావత్ ట్రిబ్యునల్ లో వాదనలు వినిపించే సమయంలో కూడా ప్రభుత్వ పెద్దలు సీమ ప్రయోజనాలకు పాతర వేశారు.  ఆ తర్వాత ఏర్పడిన ప్రభుత్వాలు రాజకీయ వత్తిడులకు లొంగి రాయలసీమ ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఈ ప్రాంతాన్ని శాశ్వత కరువు సీమగా మార్చి వేసాయి. 1985, 2004 లో ఏర్పడిన టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు సీమ కోసం పని చేసినా, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాల నిరాదరణ   వల్ల “ఈ సీమ కరువుకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిపోయింది”.
సీమ భవిష్యత్తు కోసం కోటి గొంతుల ఆక్రందనలు     
కరువులతో అతలాకుతలం అవుతున్న ఈ ప్రాంత ప్రయోజనాల పరిరక్షణ కోసం 19వ శతాబ్దం  నుండి అనేక ఉద్యమాలు జరిగాయి. మద్రాస్ రాష్ట్రం నుండి విడిపోయి ఆంద్ర రాష్ట్రం ఏర్పడడానికి ముందు జరిగిన  ఉద్యమాల ఫలితంగా కుదిరిన “శ్రీభాగ్ ఒడంబడిక” ను ఆ తర్వాత పాలకులు తుంగలో తొక్కగా, ఒప్పందం కుదుర్చుకున్న పెద్దలు పట్టించుకోలేదు. అప్పటి నుండి పాలకుల సీమ వ్యతిరేక వైఖరికి నిరసనగా అనేక మంది  ఉద్యమాలు చేశారు. కానీ ఫలితం మాత్రం సూన్యం సూన్యం.
1985-1989 కాలంలో ఈ ప్రాంతానికి చెందిన డాక్టర్ ఎం.వి. రమణారెడ్డి, డాక్టర్ ఎం.వి. మైసూరారెడ్డి, సి. హెచ్ చంద్రశేఖర్ రెడ్డి లాంటి నాయకులతో కలసి పిసిసి అధ్యక్షుడుగా ఉన్న వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి  సీమ సమస్యల పరిష్కారం కోసం తీవ్రంగా ఉద్యమించారు. “రాయలసీమకు నికర జలాలు కేటాయించాలని, చేపట్టిన ప్రాజెక్ట్ లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, సీమ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకోవాలని” డిమాండ్ చేశారు.
1985-89 మధ్య టీడీపీ అధినేత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ “తెలుగు గంగతో పాటు గాలేరు-నగిరి, హంద్రీ-నీవా, వెలిగొండ ప్రాజెక్ట్” లకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత   1990-1994 మధ్య ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కొంత మేరకు పని చేయగలిగినా ప్రధానమైన నీటి సమస్య పరిష్కారానికి చొరవ చూపలేకపోయింది. 1994లో ఎన్టీఆర్ తిరిగి అధికారంలోకి వచ్చినా, టీడీపీలో ఏర్పడిన అధికార సంక్షోభం, ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం అధిష్టించిన చంద్రబాబు ఈ ప్రాజెక్టుల ను పట్టించుకోకుండా “వ్యవసాయమే దండగ” అన్న విధానాన్ని భుజానికి ఎత్తుకొని నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి సీమ గొంతు కోశారు.
2004లో అధికారంలోకి వచ్చిన రాజశేఖర రెడ్డి ప్రభుత్వం సీమ నుండి కరువును శాశ్వతంగా నిర్ములించడానికి  చేపట్టిన ప్రాజెక్ట్ లను వేగవంతం చేయడం, గోదావరి నీటిని కృష్టకు తరలించడానికి “దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టైల్ పాండ్, పోలవరం నిర్మాణానికి చర్యలు” తీసుకున్నారు. అయితే ఆయన అకాల మరణం తర్వాత ముఖ్యమంత్రులుగా పనిచేసిన రోశయ్య, కిరణ్ కుమార రెడ్డి ప్రభుత్వాలు యధావిధిగా ఈ ప్రతిపాదనలను  మూలన పడవేశాయి.
2014 రాష్ట్ర విభజన సమయంలో సీమ ఉద్యమసంఘాలు నీటి సమస్యలపై చేసిన పోరాటం తమ రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా ఉన్న ఈ ప్రాంత నాయకులను, కేంద్ర ప్రభుత్వాన్ని  ప్రభావితం చేయలేక పోయింది. “దుమ్ముగూడెం- నాగార్జున సాగర్ టైల్ పాండ్ ను జాతీయ ప్రాజెక్ట్ గా” చేయాలన్నడిమాండ్ ను సీమ నాయకులు, ప్రభుత్వ పెద్దలు పక్కన పెట్టడంతో సీమకు మరోసారి తీరని అన్యాయం జరిగింది.  “లాస్ట్ బాల్ పేరుతొ” రాష్ట్ర విభజనను అడ్డుకుంటానని ప్రకటించిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హిట్ వికెట్ కావడంతో సీమ ప్రయోజనాలకు గండి పడింది.
2014 రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమ సాగునీటి సమితి, రాయలసీమ ప్రజా సంఘాల సమన్వయ సమితి యధాశక్తి చేసిన ప్రజా పోరాటాలు ప్రజలను చైతన్యపరచ గలిగినా, ప్రభుత్వాన్ని కదిలించలేకపోయాయి. “రాజధాని అమరావతి, పోలవరం నిర్మాణం” మాత్రమే తన రెండు కళ్లు అంటూ చంద్రబాబు రాయలసీమ సమస్యలపై  “బధిరాంధుడుగా (చెవిటి, గుడ్డి) ” వ్యవహరించాడు.
రాయలసీమ అవసరాలు
జగన్ ప్రభుత్వం  “భారత రాజ్యాంగం ప్రజలకు ప్రసాదించిన జీవించే హక్కు” ను రాయలసీమలో ఉన్న కోటి యాభై లక్షల మందికి వర్తింప చేయడానికి, ఇక్కడ ఉన్న 90 లక్షల ఎకరాల సాగు యోగ్య భూమికి “ఒక్క ఆరుతడి పంటకు సాగునీరు” ఇక్కడ నివాసం ఉంటున్న ప్రజలకు, పశువులకు “తాగునీరు” ఖచ్చితంగా ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని ప్రజలు, ఉద్యమకారులు కోరుతున్నారు.    అలాగే రాయలసీమకు గతంలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన నికరజలాలు సక్రమంగా వినియోగించుకోడానికి అవసరమైన స్థిరీకరణ ప్రాజెక్టులు చేపట్టాలని జగన్ కు విజ్ఞప్తి చేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణాకు-ఆంధ్రప్రదేశ్ కు నీటి వాటాలపై విచారిస్తున్న ట్రిబ్యునల్ లో రాయలసీమ గోడు వినిపించి, ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న గాలేరు-నగిరి, తెలుగు గంగ, హంద్రీ-నీవా,వెలిగొండ  ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేసి జలాల కేటాయింపులు చేయించాలని కోరుతున్నారు . అలాగే అధికార వికేంద్రీకరణ ద్వారా రాయలసీమ సమగ్రాభివృద్ధికి అన్ని చర్యలు తీసుకొవాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న  విద్య, వైద్య, పారిశ్రామిక సంస్థలను అధిక ప్రాధాన్యత ఇచ్చి ఈ వెనుక పడిన ప్రాంతంలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక్కడ దొరికే సహజవనరుల ఆధారంగా పరిశ్రమలు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాలని కోరుతున్నారు.
జగన్ తండ్రి దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కాక ముందు, అయిన తర్వాత కూడా “తాను పుట్టిన ఈ రాయలసీమ  వెతలను, తనవిగా భావించి “కరువు సీమ కడగండ్లు” తొలగించడానికి తీవ్రంగా కృషి చేసిన విషయాన్ని గుర్తుపెట్టుకొని, ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ తండ్రి బాటలోనే  “రాయలసీమ సమస్యలను పరిష్కరించి, ఈ నేలనుండి కరువును శాశ్వతంగా తరిమి వేయాలని” ప్రజలు ముఖ్యమంత్రి జగన్ ను కోరుతున్నారు. ప్రస్తుతం తెలంగాణా తో ఉన్న స్నేహ సంబంధాలతో పాటు కర్ణాటక రాష్ట్రంతో సయోధ్య ఏర్పరచుకొని కృష్ణ, గోదావరి నీటి వివాదాలను చర్చల ద్వారానే పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని, రాయలసీమ కరువు శాశ్వత నివారణకు చర్యలు చేపట్టి ప్రజలు జీవించడానికి అవకాశం కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.