నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేసిన ప్రజావేదికను కూల్చివేయాలన్న ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంపై నేడు విస్తృత చర్చ జరుగుతోంది.
ప్రజాధనంతో నిర్మించిన దాన్ని కూల్చడమా ? బాబు పై కోపంతోనే ఇలాంటి చర్యలు ? అన్ని అక్రమ నిర్మాణాలను కూలుస్తారా ? అనే ప్రశ్నలతో చర్చ జరుగుతోంది.
అయితే, ప్రజావేదిక చుట్టూ ఉన్న ప్రజాప్రయోజనం ఏమిటి అన్న ప్రాతిపదికన ఈ చర్చ జరగాలి
రాజధాని నిర్మాణం ప్రాథమిక దశ కూడా జరగముందే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్ నుండి అమరావతికి పాలనను తరలించారు.
ఒక రాజధాని అన్న తర్వాత దానికి సంబంధించిన అనేక ఏర్పాట్లు పూర్తిచేయాలి. అందుకు భిన్నంగా అమరావతికి రావడం. అనవసర భావోద్వేగాలతో పాలనకు పూనుకోవడం వలన చేసిన అక్రమ నిర్మాణం ప్రజావేదిక అని మర్చిపోరాదు.
ప్రజావేదిక కృష్ణా నది…
నదుల పరిరక్షణ కోసం ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఓజోన్ పొర దెబ్బతినడం వలన వాతావరణంలో అసమతుల్యత ఏర్పడింది. ఫలితంగా అకాల వర్షాలు కరియడం లేదా వర్షాలే లేకుండా పోవడంతో నీటి ఎద్దడి వస్తుంది.
విజయవాడలో కృష్ణ ప్రవహిస్తోంది. ప్రకాశం బ్యారేజీ ముందు నదికి ఆనుకుని ప్రజలు తమ గూడు కోసం, బడా పారిశ్రామిక వేత్తలు, నీతులు చెప్పే పెద్దమనుషులు తమ విలాసాలకు నిర్మాణాలు చేసుకున్నారు.
వీటిని అరికట్టాల్సిన ప్రభుత్వం, ఇదివరకే అక్రమ నిర్మాణం అయిన లింగమనేని భవనంలో ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు తానే నివాసం ఉంటున్నారు.
అది చాలదన్నట్లు ప్రభుత్వం ఒక అక్రమ నిర్మాణం చేసింది దాని పేరే ప్రజావేదిక. నదిని కాపాడాల్సిన ప్రభుత్వం తానే స్వయంగా అక్రమణ దారుడిగా మారడం ఏమిటి అన్న చర్చను పక్కన పెట్టి కట్టుబట్టలతో తరిమేశారు అంటూ నవనిర్మాణ దీక్షలు చేపట్టారు. అదే హైదరాబాద్ లో 10 ఏళ్ళు హక్కుగా ఉన్న విభజన చట్టాన్ని మరిచారు.
నదులు , చెరువుల పునరుద్ధరణ నేటి ఆధునిక కాలంలో అతి ముఖ్యమైనది. చెరువులను ధ్వంసం చేసిన కారణంగా రెండు సమస్యలను సమాజం ఎదుర్కొంటున్నది.
1. భూగర్భజలాలు అడుగంటడం.
2. వరదలు వచ్చినపుడు మునక సమస్య వస్తుంది.
తిరుపతిలో కొన్ని ప్రాంతాల్లో 15 రోజులకు ఒకసారి నీరు విడుదల చేసే పరిస్థితి ఏర్పడింది. చుట్టూ ఉన్న చెరువుల ఆక్రమణ కారణంగానే నేటి దుస్థితి. చెరువులు , వాగులు , వంకలు ఆక్రమణ పలితం చెన్నై నగరానికి ఎలాంటి దుస్థితి ఏర్పడిందో మన కళ్ళముందే కనిపిస్తుంది.
అమరావతి పరిస్థితి…
అమరావతికి అనుకోని కొండవీటి వాగు ఉన్నది. ఈ వాగు ప్రవహించినపుడు రాజధాని ప్రాంతం మునకకు అవకాశం ఉందని బాబు ప్రభుత్వమే వాగు వరద నుంచి రక్షణ కోసం ఒక ఎత్తిపోతల పథకాన్ని చేపట్టింది.
నదికి ఆనుకుని రాజధాని నిర్మాణం చేసున్నపుడు నది ప్రవాహానికి ఆటంకం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజలు తెలిసో , తెలియకో తమ అవరాలకు నిర్మాణం చేసుకున్న వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. బలిసిన నేతలు , సమాజానికి నీతులు చెప్పే పెద్దమనుషుల నిర్మాణాలను నిర్దాక్షిణ్యంగా తొలగించాలి. వారిపై కేసులు నమోదు చేయాలి. వారికి సహకరించిన అధికారులు , ప్రభుత్వ పెద్దలపై చర్యలు తీసుకోవాలి.
జగన్ నిర్ణయాన్ని స్వాగతించాలి…
ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న ప్రజావేదిక తొలగింపు నిర్ణయాన్ని రాజకీయాలకతీతంగాచూడాలి. సమర్ధించాలి. రాజధానిలో ప్రారంభించిన ఈ ప్రక్రియ రాష్ట్రంలోని నదుల పరిరక్షణతో బాటు , చెరువులు , వాగులు , వంకల పునరుద్ధరణకు దారితీయాలి.