దేశంలో చట్ట సభల సభ్యుల ఫిరాయింపులు చాలా సర్వసాధారణమయ్యాయి.
ఫిరాయింపుల చట్టాన్ని తెచ్చేది వాళ్లే. సవరణలు చేసి చట్టాన్ని కట్టుదిట్టం చేసేది వాళ్లే. కొత్త మార్గాలు కనిపెట్టి ఫిరాయించేది వాళ్లే.
మూడు రోజుల కిందట నలుగురు తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు- వైఎస్ చౌదరి, సిఎం రమేష్, టిజి వెంకటేశ్, గరికపాటి మోహన్ రావు- నిన్న భారతీయ జనతా పార్టీలో చేరి ఏకంగా రాజ్యసభటిడిపిని ఏకంగా బిజెపిలో విలీనంచేయడంతో ఫిరాయింపుల చట్టం మళ్ళీ చర్చకొచ్చాయి.
ఇది ఫిరాయింపుల 1985 నిరోధక చట్టం (The Constitution (Fifty-second Amendment) Act,1985) ఉల్లంఘించిందని కొందరన్నారు. నలుగురు టిడిపి సభ్యులు తమ పార్టీని బిజెపి లో విలీనం చేశారని అందువల్ల చట్టోల్లంఘనేమీలేదని మరికొందరు సమర్థిస్తున్నారు.
The Constitution (Fifty-second Amendment) Act 1985 ని క్లుప్తంగా ఫిరాయింపుల నిరోధక చట్టం (Anti-defection Law 1985) అని పిలుస్తారు.
ఈ చట్టం రావడం వెనక చాలా చరిత్ర ఉంది. పిరాయింపులనేది తొలినుంచి ఉన్నాయి. వాటిని అడ్డుకోవడం ఎలా అనేది కూడా అప్పటినుంచే మొలయింది. ఈచట్టం తీసుకురావడానికి పార్లమెంటుకు అయిదున్నర దశాబ్దాలు పట్టింది. ఈ చరిత్రను క్లుప్తంగా తెలుసుకుందాం ఇపుడు.
ఫిరాంయిపులు 1967 నుంచి ఉపందుకున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలహీనపడటంతో ఫిరాయింపులను టానిక్ లాగా వాడుకుంది. పదిహేను రోజుల్లో మూడు సార్లు పార్టీ మారి రికార్డు సృష్టించిన హర్యానా గయాలాల్ ఈ కాలం వాడే. ఆయారాం-గయారాం అనే వ్యంగ్యోక్తి పుట్టేందుకు కారణమీయనే.
అందువల్ల ఫిరాయింపులను నిరోధించాలని పార్లమెంటు సభ్యులు పట్టబట్టారు.
నిజాయితీకి శిలువ: నిష్కళంక IAS అధికారి టర్మినేషన్ కు యత్నం
నిజానికి పార్లమెంటులో మొట్టమొదటి సారి ఫిరాయింపుల మీద చర్చ మొదలు పెట్టింది తెలుగు సభ్యుడే. 1967, ఆగస్టు 11న లోక్ సభలో కాంగ్రెస్ సభ్యుడు పెండేకంటి వెంకటసుబయ్య ఈ చర్చ మొదలుపెట్టారు. చర్చ ఘాటుగాసాగింది. దీని వల్లే ఆ యేడాది అక్టోబర్ 14, 15 తేదీలలో ఢిల్లీలో జరిగిన స్పీకర్ల సభలో ఒక తీర్మానం ఆమోదించారు. పెండేకంటి ప్రవేశపెట్టిన చర్చతో డిసెంబర్ 8న లోక్ సభ ఒక తీర్మానం చేస్తూ సభ్యులు పార్టీ ఫిరాయించడాన్ని నిషేధించేందుకు తగిన సలహా లిచ్చే నిమిత్తం పార్టీనేతలతో, రాజ్యాంగ నిపుణలుతో ఒక కమిటీ వేయాలని సభ కోరింది. దీనిఫలితమే వై బి చవన్ కమిటీ.
ఇందులో గోవింద మీనన్ (న్యాయ శాఖ మంత్రి), రామ్ సుభాగ్ సింగ్ (పార్లమెంటరీ వ్యవహారాల,కమ్యూనికేషన్ల శాఖ మంత్రి), పెండేకంటి వెంకటసుబ్బయ్య,భూపేష్ గుప్తా, పి.రామమూర్తి, ఎస్ ఎన్ ద్వివేది, మధు లిమయే, కె. అన్బలగన్, జయప్రకాశ్ నారాయణ్, రఘువీర్ సింగ్ శాస్త్రి, ఎన్ సి చట్టర్జీ, ఎం సి సితల్వాడ్, సికె ధప్తరీ, ఎస్ మోహన్ కుమారమంగళం, ప్రొఫెసర్ ఎన్ జి రంగా, ప్రొఫెసర్ బలరాజ్ మధోక్,డాక్టర్ కర్ని సింగ్, డాక్టర్ హెచ్ ఎన్ కుంజ్రు సభ్యులు.
ఈ కమిటీ నివేదిక 1969 ఫిబ్రవరి 18న లోక్ సభ ముందుకొచ్చింది. ఫిరాయింపులు నిషేధించేందుకు పార్టీలకు ప్రవర్తనానియమావళి ఉండాలని, దిగువ సభలో సభ్యులు కాని వాళ్లను క్యాబినెట్లోకి తీసుకోరాదని ఈ కమిటీ అభిప్రాయపడింది.
వైబి చవన్ కమిటీ నివేదిక ప్రకారం 1967 మార్చి 1968 ఫిబ్రవరి మధ్య 12 నెలల కాలంలో 438 మంది శాసన సభ్యులు దేశంలో పార్టీ లు ఫిరాయించారు. పదవీ వ్యామోహమే ఫిరాయింపులకు ఆ రోజుల్లో ప్రధాన కారణమని చెప్పవచ్చు. ఎందుకంటే, ఆ సమయంలో పార్టీ ఫిరాయించిన 210 శాసన సభ్యులలో 116 మంది మంత్రులయ్యారు. వీరి సహకారంతోనే ఆ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. విచిత్రమేమిటంటే ఈ పార్టీల ప్రభుత్వాలే ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకురావాలని పట్టుబట్టాయి.
వెంకటసుబయ్య తీర్మాణమే ఫిరాయింపుల నిరోధక చట్టానికి పునాది వేసింది. ఈ తీర్మానం పర్యవసానంగా ఏర్పడిన వైబి చవన్ సిఫార్సుల ఆదారంగా 1973లో 32వ రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకువచ్చారు. ఫిరాయింపుల చట్టంతీసుకువచ్చేందుకు తొలి ప్రయత్నం ఇది.
పార్టీ సభ్యత్వం కోల్పోయినా, పార్టీ అనుమతి లేకుండా సభలో ఓటింగ్ నుంచి గైర్ హాజరయినా,విప్ ను ధిక్కరించినా సభ్యుడు సభలో కొనసాగేందుకు అనర్హుడని బిల్లు పేర్కొంది. అయితే, ఎమర్జన్సీ రావడంతో దీనిని పరిశీలించేందుకు ఉద్దేశించిన జాయింట్ పార్లమెంటరీకమిటీ ఉనికి కోల్పోయింది.
తర్వాత 1978లో రెండో ప్రయత్నం జరిగింది. ఆగస్టు 28న ఫిరాంపులు నిషేధించేందుకు 48వ రాజ్యంగ సవరణ బిల్లు తీసుకువచ్చారు. చాలా మంది సభ్యలు బిల్లు మీద అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఈ బిల్లును సభ ముందుంచ లేకపోయారు.
1984 డిసెంబర్ సార్వత్రిక ఎన్నికల తర్వాత ఫిరాయింపుల చట్టం మీద మళ్లీ చర్చ మొదలయింది. 1985 జనవరిలో రాజ్యాంగ 52 వ సవరణ బిల్లుగా మూడో సారి లోక్ సభ ముందుకొచ్చింది. రెండు సభల్లో పాసయింది. ఫిబ్రవరి 15న రాష్ట్రపతి ఆమోదంరావడంతో చట్టమయింది. మార్చి 18 నుంచి అమలులోకి వచ్చింది.
ఇందులో లొసుగులున్నాయని, ఫిరాయింపులు ఆగడం లేదని , చట్టాన్ని ఇంకా దృఢపర్చి ఫిరాయింపులు ఆపాలని 2003 మార్చి 5న 97వ రాజ్యంగా సరవణ బిల్లు తీసుకువచ్చారు. అది పాసయింది.చట్టమయింది. అయితే ఏమయింది. ఫిరాయింపులు ఆగలేదు. ఇపుడు ఫిరాయింపు చట్టాన్ని బాగా బిగించి, ఒక పార్టీ తరఫున చట్ట సభకు గెల్చిన వ్యక్తి మరొక పార్టీలోకి మారినా, విప్ ను ధిక్కరించినా అటోమేటిక్ గా సభ్యత్వం పోవాలని ప్రతిపాదిస్తున్నారు.
టిడిపి సభ్యులు పార్లమెంటులో అధికారపార్టీలో విలీనం కావడం ఇది రెండో సారి
మొదటి సారి వీలనమయింది 1992లో. అపుడు లోక్ సభ పార్టీ చీలిపోయిన అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రధాన మంత్రి కూడా తెలుగు వాడే, పివి నరసింహారావు.
పివి నరసింహారావు మైనారిటీ ప్రభుత్వం నడుస్తున్నారు. ఆ ప్రభుత్వం మీద వచ్చిన అవిశ్వాస తీర్మానం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ టిడిపి సభ్యులను మేనేజ్ చేసింది. తీర్మానం ఓటింగ్ సమయంలో 13 టిడిపి సభ్యులలో ఎనిమిది మంది మాయమయ్యారు. వీరంతా తర్వాత భూపతిరాజు విజయకుమార్ రాజు నేతృత్వంలో ఒక వర్గం గా ఏర్పడి లోక్సభలో తమని ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలని అప్పటి స్పీకర్ శివరాజ్ వి పాటిల్ కు లేఖ ఇచ్చారు.
తర్వాత తాము కొత్త పార్టీ ఏర్పాటుచేసుకున్నామని దాని పేరు తెలుగుదేశం పార్టీ (వి)అని, అలా గుర్తించాలని కోరారు. స్పీకర్ అంగీకరించారు. తర్వాత ఆగస్టు 20,1992 న తమ పార్టీ కాంగ్రెస్ లో విలీనమవ్వాలని నిర్ణయించిందని, దీనికి అంగీకరించాలని స్పీకర్ ని కోరారు. ఆగస్టు 24న పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి టిడిపి (వి) సభ్యులు కాంగ్రెస్ లో చేరినట్లు ప్రకటించారు.
తర్వాత ఆగస్టు 27న స్పీకర్ శివరాజ్ పాటిల్ ఈ విలీనాన్ని ఆమోదించారు. ఆ రోజు జరిగిందానికి, నిన్న అంటే జూన్ 20,2019 న జరిగిందానికి ప్రొసీజర్ లో తేడా లేదు. ఆ రోజు పివి నరసింహరావు ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఫిరాయింపులు ప్రోత్సహించారు. ఇపుడు రాజకీయాలు స్వభావాన్ని మార్చుకున్నాయి. ప్రత్యర్థి పార్టీని ఓడించడం కాదు, నిర్మూలించాలనుకుంటున్నారు. దీనికి ఫిరాయింపులు ఒక మార్గంగా ఎంచుకున్నారు. ఇదే తేడా.
(ఇది నచ్చితే, నలుగురికి షేర్ చేయండి. Healthy reading, healthy journalism కోసం trendingtelugunew.com ను ఫాలో కండి)