తెలుగుదేశం ప్రభుత్వం నియమించిన తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలిని రద్దుచేయాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారు. ఈ మేరకు తొందర్లో ఆర్డినెన్స్ ను జారీ చేస్తారు. ఈ తిరుమల మీద భక్తులలో ఉన్న అపోహలను తొలగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఈ విషయాలను దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ వెల్లడించారు.
బుధవారం ఉదయం తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్న ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు.
శ్రీవారి ఆభరణాల భద్రతపై భక్తులకు ఎన్నో అపోహలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేస్తామని, త్వరలోనే ఈ విషయంలో అధికారులతో సమీక్ష నిర్వహిస్తామని మంత్రి చెప్పారు.
ఇటీవల కలకలం రేపిన బంగారం తరలింపు వ్యవహారంపై విచారణ జరిపిస్తామనికూడా తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
ఆర్డినెన్స్ ద్వారా టీటీడీ పాలకమండలిని తొలగించగానే నూతన పాలకమండలిని ఏర్పాటు చేస్తామని తెలిపారు.
వంశపారంపర్యంగా వస్తున్న అర్చకుల సమస్యలను పరిష్కరించేందుకు కట్టుబడి వున్నామని వెలంపల్లి వ్యాఖ్యానించారు.