ఇటీవల ముగిసిన ఎన్నికలలో 151 శాసనసభ స్థానాలలోను, 22 పార్లమెంటు స్థానాలలో భారీగా గెలిచిన వైసిపి, అంచనాలకు అతీతంగా చిత్తుగా ఓడిపోయిన టీడీపీ ఈ రోజు ప్రారంభమైన శాసనసభలో మొట్టమొదటి సారి ఎదురు పడనున్నాయి. సభ్యుల ప్రమాణ స్వీకారం తర్వాత స్పీకర్ ఎన్నిక జరుగుతుంది.
ఆ తర్వాత ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. బిఎసి సమావేశములో శాసనసభ ఎన్ని రోజులు జరపాలని నిర్ణయించిన అనంతరం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే క్రమంలో శాసనసభలో చర్చ ఉంటుంది.
ఈ సందర్భంగా పాలక, ప్రతిపక్షాల మధ్య రసవత్తరమైన చర్చ సాగుతుందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.
వైసిపి అధినేత జగన్ ముఖ్యమంత్రిగా పదవీ భాద్యతలు స్వీకరించినప్పటి నుండి తనదైన శైలిలో దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందులో ప్రధానంగా తాను పాదయాత్ర సందర్భంగా ప్రజలకు ఇఛ్చిన హామీల అమలు చేయడం, అవినీతి రహిత పారదర్శక పాలన అందించాలన్న సంకల్పంతో నిర్ణయాలు తీసుకొని అమలు చేయడానికి ప్రథమ ప్రాధాన్యం ఇచ్చారు.
అలాగే గత ప్రభుత్వ పాలనలో జరిగిన అవినీతి, కాంట్రాక్టులు (కాంట్రాక్టర్లు ) పై ద్రుష్టి పెట్టడం, రాజధాని భూసేకరణ లో జరిగిన అక్రమాలు, పోలవరం పనులలో చోటుచేసుకున్న అధికార దందాలపై ప్రత్యేకంగా ద్రుష్టి సారించారు.
గత టీడీపీ హయాంలో జరిగిన జమా ఖర్చులు, చేసిన అప్పులు, ఖర్చు పెట్టిన విధానం, నీరు- చెట్టు పనులు, జన్మభూమి కమిటీలు లాంటి అనేక అంశాలపై ముఖ్యమంత్రి జగన్ తన మూడో కన్నుపెట్టారని భారీ ప్రచారం జరుగుతున్నది.
టీడీపీ అధికారంలో ఉన్నపుడు ప్రత్యర్థులపై ముందుగా దాడి చేయడం అస్త్రంగా అప్పటి ప్రతిపక్షాన్ని గుక్క తిప్పుకోకుండా చేయడానికి యత్నించి సభాపతి సాయంతో విజయం సాధించారు.
ప్రతిపక్ష సభ్యులకు అతి తక్కువ అవకాశం ఇవ్వడం, ప్రతి అంశంపై జగన్ మాట్లాడటానికి సిద్దమైనపుడల్లా ఆయన్ను కోర్టు పక్షిగా అభివర్ణించడం, తండ్రిని అడ్డం పెట్టుకొని లక్ష కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్నారని నిరంతరం ఆరోపణలు గుప్పించడం చేశారు.
టీడీపీ అవినీతిని గురించి, పాలనలో జరుగుతున్న అక్రమాల గురించి, పోలీసుల (వైసిపి కార్యకర్తలపై) ( చంద్రగిరి ఎంఎల్ ఏ చెవిరెడ్డి భాస్కరరెడ్డి పై పెట్టిన కేసులు, వేధింపులు ఒక ఉదాహరణ )అరాచకాన్నిగురించి ప్రతిపక్షం ప్రస్తావించినా, అప్పటి పాలకపక్ష టీడీపీ సభ్యులు గేలి చేయడం, నోరు పారేసుకోవడం జరిగింది.
ముఠానాయకుడుగా వ్యవహరించిన అప్పటి సభాపతి కోడెల శివప్రసాదరావు తన వర్గానికి ప్రాధాన్యత ఇచ్చి, ప్రతిపక్షం నోరు నొక్కడం, సభ్యులపై మార్షల్స్ ను ప్రయోగించడం, సస్పెండ్ చేయడం, చివరకు హైకోర్టు ఆదేశించినా, (టీడీపీ అధినేత, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు సూచన మేరకు) రోజాను సభకు రానివ్వక పోవడం లాంటి అనేక సభా నియమాల వ్యతిరేక చర్యలు తీసుకున్నారు.
ప్రస్తుతం “బండ్లు ఓడలు అయ్యాయి. ఓడలు బండ్లు అయ్యాయి”. వైసీపీకి 151 సభ్యులుండగా, ప్రతిపక్ష టీడీపీకి కేవలం 23 మంది మాత్రమే ఉన్న నేపథ్యంలో శాసన సభ భేటీ కానున్నది.
ప్రస్తుత పాలకపక్షం గత చేదు అనుభవాలను మనసులో పెట్టుకోదని, ప్రజాస్వామ్య పద్దతిలో సభ నడుపుతామని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి ప్రకటిస్తున్నారు. అయితే గతంలో అనేక అవమానాలు ఎదుర్కొన్న ఎంఎల్ ఏ లు ఈ పద్దతిలో వ్యవహరిస్తారా? అన్నది ప్రశ్న.
ఇక టీడీపీ విషయానికి వస్తే కొత్తగా ఏర్పడిన “ఈ ప్రభుత్వానికి ఆరు నెలలు సమయం ఇచ్చి ఆ తర్వాత స్పందించాలని” అధినేత చంద్రబాబు 10 రోజులకు ముందు నిర్ణయించి ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రిగా జగన్ దూకుడు, అవినీతిపై ముఖ్యమంత్రి చేస్తున్న ఖడ్గ చాలనం, టీడీపీ ప్రారంభించిన అనేక పనులు, చెల్లింపులు నిలిపివేయడం, పసుపు-కుంకుమకు, రైతులకు ఎన్నికలముందు టీడీపీ ప్రకటించిన ఎన్నికల తాయిలాలకు చెల్లు చీటీ పాడటం లాంటి చర్యలకు శ్రీకారం చుట్టారు.
గతంలో శాసనసభ నిర్వహణలో తమకు అన్ని రకాల సహకరించిన కోడెలపై “ ఆయన అధికార కాలంలో స్టోర్ చేసుకున్నఅవినీతి బాంబులను ఆయనపైన, కుటుంభం సభ్యులపైన వరుసగా పడటం” లాంటి చర్యలు టీడీపీకి మింగుడు పడటం లేదు. అందువల్ల చంద్రబాబు గతంలో చేసిన ప్రకటన నుండి మరోసారి “యు టర్న్” తీసుకుని “కార్యకర్తలపై దాడులను సహించమని, ధీటుగా ఎదుర్కొంటామని” ప్రకటించారు. ప్రాజెక్టుల నిలిపివేత రాష్ట్రానికి నష్టమని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇవే అంశాలపై టీడీపీ నాయకులు శాసనసభలో తప్పకుండా గళమెత్తనున్నారు.
అందులో భాగంగా చంద్రబాబు, ఆయన సహచరులు “Offence is the best defense” అనే పద్దతిలో పాలకపక్షం పై ముందుగా దాడి చేసి, వారు చేసే ఎదురుదాడిని భూతంగా చూపి, తన మీడియా ద్వారా ప్రచారం పొందాలని, తద్వారా పాలకపక్షంపై మైలేజి పొందడానికి ప్రయత్నించాలనే వ్యూహం అనుసరించడానికి రంగం సిద్ధం చేశారని గత రెండు రోజులుగా బాబుగారు చేస్తున్న ప్రకటనలు సూచిస్తున్నాయి.
ఇందుకు ధీటుగా అత్యధిక సంఖ్యాబలం ఉన్న పాలక పక్షం టీడీపీ పై పెద్ద ఎత్తున ప్రతిదాడి చేసే అవకాశం ఉంది. గతంలో ప్రభుత్వ పెద్దలపై వైసీపీ చేసిన అవినీతి ఆరోపణలు, ఇసుక దందా, గతంలో తమ శ్రేణులపై జరిగిన దాడులపై టీడీపీ స్పందన లాంటి అస్త్రాలను పాలపక్షం ప్రయోగించనుంది. గత శాసనసభలో అనేక అవమానాలు చవిచూసి, కడుపు మంటతో రగులుతున్న సభ్యులు మాత్రం ధీటుగా ఘాటైన ఆరోపణలతో టీడీపీని ఉక్కిరి బిక్కిరి చేయడం మాత్రం తథ్యం. టీడీపీ వ్యవహరించే విధానంపైనే తమ స్పందన ఉంటుందని పాలకపక్షం అంటున్నది. ప్రజాస్వామ్యబద్దంగా సభ నిర్వహిస్తామని, అందరికీ సమాన అవకాశం ఇస్తామని తమ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి చేస్తున్న ప్రకటనకు తాము కట్టుబడి ఉంటామని, అయితే టీడీపీ ఈ అవకాశాలను ఉపయోగించే విధానాన్ని పట్టి తమ ప్రతిస్పందన ఉంటుందని కొందరు సభ్యులు అంటున్నారు.
ఈ పరిస్థితులలో శాసనసభ జరిగే రెండు మూడు రోజులైనా సజావుగా జరుగుతుందా? అందుకు టీడీపీ అవకాశమిస్తుందా? పాలకపక్షం ఎలా ప్రతిస్పందిస్తుంది? అన్న ప్రశ్నలకు రానున్న రెండు, మూడు రోజులు సమాధానమిస్తాయి. “ పాలక, ప్రతిపక్షాలు ప్రస్తుత సమావేశాలలో వ్యవహరించే విధానమే భవిష్యత్ లో సభ జరిగే విధానాన్ని” నిర్దేశిస్తాయని చెప్పవచ్చు.