టాప్ సీక్రెట్… బ్యాంకుల్ని రు. 2 లక్షల కోట్లకు ముంచేశారు: RBI

మన బ్యాంకులేమంతా కట్టుదిట్టంగా పనిచేయడంలేదని అందరికీ తెలిసిందే. చిన్న చిన్న రైతులు,వ్యాపారస్తులు లోన్ తిరిగి చెల్లించకపోతేనో, లోన్ కావాలంటేనో నానా యాగీ చేసే ఈ బ్యాంకులను ఎంత సులభంగా ముంచేయవచ్చో ఈ మధ్య బాగా రుజువయింది.

బ్యాంకులకు తెలిసే ఈ మోసాలు జరుగుతున్నాయో, లేక బ్యాంకర్ల అజ్ఞానం వల్ల జరగుతున్నాయో చెప్పలేం కాని, భారతదేశంలో మోసపోని బ్యాంకంటూ లేదు. ప్రతి బ్యాంకు ఈ మోసాల వల్ల వేల కోట్ల రుపాయలు ప్రజాధానం కోల్పోయింది. గత దశాబ్ద కాలంలో బ్యాంకులు ఎన్ని సార్లుమోసపోయాయో ఎన్ని వేల కోట్లు నష్టపోయాయో మొదటి సారిగా ఇన్ఫర్మేషన్ యాక్ట్ పుణ్యాన బయటపడ్డాయి.

గత 11 సంవత్సరాలలో వివిధ రకాల మోసాల వల్ల బ్యాంకులు రు.2.05 లకోట్ల నష్టపోయాయి. 2008-09 నుంచి 2018-19 మధ్య దాదాపు 53,334 సార్లు బ్యాంకులు మోసపోయాయి.

ఇందులో బాగా మునిగింది ICICI బ్యాంకు. ఈ బ్యాంకు 6811 కేసుల్లో నష్టపోయిందెంతో తెలుసా? రు. 5,033.81 కోట్లు. తర్వాతి స్థానం పబ్లిక్ సెక్టర్ లోని స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా(SBI)ది.

ఈ బ్యాంకు మోసాల గురించి చేసిన ఫిర్యాదులు 6,793. నష్ట పోయింది మాత్రం చాలా ఎక్కువ రు.23,734.74 కోట్లు. ఇక ముచ్చటగా మూడో స్థానం HDFC బ్యాంకుది. ఈ బ్యాంకు రిపోర్టు చేసిన కేసులు 2, 497. నష్టపోయింది రు.1,200.79 కోట్లు.

ఈ వివరాలను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాయే RTI కింద అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా వెల్లడించింది.

ఇతర బ్యాంకులకు సంబంధించిన మోసాల కేసుల వివరాలు. బ్యాంక్ ఆఫ్ బరోడా 2160 కేసులు (రు.12,962 కోట్లు), పంజాబ్ నేషనల్ బ్యాంక్ 2047 కేసులు(రు 28,700కోట్లు),యాక్సిస్ బ్యాంక్ 1944 కేసులు (రు.5,301.69 కోట్లు). బ్యాంకాఫ్ ఇండియా 1872 కేసులు (రు 12,532కోట్లు),సిండికేట్ బ్యాంక్ 1783కేసులు (రు 5830.85 కోట్లు), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1613 కేసులు (రు.9041.98 కోట్లు). కెనరాబ్యాంక్ 1254 కేసులు (రు.5553.38 కోట్లు),యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 1244 కోట్లు (రు.11,830 కోట్లు) రిపోర్టు చేశాయి.

ఇతర బ్యాంకుల్లో ఇండియన్ వోవర్ సీస్ బ్యాంక్ 1115కేసుల్లో రు.12,644 కోట్లు పొగొట్టుకుంటే, ఒరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ 1040 కేసుల్లో రు.5598 కోట్లు నష్టపోయింది.