పోలవరం ప్రాజెక్టుకు అధిక ప్రాధాన్యత : సీఎం జగన్మోహన్ రెడ్డి
తాడేపల్లి : పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వై. ఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం ఖర్చు చేసిన మొత్తాన్ని కేంద్రం నుంచి రాబట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల తాజా పరిస్థితిపై తాడేపల్లిలోని నివాసంలో ఆ శాఖ ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
పోలవరం ప్రాజెక్ట్ పై ఇప్పటి వరకు రూ. 11,537 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని.. ఇంకా సివిల్ పనులకు రూ. 12 వేల కోట్లు, సహాయ పునరావాసానికి రూ. 27 వేల కోట్లు ఖర్చవుతుందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. త్వరలోనే తాను పోలవరం ప్రాజెక్ట్ సందర్శిస్తానని ముఖ్యమంత్రి తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ పనులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ. 4,810 కోట్లు కేంద్రం మనకు చెల్లించాల్సి ఉందని అధికారులు వివరించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి రెండేళ్లు పడుతుందని అధికారులు ముఖ్యమంత్రికి చెప్పారు.
దీనిపై స్పందిచిన ముఖ్యమంత్రి త్వరితగతిన పనులు నిర్వహించాలని సూచించారు.
ఇప్పటి వరకు పోలవరం ప్రాజెక్టు పనులు చేపట్టిన కాంట్రాక్టు సంస్థలు ఏ మేరకు పనులు పూర్తి చేశాయి… పని తీరు ఎలా ఉందనే అంశంపై ముఖ్యమంత్రి సంబంధిత అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులకు అధిక వ్యయం చేసి రాష్ట్ర ఖజానాకు గండి కొడితే… అటువంటి పనులకు సంబంధించి రివర్స్ టెండరింగ్ కి వెళ్లాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు.
అదే సమయంలో అవినీతి విషయంలో ఎవరినీ ఉపక్షించేది లేదని… చాలా కఠినంగా వ్యవహారిస్తామని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు తెలిపారు. అధికారులు, ఇంజనీర్లు ప్రాజెక్టు వాస్తవ వివరాలను తెలియజేయాలని.. తద్వారా ప్రాజెక్ట్ వ్యయాన్ని 20 శాతం వరకు తగ్గించి ప్రభుత్వ ధనాన్ని పొదుపు చేసే అధికారులు, ఇంజనీర్లను సన్మానిస్తానని సీఎం అన్నారు.
నీటి పారుదల ప్రాజెక్టులపై 2014 కన్నా ముందు ఎంత మేరకు ఖర్చు చేశారు. ఆ తర్వాత కాలంలో ప్రాజెక్టుల వ్యయాన్ని పెంచడం వల్ల ఏ మేరకు ఫలితాలు వచ్చాయి… రాష్ట్రానికి ఏ మాత్రం ప్రయోజనం చేకూరిందనే… వివరాలతో నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
రాష్ట్రంలో ప్రాధాన్యత ప్రాజెక్టులు ఏమిటి.. ఏ ప్రాజెక్టులపై దృష్టి పెడితే నీరు ఎక్కువగా వినియోగంలోకి వస్తుంది వంటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. భవిష్యత్ లో మనం ఏ వ్యూహం అవలంబించాలి… వాటికి నిధులు ఎంత మేర ఖర్చు చేయాలో వంటి అంశాలపై పూర్తిస్థాయి ప్రణాళికలను సిద్ధం చేయాలని కూడా సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాజెక్టులకు పని చేస్తున్న చీఫ్ ఇంజనీర్లు తమ సొంత అంచనాలను వాస్తవ రూపంలో వివరించాలని కోరారు. తిరిగి ఈ నెల 6 వ తేదీన ప్రాజెక్టుల వారీగా సమీక్షిస్తానని అధికారులతో ముఖ్యమంత్రి తెలిపారు.
గోదావరి జలాలను వీలైనంత ఎక్కువగా వినియోగించుకునేలా అన్ని మార్గాలను అన్వేషించి ఒక నివేదిక సమర్పించవలసిందిగా ఈ సందర్భంగా ఇరిగేషన్ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.
రాష్ట్రంలో నదీ జలాల విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ పూర్తిస్థాయిలో ఆంధ్రప్రదేశ్ కు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారన్నారు. అయితే ఎగువన ఉన్న కర్ణాటక కృష్ణానదిపై ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును పెంచుకుపోతుండటం వల్ల రాష్ట్ర భవిష్యత్ ఆగమ్యగోచరంగా మారే పరిస్థితి ఉంది… అందువల్ల గోదావరి జలాలను వీలైనంత గరిష్ట స్థాయిలో వినియోగించుకొనేందుకు సమగ్రమైన ప్రణాళికలు రూపొందించుకోవాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు.
ఈ సమీక్షాసమావేశంలో అజయ్ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి.వి.రమేష్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్, జలవనరుల శాఖ కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ఆదిత్యనాథ్ దాస్, ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి కె.ధనుంజయ్ రెడ్డి, ఈఎన్ సీ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు