(ప్రశాంత్ రెడ్డి)
అసెంబ్లీలోకి ప్రవేశించేందుకు తానేమంత తొందర పడటం లేదని, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు,మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి అన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ జిల్లానుంచి పోటీచేసి ఓడిపోయారు.
ఇపుడాయన త్వరంలో హుజూర్ నగర్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారని కాంగ్రెస్ వర్గాల్లో వినబడుతూ ఉంది. లోక్ సభ ఎన్నికలో హుజూర్ నగర్ ఎమ్మెల్య అయిన పిసిసి అధ్యక్షుడు ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి నల్గొండ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు.అందువల్ల ఉత్తమ్ హుజూర్ నగర్ అసెంబ్లీ సీట్ ను ఖాళీచేస్తారని అనుకుంటున్నారు.
అపుడు ఉప ఎన్నిక అవసరమవుతుంది. ఈ కారణాన అక్కడి నుంచి జానా రెడ్డి పోటీచేస్తారనే వార్త ప్రచారమవుతూ ఉంది. ఈ విషయం మీద జానా రెడ్డి స్పష్టత ఇచ్చారు.
హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో తాను పోటీ చేయాలని అనుకోవడం లేదని ఆయన చెప్పారు.
‘ఇపుడు అక్కడి నుంచి గెలిస్తే ఏమొస్తుంది. రాష్ట్రానికి ముఖ్యమంత్రయ్యేదే లేదుగా. నేను సీనియర్ నాయకుడిని. నా స్థాయి నాయకుడు పోటీచేయాలంటే ఏదో ఒక పర్యవసానం ఉండాలి. ప్రభుత్వమయిన ఏర్పాటుయేయాలి. లేదా ప్రభుత్వంలో కీలకపాత్ర వహించాలి. ఏదీ లేనపుడు పోటీ చేయడం ఎందుకు? అని ఆయన తన పోటీ గురించి వినవస్తున్న వార్తలను ప్రస్తావించినపుడు సమాధాన మిచ్చారు. ‘ఇలా పోటీ చేయడం కంటే, 2023 దాకా హాయిగా విశ్రాంతి తీసుకుంటాను,’ అని అన్నారు.
తెలంగాణ లోక్ సభ ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ, ఇది ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చేస్తున్న పార్టీ ఫిరాయింపులకు వ్యతిరేకంగా ప్రజలిచ్చిన తీర్పు అని ఆయన వ్యాఖ్యానించారు.
‘ఏ పార్టీకైనా ఫిరాయింపులు మంచిది కాదని నేను తొలినుంచి చెబుతున్నారు. టిఆర్ ఎస్ అనుసరిస్తున్న ఫిరాయింపుల విధానం మీద ప్రజలు సంతోషంగా లేరు. తమ ఆగ్రహాన్ని ఎన్నికల్లో వ్యక్తం చేశారు.
ఈ ఫలితాలు కాంగ్రెస్ పునరాగమన అవకాశాలను సూచిస్తున్నాయని జానారెడ్డి అన్నారు. ఆంధ్రలో అఖండ విజయం సాధించిన వైసిపి అధినేత జగన్ కు ఆయన అభినందనలు తెలిపారు.