ఇఫ్తార్ విందు: మాజీ మహిళా మంత్రితో కలిసి పాల్గొన్న లోకేష్

ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నారా లోకేశ్
వడ్డేశ్వరం ఇఫ్తార్ విందులో వెల్లివిరిసిన మతసామరస్యం
లవకుశ పాత్రధారులకు సన్మానం
నిష్టగా చేసే దీక్షలే రక్షగా రంజాన్ మాసం పూర్తి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ ఆకాంక్షించారు. మంగళగిరి నియోజకవర్గం తాడేపల్లి మండలం వడ్డేశ్వరంలో సోమవారం టీడీపీ నేత షేక్ ఖాలేషా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు మంత్రి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నారా లోకేశ్ మాట్లాడుతూ మండుటెండలను కూడా లెక్క చేయకుండా కఠిన ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదరులకు అల్లా శక్తినివ్వాలని ఆకాంక్షించారు. మహ్మద్ ప్రవక్త చూపించిన మార్గాన్ని ప్రతీ ముస్లిం అనుసరించాలని సూచించారు. అసత్యాలకు, దూషణలకు దూరంగా ఉండటం, దయాగుణం, దానగుణం కలిగి ఉండటం సత్ప్రవర్తన మార్గాలను అనుసరిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారని అన్నారు.
రంజాన్ మాసంలో చేపట్టిన దీక్షలతో భగవంతుని ఆశీస్సులు అందరికీ తప్పక లభిస్తాయన్నారు. మైనారిటీ లకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ప్రజల సహకారం, అల్లా ఆశీస్సులతో పేదరికం లేని ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు.
మత సామరస్యానికి సంకేతంగా అలనాటి లవకుశ సినిమాలో లవకుశ పాత్రధారులకు మంత్రి నారా లోకేశ్ చేతుల మీదుగా సన్మానం చేశారు. అనంతరం మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మతపెద్దలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
కార్యక్రమంలో మాజీమంత్రి గల్లా అరుణకుమారి, ఏపీ పోలీస్ హౌసింగ్ కార్పోరేషన్ చైర్మన్ నాగుల్ మీరా, టీడీపీ నేతలు గంజి చిరంజీవి, పోతినేని శ్రీనివాసరావు, మైనారిటీ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *