‘ఐటిసి’కి సిగరెట్ అలవాటు మాన్పించిన సాహసి

(శివశంకర్ హళహర్వి)

పొగతాగుట, పొగాకు  నములుట హానికరమయిన అలవాట్లు. ఈ చైతన్యం ప్రపంచమంతా వచ్చింది.

సిగరెట్ల పెట్టెల మీద అసహ్యంగా  భయపట్టే విధంగా పే…ద్ద క్యాన్సర్ బొమ్మ ముద్రిస్తున్నారు.బీడిల మీద పుర్రె బొమ్మ వస్తూఉంది. గుట్కాను నిషేధించారు.

పొగాకు వాడకం ఏరూపంలో ప్రస్తావనకు వచ్చినా సినిమా తెర మీద కూడా పొగాకు హానికరమని వెంటనే హెచ్చరిక వస్తూ ఉంది. ఇంత ప్రమాదకరమయిన పొగాకు వాడకం అలవాటు నుంచి బయటపడాలని ప్రపంచమంతా క్యాంపెయిన్ సాగుతూ ఉంది.

మనిషికి పొగాకు ఇంత ప్రమాదకరమయినపుడు ఆ మనుషులకోసం పని చేసే కంపెనీలకు పొగాకు ప్రమాదం కాదా? ప్రమాదమే నని గ్రహించిన వ్యక్తి వైసి దేవేశ్వర్ (72). దేవేశ్వర్  సిగరెట్ల కంపెనీ ‘ఐటిసి’కి నాన్ ఎగ్జిక్యూటివ్ ఛెయిర్మన్ గా ఉన్నారు. అంతకు ముందు ఆదే కంపెనీకి 21 సంవత్సరాల పాటు ఎగ్గిక్యూటివ్ చెయిర్మన్ గా ఉండినారు.  ఆయన శనివారం ఉదయం మరణించారు.సిగరెట్ల  కంపెనీకి హానికరమయిన పొగాకుఅలవాటును క్రమంగా మాన్పించే సాహసం చేసిన వ్యక్తి దేవేశ్వర్.

కేవలం సిగరెట్లు తయారుచేసేకంపెనీ ఐటిసి. ఆయిల్స్, హోటళ్లు ఉన్నా  ఐటిసి అంటేనే ఇంపీరియల్ టొబాకో కంపెనీ. ఈ కంపెనీ బతకుంతా పొగాకు మీదే అధార పడి ఉంది. మారుతున్న ప్రపంచంలో  పొగాకుకు  బానిస కావడం మంచిది కాదు, కంపెనీ ఆరోగ్యానికి అది ప్రమాదకరం అనే విషయాన్ని  ఐటిసి బాధ్యతలు స్వీకరించాక ఆయన గమనించిన మొదటి వాస్తవం.

ఆలస్యం చేయకుండా ఐటిసికి పొగాకు అలవాటు మానిపించాలనుకున్నారు. ఆ పని మొదలుపెట్టారు. చాలా వరకు విజయవంతమయ్యారు.

ఐటిసి అనగానే ఎవరికైనా గుర్తు కొచ్చేవి సిగరెట్లు. అందుకే మొదట చేసిన పని ఆయన ఇంపీరియల్ టొబాకో కంపెనీని కేవలం ఐటిసి గా మార్చారు.

కంపెనీలో పొగాకు వాసన రాకూడదని  నిర్ణయించుకున్నారు. పొగాకు మీద వేల కోట్లు సంపాయించే కంపెనీకి పొగాకు అలవాటు మాన్పించాలనుకోవడం చాలా సాహసం.  అయినా సరే, సాహసమార్గాన్నేఎంచుకున్నారు.  ఐటిసిని, బిస్కట్లు, పాలవుత్పత్తుల వంటి ఆహారోత్పుల రంగంలోకి , పెన్సిళ్లు పేపర్ నోటు బుక్కుల వంటి స్టేషనరీ రంగంలోకి, డియోడరెంట్ వంటి పర్సనల్ హెల్త్ కేర్ ఉత్పత్తులలోకి మళ్ళించాడు.

ఐటిసిలో ఉన్న తన 21 సంవత్సరాల కాలంలో  కంపెనీని పొగాకు నుంచి దూరం జరపడంలో విజయవంతమయ్యారు. దీనికి కంపెనీ ఎకనామిక్సే సాక్ష్యం.

1996లో కంపెనీ  ఆదాయంలో 75 శాతం పొగాకుఉత్పత్తుల అమ్మకం నుంచే వచ్చింది. 1996 జనవరి లో ఆయన కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా చేరారు. ఆ పదవిలో ఆయన 2017 ఆగస్టుదాకా ఉన్నారు. ఆయన పదవీ బాధ్యతల నుంచి తప్పుకునే నాటికి ఐటిసికి  వచ్చే రాబడిలో పొగాకు వాటా 41 శాతానికి తగ్గిపోయింది.

ఐటిసి అమ్ముల పొదిలో ఇపుడు 25 రకాల శక్తివంతమయిన పోగాకేతర బ్రాండులున్నాయి. వాటి మీద రు. 14 వేలకోట్ల రుపాయల వ్యాపారం నడుస్తూ ఉంది. భారతదేశంలో ఏ మధ్య తరగతి ఇల్లాలినైనా అడగండి, ఐటిసి అంటే ఏమిటని, ఆమె టకీమని చెబుతుంది, ఆశీర్వాద్ రొట్టె పిండి అని.

క్లాసిక్, విల్స్ నేవీ కట్, గోల్డ్ ఫ్లేక్ వంటి సిగరెట్ల   చెడ్డపేరుతో  చలామణి అయిన ఐటిసి ఈ రోజు ఆరోగ్యానికి సహకరించే సన్ ఫీస్ట్, ఆశీర్వాద్, వివెల్, యిప్పీ, బింగో,పియామా వంటి బ్రాండ్లతో (ఎప్ ఎంసిజి) కొత్త అవతారమెత్తింది. అంతేకాదు, పొగాకు అలవాటు మానేసే కొద్ది ఐటిసి ప్రపంచం విస్తరించడం మొదలుయింది. ఇన్ ఫో టెక్ రంగంలోకి కూడా దూకింది. ఈ ఘనత దేవేశ్వర్ దే.

దేవేశ్వర్ డిల్లీ ఐఐటి లో చదువుకున్నారు. తర్వాత హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబియే కూడా చేశారు.

 

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *