పోరాటాలు చేయండి: కలెక్టర్ పిలుపు

విజ‌య‌వాడ‌: సమాజంలో ప్రజలు ఎదుర్కుంటున్న సమస్యలపై పోరాటం చేయటమే అల్లూరి సీతారామరాజుకు నిజమైన నివాళి అని కృష్ణా జిల్లా కలెక్టరు ఏ.యండి. ఇంతియాజ్ అన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 95వ వర్ధంతి సందర్బంగా మంగళవారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి కలెక్టర్‌ఇంతియాజ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
తొలుత జిల్లా కలెక్టరు ఇంతియాజ్, వృత్తి విద్య శిక్షణ శాఖ డైరెక్టరు డాక్ట‌ర్ కె.మాధవిలత, గిరిజన సంక్షేమశాఖాధికారి ఈశ్వరరావులు అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ గిరిజనుల సంక్షేమం, హక్కులకై బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాటం చేసిన మహనీయుడు అల్లూరి సీతారామరాజు అన్నారు. నేటి యువత ఆయన త్యాగాలను గుర్తుంచుకోవాలన్నారు. గిరిజనుల అభివృద్ధి కై గిరిజన సంక్షేమశాఖ ద్వారా అమలు జరుగుతున్న సంక్షేమ పధకాలు వారికి లబ్ది చేకూర్చే విధంగా ఉండాలని అధికారులను కలెక్టరు కోరారు. సమాజంలో ఎందరో వ్యక్తులు పుడతారని వారిలో కొందరినే మనం ప్రత్యేకంగా గుర్తుంచుకోవడం జరుగుతుందన్నారు. ఇటువంటివారిలో అల్లూరి సీతారామరాజు ఆ కోవకే చెందుతారన్నారు.
సమాజంలో గ్లోబల్ వార్మింగ్ , పేదరికం, కాలుష్యం ప్రధాన శత్రువులుగా భావించి వాటిపై పోరాటం చేయాలన్నారు. ధైర్యాన్ని సహనాన్ని స్పూర్తిగా తీసుకుని చెడును ఎదుర్కోవాలన్నారు. స్థానిక పరిస్థితులు ఆధారంగా సీతారామరాజు సాయుధ పోరాటం చేసారనీ, హింసకు వ్యతిరేకం కాదని గిరిజనుల హక్కులను హరిస్తున్న నాటి బ్రిటీష్ ప్రభుత్వం పైనే పోరాటం చేసారని గుర్తు చేసారు.
గిరిజనులను ప్రత్యేక దృష్టితో చూసి అభివృద్ధి పథంలో వారిని తీసుకురావాలని గిరిజన సంక్షేమ శాఖాధికారులను కలెక్టరు కోరారు. ఉపాధి కల్పన, శిక్షణా శాఖ డైరెక్టరు డా. కె. మాధవిలత మాట్లాడుతూ మన్యంవీరుడు అల్లూరి సీతారామ రాజు జీవిత చరిత్ర నుండి మంచిని తీసుకోవాలన్నారు. స్థానికంగా ఉన్న తక్కువ వనరులు, నాటి పరిస్థితులపై గిరిజనుల పక్షాన బ్రిటీష్ ప్రభుత్వంపై పోరాడారని గుర్తు చేసారు. నేటి యువత ఆయన ఆదర్శాలను స్పూర్తిగా తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో వివిధ గిరిజన నాయకులు జిల్లా కలెక్టరు ఇంతియాజ్‌ను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖాధికారి డాక్ట‌ర్ వెలగాజోషి, జిల్లా ఉపాధి కల్పనా శాఖాధికారి డాక్ట‌ర్ పి.వి రమేష్‌కుమార్ , ఐటిఐ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.రాధాకృష్ణ, కళాశాల విద్యార్ధులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *