తెలంగాణ ఫిరాయింపుదార్ల మీద తిరుగుబాటు

పార్టీ ఫిరాయించిన వాళ్ల మీద చట్ట పరంగా ఎలాగూ చర్యలుండవు. అందుకే ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉండే కంతల్లోంచి ఫిరాయింపుదారులు చక్కగా అసెంబ్లీలో రూలింగ్ పార్టీలోకి దూరిపోతున్నారు.
అంతేకాదు, మాదే అసలయిన ప్రతిపక్ష పార్టీ అని, మా ఇష్టం వచ్చినట్లు చేసుకుంటామని , ఇదిగో  రూలింగ్ పార్టీలో కలిపేస్తున్నామని ప్రకటిస్తున్నారు.
దీనిని ఎవ్వరూ ఆపలేరిక ముందు. ఎందుకు? స్వయాన దేశ ప్రధాని  మోదీ ఫిరాయింపులను ప్రోత్సహించబోతున్నారు. 40 మంది తృణమూల్ ఎమ్మెల్యేలు తన కాంటాక్ట్ లో ఉన్నారని, లోక్ సభ ఎన్నికలయిపోతూనే బెంగాల్ లోని మమత బెనర్జీ ప్రభుత్వం కూలిపోతుందనే స్తాయిలో మాట్లాడారు. దేశప్రధాని రీజినల్ పార్టీ నాయకుడిలాగా మాట్లాడితే ఎలా?
టిఆర్ ఎస్, తెలుగుదేశం పార్టీలు ప్రధాని మమ్మల్ని కాపీ కొడుతున్నారని కార్యాలయాల పార్టీ ఆఫీసుల కప్పెక్కి ప్రకటించవచ్చు.
అందుకే ఫిరాయింపు దారులకు వాళ్లకు ఓటేసిన ప్రజలు సమాధానం చెప్పాలి. ఇపుడదే జరుగుతున్నట్లనిపిస్తున్నది తెలంగాణలో.
తెలంగాణలో ఫిరాయించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద దాడులు జరగుతున్నాయి. ప్రజలు తిరుగబడుతున్నారు.రాళ్లు విసురుతున్నారు. రూలింగ్ పార్టీలో చేరిపోయి, మొన్న ఎన్నికల్లో పెట్టిన ఇన్వెస్ట్ మెంటును వడ్డీతో సహా రాబట్టుకోవడానికి కాంగ్రెస్ శాసన సభ్యులు ప్రయత్నిస్తుంటే,
కాంగ్రెస్ పార్టీ ఎందుకు మారారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
వాళ్ల ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పలేక ఎమ్మెల్యేలు ఇబ్బంది పడుతున్నారు. టిఆర్ ఎస్ లోచేరిన వారి సంగతి సరే,చేరేందుకు ముహూర్తం పెట్టుకున్న వారి పరిస్థితి దీనితో తారుమారయ్యే అవకాశం ఉంది. అటు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్‌లోకి వెళ్లలేక, ఇటు తమను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సర్ధిచెప్పుకోలేక పోతున్నారు.
రాష్ట్ర విభజన అంతంత మెజారిటీ గెలిచిన టిఆర్ ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్‌ అని ఉద్యమం మొదలు పెట్టి ఇతర పార్టీ ఎమ్మెల్యేలను కారెక్కించుకుంది. మొదట టిడిపి పని పట్టింది. ఆ ఎమ్మెల్యేలను పెద్ద ఎత్తున పార్టీలో చేర్చుకుని టిడి ఎల్ పిని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయించుకుంది. స్పీకర్ దగ్గిర ఈ వివాదం ముగియనేలేదు. ఎన్నికలొచ్చాయి. అయిపోయాయి. ఆ స్పీకర్ ఓడిపోయారు.
ఇపుడు కొత్త అసెంబ్లీ వచ్చింది. ఈ సారి టిఆర్ ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ ను కాంగ్రెస్ పార్టీపై ప్రయోగిస్తూ ఉంది. కాంగ్రెస్ వాళ్లకోసం కారు డోర్లన్నీ బార్లా తెరిచి ఉంది. కాంగ్రెస్ వాళ్లకూడా ‘నియోజకవర్గం అభివృద్ధి, బంగారు తెలంగాణ’ అని మాయమాటలు చెప్పి కార్లో కి దూకుతున్నారు. ఇపుడు వాళ్ల సంఖ్య కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీని టిఆర్ ఎస్ లో విలీనం చేసే స్థాయికి చేరుకుంది.
ఈ దశలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మీద దాడులు మొదలయ్యాయి. ప్రజలు, కార్యకర్తలు తిరుగుబాటు చేస్తున్నారు.
నిన్న ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాల లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఇల్లందు కాంగ్రెస్ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌ గ్రామస్తులు ఆగ్రహం చవి చూసింది. ఆమె మీదకు వాళ్లు దాడికి దిగారు.
పార్టీ ఫిరాయించడం మీద పెద్దఎత్తున నిరసన తెలిపారు.
ఎన్నికలపుడేమో ప్రాణం పోయినా పార్టీ మారనని చేసిన ప్రకటన ఏమయిందని ప్రశ్నించారు. సమాధానం చెప్పాలని నిలదీశారు. కారు మీద రాళ్లేశారు.
ఈ రోజు పినపాక కాంగ్రెస్ ఎమ్మెల్యే రేగ కాంతారావు ను ప్రజలు నిలదీశారు. బూర్గంపహాడ్ మండలంలోని రెడ్డిగూడెం గ్రామంలో స్థానిక ఎన్నికల ప్రచారానికి వచ్చిన కాంతారావును వాళ్లు నిలేశారు. ఎందుకు పార్టీ ఫిరాయించావో సంజాయిషీ ఇవ్వాలని నిలదీశారు. గౌరవ ఎమ్మెల్యేకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ మొదలయింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాంతారావు ఇక గత్యంతరం లేక ప్రచారాన్ని మధ్యలోనే ఆపేశారు.
కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపుదారులు టి ఆర్ ఎస్ ను తిట్టి కాంగ్రెస్ వోటేయండని అడిగిన గ్రామాల్లోనే టిఆర్ ఎస్ వోటేయండి, కాంగ్రెస్ ను ఓగించడని మూనెళ్లలోనే మాటా మార్చడం ప్రజలు, కార్యకర్తులు సహించలేకపోతున్నారు. దీనితో ప్రచారానికి వెళ్లాంటే భయపడే వాతావరణ ఏర్పడుతూ ఉంది. ముందు ముందు పరిస్థితి ఎంత తీవ్రమవుతుందో చూడాలి. ప్రభుత్వం అండ ఉంది కాబట్టి, ఫిరాయింపు దార్లమీద దాడి చసిన వారిమీద కేసులు పెట్టి సతాయించి నోరు మూయించవచ్చని, అయితే,ఇది ఎంతోకాలం సాగదని కాంగ్రెస్ నేతలంటున్నారు. ఇది మంచిపరిణామమని, ప్రజలు నిజం తెలుసుకుంటారని వారు చెబుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *