చందమామను తెచ్చిస్తారు, చెట్నీతో నంజుకోండి

(బివి మూర్తి)
బెంగుళూరు: పొద్దున ఎనిమిది ఎనిమిదిన్నర సమయంలో క్యాత్సంద్ర ‘పవిత్ర హోటల్’ లో ఓ తట్టె ఇడ్లీ తిని బ్రేవుమని త్రేన్చితే ఆ రోజు అద్భుతంగా ఆరంభమైనట్టేనని కర్ణాటకలో, ముఖ్యంగా బెంగుళూరులో చాలా మంది గట్టిగా నమ్ముతారు.
బెంగుళూరు నుంచి తుమకూరు జిల్లా కేంద్రానికి వెళ్లేప్పుడు తుమకూరు ఇంకో ఏడు కిలోమీటర్లుండగా ఎదురయ్యే నాలుగు రోడ్ల కూడలికి రాగానే రారా ఇటు రారా అని పిలుస్తుంది పవిత్ర హోటలు.
ఆ కూడలి నుంచి తుమకూరు నగరానికి దారితీసే ఫ్లై ఓవర్ కి కుడి పక్కన ఆ హోటలుండే ప్రాంతమే క్యాత్సంద్ర-ఒక పల్లెటూరు. అందుకే అది క్యాత్సంద్ర పవిత్ర హోటలు గా పేరువడింది.
ఈ హోటల్లో మెనూ చాలా చిన్నది. తట్టె ఇడ్లీతో పాటు దోశ, వడ, చిత్రాన్న(తెలుగులో చిత్రాన్నం) మాత్రమే లభిస్తాయి.
అయితే అన్నింటిలోకీ తట్టె ఇడ్లీకే అగ్రతాంబూలం. అమ్మ ఉతికి ఆరేసిన తెల్లచీరలా ఉందని మన రావిశాస్త్రి ఓ కథలో వెన్నెలని వర్ణించాడు గుర్తుందా.
ఆయనే గనుక జీవిత కాలంలో ఈ హోటల్ సందర్శించి ఉంటేనా, పున్నమి చంద్రుడికి తట్టె ఇడ్లీ పోలిక తప్పక తెచ్చి ఉండేవారు.
ఐదారు టేబిల్స్ ఒక్కో వరస చొప్పున మూడు వరసల్లో మొత్తం ఓ యాభై అరవై మందికి జాగా ఉన్న ఈ హోటల్లో, బైట వరండాలో, చిరంజీవి సినిమా కోసం థియేటర్లలో ఎక్స్ ట్రా ఛెయిర్లు వేసినట్టు, నిలబడే గబగబా తినేసి పారిపోయే వాళ్ల కోసం ఓ నాలుగు ఎత్తైన టేబిల్సూ, వాటి పైన రెండు అక్షయ పాత్రల్లో చెట్నీ, సాంబార్లూ సర్వధా సిద్ధంగా ఉంటాయి.
ఇంత మంది జనమున్నారేమిట్రా బాబూ అని భయపడకుండా, ముఖ్యంగా ఆ జనాన్ని చూసి విసుక్కోకుండా, కొంత ఉత్సాహాన్నీ, మరికొంత ఉల్లాసాన్ని వెంట తీసుకుని లోపలికి వెళితే అప్పుడుంటుంది అసలు కథ. ఎంత జనమున్నా ఫర్వాలేదు, మీకూ, మీ ప్రియాతిప్రియమైన తట్టె ఇడ్లీకి మధ్య విరహం కేవలం పదే పది నిముషాలు.
ఎందుకంటే ఇక్కడి సర్వారాయుళ్లూ, వంట గదిలోని పాకశాస్త్ర భట్టారకులూ, స్వచ్ఛభారత్ కరసేవకులు హోల్ సేల్ గా అందరూ మహాస్పీడుః, స్పీడస్య, స్పీడోభ్యః. అందునా వరండాలోని కస్టమర్ల కోసం క్యాష్ లో కూచున్న అబ్బాయి వంటగది వేపు చూస్తూ కేక వేశాడంటే ఆ ఆర్డరు చండశాసనమే.
స్టీలు ప్లేటులో పరిచిన అరిటాకు ఆకుపచ్చ ఆకాశంలో పున్నమి చంద్రుని వంటి తట్టె ఇడ్లీ కళ్ల ముందు ప్రత్యక్షమయ్యాక, తక్షణ చర్యలకు దిగిపోడమే తప్ప తమాయించుకునే ప్రసక్తే లేదు.
ఇడ్లీతో పాటు సాంబారు కూడా పొగలు కక్కుతున్నా, మూతి కాలుతుందని తెలిసినా, చెట్నీలో అద్దుకునైనా సరే ముందో ముక్కయినా తింటేనే తప్ప ఆత్మారాముడు క్షమించడు. ఆ తెల్లని ఇడ్లీ మీద ముచ్చటగా మూడు మిల్లిగరిటెల నెయ్యితో సమానమైన ఓ బుల్లి చతురస్రాకారపు లేత పసుప్పచ్చ వెన్నముక్క కూడా ఉంటుందా…., మన కళ్లెదురుగానే అది కరిగిపోతుండటం ఓరకంట గమనిస్తూ, ఓ అంచు నుంచి కొంచెం తుంచి, పప్పులు కొబ్బెర పచ్చడిలో ముంచి నాలుక మీద ఉంచితే నా సామి రంగా…, మాటల్లో చెప్పలేం, తిని అనుభవించాలంతే.
అన్నట్టు ఇక్కడి ఇడ్లీ పచ్చడికి వెల్లుల్లి కంపుడదు గానీ కమ్మని పుదీనా  వాసన గుబాళిస్తుంటుంది. పచ్చడి మోజులో పడి సాంబారు సంగతి మర్చిపోయే ఛాన్సే లేదు. దంచిన ధనియాల మసాలా డామినేట్ చేస్తూ ఉల్లిపాయతో కలిసి ఊరించే కర్ణాటక స్పెషల్ సాంబారు నిండిన కప్పులోకి మీ చేతిలోని స్పూను దాడికి వెడలడం మీ అదుపాజ్ఞలతో నిమిత్తం లేని ఓ అసంకల్పిత ప్రతీకార చర్య. ఉన్నట్టుండి చిన్న పిల్లాడై పోయి అమ్మ వొడిలో (పవిత్ర హోటల్ ప్రాంగణంలో) కూర్చుని గారాలు పోతూ, అదో సారి ఇదో సారి అనుకుంటూ ఓ సారి చెట్నీతో ఓ సారి సాంబారుతో ముద్దుముద్దుగా తింటారో, తిండిపోతుకుండే కసితో ఇవ్వాళ ఈ ఇడ్లీని ఊరికే వదలకూడదని పళ్లు కొరుకుతూ సాంబారులో ముంచేసి చెట్నీలో పొర్లించి పొర్లించి తింటారో మీ ఇష్టం. షరా: చెట్నీకి సాంబారుకు రేషన్ లేదు. తిను వేళలు ఉదయం 7 నుంచి 11 వరకు, సాయంత్రం 4 నుంచి 7 వరకు. స్త్రీలకు ప్రత్యేక స్థలము లేదు, ఫ్యామిలీ రూమ్ లు అస్సలు లేవు.
క్యాత్సంద్ర పవిత్ర ఇడ్లీ హోటలు ప్రస్తుత యజమాని సుందరేశ్. ఆయన మూడో తరం వాడు కాగా వారి తాతల కాలం నుంచి దాదాపు ముప్ఫయ్యేళ్లుగా ఈ హోటలు నడుస్తోంది. రోజుకు హీనపక్షం రూ.50 వేల దాకా వ్యాపారం అవుతుందని పక్కనున్న కిళ్లీ షాపు అబ్బాయి చెప్పాడు.
బెంగుళూరు నుంచి మైసూరు వెళ్లేప్పుడు బెంగుళూరు నగర శివార్లు దాటాక బిడది సమీపంలో రోడ్డు కిరువైపులా అటూ ఇటూ ఉన్న ఓ యాభై అరవై హోటళ్లలో రోజూ వందలాది మంది తట్టె ఇడ్లీ ఆవురావురుమని తింటుంటారు. మంది ఎక్కువైతే మజ్జిగ పల్చనైనట్టు మైసూరు దారిలోని బిడది ఇడ్లీ ఆ రహదారిలో తిరిగే వందల వేల వాహనాల ధాటికి ఫక్తు కమర్షియలైజ్ అయిపోయి సహజత్వం కోల్పోయింది. కానీ క్యాత్సంద్ర ఇడ్లీ మాత్రం నాణ్యత ఏ మాత్రం తగ్గకుండా ఇంకా ఇంకా నిత్యనూతనంగా ఘుమఘుమ లాడుతూ ఆ దారంట వెళ్లే వాళ్లను నిత్యనూతనంగా అలరిస్తూనే ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *