ఉపాధ్యాయులు, ఉద్యోగుల పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసీ) అసంతృప్తి వ్యక్తం చేసింది.
దేశంలో కెల్లా అత్యధిక వేతనాలు తెలంగాణలోనే ఉన్నాయని ముఖ్యమంత్రి కెసిఆర్ ఒక అబద్దాన్ని పదే పదే వల్లె వేయటంద్వారా ఉద్యోగులపట్ల ప్రజల్లో అపోహలు కలిగిస్తున్నారని, ఉపాధ్యాయులకు సమస్యలే లేవని వ్యాఖ్యానించటం సమంజసం కాదని యుయస్పీసీ స్టీరింగ్ కమిటీ విమర్శించింది.
దేశంలో 7వ కేంద్ర వేతన సంఘం వేతనాలను అమలు జరుపుతున్న 16 రాష్ట్రాల్లో ఉద్యోగులు తెలంగాణ కంటే అధిక వేతనాలు పొందుతున్నారని, పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈనెల నుండి 20 శాతం అధికంగా వేతనాలు పొందుతున్నారని యుయస్పీసీ నాయకులు స్పష్టం చేశారు.
ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పీసీ) రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం మంగళవారం టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర కార్యాలయంలో ఎం రఘుశంకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ……. తమ అవసరం కోసం సంఘాలను చీల్చి కొత్త సంఘాలను ఏర్పాటు చేసిన వారు, హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 52 సంఘాల మద్దతు తమ అభ్యర్థికి ఉందని చెప్పుకున్నవారు ఈరోజు అన్ని సంఘాలెందుకని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
ప్రజాస్వామ్యం లో సంఘం పెట్టుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుందని, సమస్యలే లేకుంటే సంఘాలు, ఉద్యమాల అవసరం ఏముంటుందని అన్నారు. సంఘాల పేరుతో విధులను నిర్లక్ష్యం చేసే వారెవరైనా ఉంటే వారిపై చర్యలు తీసుకునే అధికారం ప్రభుత్వానికే ఉన్నప్పటికీ చర్యలు తీసుకోకుండా సంఘాలన్నింటినీ నిందించటం సమంజసం కాదన్నారు.
గత సంవత్సరం మే 16న ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలు ఒక్కటి కూడా ఇప్పటి వరకు పరిష్కారం కాలేదని, ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ఏమాత్రం శ్రద్ద చూపటం లేదని వారు విమర్శించారు.
ముఖ్యమంత్రి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, వేసవి సెలవుల్లోనే అన్ని కేటగిరీల ఉపాధ్యాయుల పదోన్నతులు నిర్వహించాలని, 2018 జూన్ 2 నుండి ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న 2 వాయిదాల డిఏలు విడుదల చేయాలని, స్పాట్ డ్యూటీ చేసిన ఉపాధ్యాయులకు పిపిఎల్ ఇవ్వాలని, స్పెషల్ అసిస్టెంట్లకు టిఎ డిఏలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 20 న పాత పది జిల్లాల పరిధిలోని స్పాట్ కేంద్రాల్లో ఉదయం 9.00 నుండి 10.00 వరకు నిరసన ప్రదర్శనలు నిర్వహించాలని యుయస్పీసీ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం నిర్ణయించింది.
ఈ సమావేశంలో సిహెచ్ రాములు, బి కొండల్ రెడ్డి, చావ రవి, మైస శ్రీనివాసులు, టి లింగారెడ్డి, ఎన్ చెన్నరాములు, జాడి రాజన్న, కొమ్ము రమేశ్, కె సుభాష్,ఎస్ హరికిషన్, ఎస్ కైలాసం, మసూద్ అహ్మద్, కె బిక్షపతి, ఎ గంగాధర్, వి శ్రీను నాయక్, వెంకట్రావు జాదవ్ తదితరులు పాల్గొన్నారు.
యుయస్పీసీ మద్దతు తో వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గా ఎన్నికైన నర్సిరెడ్డి సమావేశానికి హాజరై కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటానని, సమస్యల పరిష్కారానికి, ఐక్య ఉద్యమాల బలోపేతానికి తనవంతు సహకారం అందజేస్తానని అన్నారు.