ఇంత మంచి పెన్నతల్లి,  ఇంత మంది కన్నతల్లి ఎందుకెండిపోయెనో

(డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి)

సాధారణంగా జీవశాస్త్రంలో నాడి వ్యవస్థ ప్రస్తావన వస్తుంటుంది. మానవ శరీరంలో జ్ఞాననాడులు, చాలక నాడులు, సహసంబంధనాడులు ఇలా మూడురకాలుగా పేర్కొంటారు. ఇందులో జ్ఞాననాడులు కీలకమైనవి. మెదడు నుండి శరీరభాగాలకు సంకేతాలను పంపడం వీటి పని. వీటిలో పదవ కపాలనాడి(వేగస్ నాడి) అత్యంత ప్రధానమైంది. శరీరానికి నాడుల ఎంత అవసరమో, ఎంత కీలకమో  పై  అంశాలు తెలియచేస్తాయి. అందుకే ఇతర అత్యంత కీలక సందర్భాలలోను నాడి అనే పదం వాడుతుంటారు. ప్రాణప్రదం, ప్రాణాలను కాపడేది అనే అర్థంలో “జీవనాడి” పదం వ్యవహారంలో ఉంది.

ఈ రోజు ఉదయాన్నే (8-4-2019) ఆంధ్రజ్యోతి పత్రిక, జిల్లా సంచిక “స్టడీపేజి”లో ప్రధాన శీర్షికగా ..”రాయలసీమ జీవనాడి పేరొందిన నది?” అనే ప్రశ్న ఉంది. ‘ఆంధ్రప్రదేశ్ నదులు, సరస్సులు’ గురించి ఏపీపీఎస్సీ పరీక్షల కోసం ప్రత్యేకంగా అందిస్తున్న సమాచారంలో భాగంగా ఈ ప్రశ్న ఉంది.  పెన్నానది ఒడ్డునే ఉన్న నాకు ఈ ప్రశ్న విచిత్రంగా మెలిపెడుతుంది.

రాయలసీమలో పదుల సంఖ్యలో నదులు కనిపిస్తాయి. చాల అందమైన పేర్లతో కూడి ఉంటాయి. పింఛా,బహుదా, హంద్రీ, వేదవతి, జయ మంగళి, కుముద్వతి, కుషావతి చిత్రావతి , మాండవ్య ఇలా ఉంటాయి సీమ నదుల పేర్లు. నిజానికి కొత్త వారెవరైన సీమ నదుల పేర్లు వింటే, పేర్లే ఇంత అందంగా ఉన్నాయే..ఇంకా నది చూస్తే ఎంత సహజసిద్దంగా ఉంటుందో కదా అనే ఆసక్తి అప్రయత్నంగా కలుగుతుంది. తీరా నది వద్దకు వెళ్ళి చూస్తే కన్నీళ్ళు మిగులుతాయి తప్ప అక్కడ నీటి చుక్కలు మాత్రం కనుచూపుమేరలో కనబడవు.

రాయలసీమ నదులన్నింటి కంటే పెద్దది, విస్తారమైన పరీవాహకం ఉన్నది, అనేక ఉపనదులను కలుపుకొని పోయేది, సీమలోని అన్ని జిల్లాలతో సంబంధం ఉండేది ..పెన్నానది. ఆరోజులలో ఈ నదిని పీనుగుల పెన్న అనే వారు. అనుకోకుండా విపరీత ప్రవాహాలు వచ్చి శవాలు కొట్టుకపోయేవని చెబుతారు. కర్నాటక లోని‌ నంది కొండలో శివుని ఆలయం నుండి ప్రారంభమై అనంతపురం, కడప, నెల్లూరు మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది. మధ్యలో కర్నూలు, చిత్తూరు జిల్లాలోని అనేక నదులను తనలో భాగం చేసుకొంటుంది.

పెన్నానది నిరంతరం భాగ ప్రవహించి ప్రజలకు జీవనాడిగా నిలిచిన మాట ఒక వందేళ్ళ కిందట సత్యమై ఉండవచ్చమే కానీ నేడు మాత్రం కాదు.   1956 లో  విద్వాన్ విశ్వం గారు వెలువరించిన “పెన్నేటి పాట” కావ్యమే అందుకు సాక్ష్యం.

“అదే పెన్న ! అదే పెన్న ! నిదానించి నడు !  విదారించు నెదన్, వట్టి ఎడారి తమ్ముడు !” .‌‌… తెలిపి  …
“ఇంత మంచి పెన్నతల్లి ఎందుకిట్లమారెనో ?
ఇంత మంది కన్నతల్లి ఎందుకెండిపోయెనో ?”.. అని నోరు నెత్తి కొట్టుకొంటాడు .

కనీసం విశ్వం గారి కాలానికి ఇసుకతో నది అయినా ఒక రూపంగా పెన్న ఉండేది. కానీ నేడు ఏళ్ళకేళ్ళు ప్రవాహాలు లేని కారణంగా ఆ నది చాలా చోట్ల నదిరూపం కోల్పోయి సమతలం అయింది. పూర్తిగా కంపచెట్ల మయమయింది.

వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే ఈ రోజు పెన్నానది రాయలసీమకు జీవనాడి  ఎట్లా పేరొందుతుంది. గతంలో పేరొందిన నది అంటే సమంజసంగా ఉండేది. ప్రస్తుతం ఏ పాఠ్యపుస్తకాలు, భౌగోళికశాస్త్ర పుస్తకాలలోను పెన్నానది సీమకు జీవనాడి అని లేదు. కనీసం వ్యవహారంలోను ఇప్పుడు లేదు. ఒక వేళ అలా ఉన్నా అది సత్యం కానేరదు. పాతకాలం నాటి మాటే అవుతుంది. నెల్లూరు ప్రాంతంలో ప్రవహించే పెన్నానది వారికి జీవనాడి కావచ్చేమో, అక్కడ ఇప్పటికీ కొన్నైన నీళ్ల ప్రవాహం సాగుతుండచ్చు…సీమ వాళ్ళకు మాత్రం కాదు.

ఏదో పరీక్షల కోసం అలా ప్రశ్నగా రచయిత  అడిగి ఉన్నా..ఆ ప్రశ్ననే శీర్షికగా ఉంచి నిత్యం పెన్నలో సస్యశ్యామలంగా నీళ్ళు ప్రవహించి సీమకు జీవనాడిగా నిలుస్తున్నట్లు దేశమంతా  ప్రచారమయ్యేలా చేయడం… అక్షరాల అబద్ధాన్ని నిజం చేయడమే అవుతుంది. వాస్తవాలను, శాస్త్రీయ ఆలోచనలను, కార్యకారణ వివేచనా శక్తిని విద్యార్థులలో పెంపోందించాల్సిన  రోజల్లో ఇలా రాయడం అనుచితం. చచ్చిన వాన్ని బతికించినట్టు ప్రచారం చేయడమంటే… వారి ఆత్మను శంకించడమే అవుతుంది. పెన్నను జీవనాడి అనడం అంటే పెన్నా నదిని, పెన్న ఒడ్డున ఉన్న ప్రజలను అవమానించడమే అవుతుంది.

మా పెన్నానది మృతనదిగా మారిందని,  తడిఆరి ఎండిపోయి ఎడారిగా మారిందని చెప్పుకోవడానికి ఏ మాత్రం సిగ్గుపడం. మొహమాటపడం‌. కనీసం ఈ వాస్తవం మాకు తెలిస్తే  మా నది ఎందుకు ఇట్లా అయిందో, దానికి కారణలేమో, పరిష్కారలేమో ఆలోచిస్తాం.     తిరిగి మా పెన్నను ఎలా బతికించాలో ఆలోచిస్తాం.  మా పెన్నానదిని జీవనదిగా, జీవనాడిగా మార్చాలన్నదే మా ఆశయం.

నిజానికి ఆ గోదావరి, కృష్ణ నీళ్ళను తాగాలని, మా బీడు భూములు మూడు పంటలు పండించుకోవాలని కూడా మాకు లేదు.   మా బీడు భూముల్లో వానలు కురిసి, మా భూమి పై ప్రవహించే నీళ్ళలో మాకు మునగాలనుంది. మా నీళ్ళు మేము తాగాలని, పంటలు సాగు చేసు కోవాలని ఉంది. ఏదో ఒక రోజు మా ప్రాంతం పకృతి సహజ ఆవాస ప్రాంతాంగా, అన్ని వృక్ష, జీవరాసులు మనుగడ సాగించే జీవవైవిధ్య ప్రాంతంగా మార్చాలని ఉంది.

అన్నీ పోగొట్టుకొన్న మేము చివరకు మా నదినైన కాపాడుకొంటాం. వాస్తవాల్ని గ్రహింప చేసి,  పరిష్కారం వైపు  అడుగులు వేసేలా ఆలోచింప చేసే అవకాశం ఇవ్వండి. పెన్నానది మృతనది, ఇసుక ఎడారి అని ప్రకటించండి. జీ.వోలు విడుదల చేయండి. పాఠ్యపుస్తకాలలో రాయమనండి. అలా కాకుండా పెన్న జీవనాడి , జీవనది అని మమ్మల్ని మభ్యపెట్టి  భ్రమల్లో ముంచకండి.

రాజస్థాన్ ప్రాంతంలో సరస్వతీ నది వేదకాలంలో ప్రవహించేదని విన్నాం. ఈ మధ్య నాసా వాళ్ళు అది నిజమే అని, దాని ఆనవాళ్ళ వివరాలు ప్రకటించారు. ఆ నది భూమి అడుగు పొరల్లో అంతరగంగగా ఇప్పటికీ ప్రవహిస్తోందని కూడా పరిశోధనలలో తేలుతోందని తెలిపారు. అందులో నిజానిజాలు తేలయవు గానీ.. ఈ విషయం మా రాజకీయ పార్టీలకు తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా పెన్నానది కింది భాగంలో ఇసుక పొరల్లో ఉధృతంగా నీళ్ళు ప్రవహిస్తుంటాయని వాటిని వెలికి తీసి రాయలసీమలో మూడుపంటలకు నిండుగా నీళ్ళిస్తామని మాయమాటలు చెప్పినా ఆశ్చర్య పొనక్కరలేదు.

ఈ విషయాన్ని పత్రికలు పతాక శీర్షికలలో రాసినా విచిత్రమనిపించక పోవచ్చు.  ఇప్పటికే శాసన సభ, లోక్ సభ ఎన్నికల కై పార్టీలు మ్యానిపెస్టో లు వచ్చేసాయి. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని పార్టీలు భూగర్భంలోని అంతర పెన్న నీటితో సీమను సస్యశ్యామలం చేస్తామని ప్రకటిస్తారేమో వేచి చూద్దాం.  సీమ ప్రజలారా..‌! రాయలసీమ జీవనాడిగా పేరొందిన నది… పెన్నానది… అనేది ప్రస్తుతం అబద్దమని మనందరకీ తెలుసు. అది నిజం చేద్దాం. మన భావితరాలను, మన జీవరాసులను కాపాడుకొందాం.

మా పెన్నానది…నిజంగా నేడు రాయలసీమ మృతనాడే….
రేపు ఖచ్చితంగా రాయలసీమ సజీవనాడిగా మారుస్తాం….!

(డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డి, వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం. అనంతపురము)

ఇది కూడా చదవండి 

https://trendingtelugunews.com/poet-varavararao-wife-asks-cm-kcr-to-prove-his-honesty-in-his-attack-on-modi/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *