ప్రశ్నించే గొంతుక ఉంటేనే ప్రజాస్వామ్యానికి మనుగడ ఉంటుందన్నారు చేవెళ్ల ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. సోమవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీట్ ది ప్రెస్ లో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆయనేమన్నారో ఆయన మాటల్లోనే చదవండి.
ప్రశ్నించే గొంతుక ఉండాలనే ఉద్దేశంతోనే టిఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో నేను జాయిన్ అయ్యాను. టిఆర్ఎస్ నాయకులు ఐదేండ్ల పాటు చేయని పనులు ఇప్పుడు చేస్తామని మాట్లాడడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. ఎన్నికల సమయంలో మాత్రమే కేసిఆర్ కు చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమస్యలు గుర్తొస్తాయి.
నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే ప్రజల్లో వారిపట్ల నమ్మకం పోతుంది. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో 25 మండలాలు, 945 గ్రామాలు ఉన్నాయి. చేవెళ్లలో ఉన్న సమస్యలన్నీ నాకు తెలుసు. మా తాత నుంచి నా వరకు అందరం చేవెళ్లకు సేవ చేస్తూనే ఉన్నాము.
టిఆర్ఎస్ కు చేవెళ్లలో అభ్యర్థి కరువైనందున కరీంనగర్ నుంచి అరువు తెచ్చుకుని పోటీలో ఉంచాల్సిన దుస్థితికి నెట్టబడ్డారు. చేతిగుర్తుకు ఓటేస్తే చేవెళ్లకు ఓటు వేసినట్లు… కారు గుర్తుకు వేస్తే కరీంనగర్ కు వేసినట్లు జనాలు గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కరీంనగర్ నుంచి వలస వచ్చిన అభ్యర్థికి ఓటేయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమీ లేదు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతోనే ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి 72,000 రూపాయలు వారి ఖాతాల్లో జమ చేస్తాము.
చేవెళ్ల ప్రాంత సమస్యలు తెలియని వారు అభ్యర్థులుగా ఉంటే ఈ ప్రాంతానికి ఏమి సేవ చేస్తారో ఆలోచించి ఓటు వేయాల్సిన బాధ్యత ఓటర్ల మీద ఉంది. చేవెళ్లలో జరిగిన ముఖ్యమంత్రి సమావేశానికి జనాలు కరువయ్యారు. అందుకే మహాబూబ్ నగర్ నుంచి జనాలను తరలించే పరిస్థితి కనబడ్డది. టిఆర్ఎస్ పార్టీలో గెలిచినా ఎంపీలెవరికీ కనీస గౌరవం ఉండదనేది జగమెరిగిన సత్యం.