(యనమల నాగిరెడ్డి)
రైతు కుటుంబం నుండి వచ్చిన దేవెగౌడ రాష్ట్ర రాజకీయాలలో తన కుటుంబాన్ని పెంచి పెద్ద చేయడానికి మాత్రం కృషి చేస్తూ, తన వెన్నంటి ఉన్న రైతుల సంక్షేమానికి ఏమీ చేయలేదని, ఆయన తనయుడు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి రైతులను మోసం చేసాడని ఎన్నికలలో వారికి తగిన విధంగా గుణపాఠం చెపుతామని కర్ణాటక రాజ్యరైతు సంఘం మరియు గ్రీన్ బ్రిగేడ్ రాష్ట్ర అధ్యక్షుడు వి.ఆర్.నారాయణ రెడ్డి (కింది ఫోటో) ప్రకటించారు.
“ట్రెండింగ్ తెలుగు న్యూస్” ప్రతినిధితో ఫోన్ లో మాట్లాడుతూ రైతులెందుకు మాజీ ప్రధాని మీద ఆగ్రహంతో ఉన్నారో చెప్పారు. కుమారస్వామి ఆయన తండ్రి అండతో రైతులను మరింత మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆయన ఆరోపించారు.
ప్రొఫెసర్ నంజుండస్వామి స్థాపించిన కర్ణాటక రాజ్య రైతు సంఘం మరియు గ్రీన్ బ్రిగేడ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 3లక్షల మందికి పైగా సభ్యులున్నారని ఆయన తెలిపారు. ఈ ఎన్నికలలో తమ రైతు సంఘం రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న “జేడీఎస్ -కాంగ్రెస్ కూటమి” ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేయడానికి నిర్ణయించామని, ఆ మేరకు వచ్చే బుధవారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా బిజెపికి అనుకూలంగా ప్రచారం చేయనున్నామని ఆయన ప్రకటించారు.
ప్రత్యేకించి తాము మండ్య,తుముకూరు, చిక్కబళ్ళాపూరు నియోజకవర్గాలలో పోటీ చేస్తున్న నిఖిల్ కుమారస్వామి గౌడ, దేవెగౌడ, వీరప్పమొయిలీ లకు వ్వ్యతిరేకంగా పనిచేయనున్నామని నారాయణ రెడ్డి స్పష్టం చేశారు. హాసన్ నియిజకవర్గం పై సోమవారం నిర్ణయం తీసుకుంటామని సంఘం రాష్ట్ర కార్యదర్శి మంజె గౌడ తెలిపారు.
కుమారస్వామి ఎన్నికలకు ముందు రైతులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించారని నారాయణ రెడ్డి గుర్తు చేశారు. ఆ తర్వాత లక్ష వరకు మాత్రమే రుణ మాఫీ చేస్తామని, నిమిషానికి ఒక రకంగా మాట మారుస్తూ పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కుమారస్వామి వల్ల రైతులకు బ్యాన్కుల నుండి రుణాలు అందడం లేదని, ఇతరత్రా రుణాలు లభించడం లేదని ఆయన ఆరోపించారు.
మదిగిరి, సిర , పావగడ ప్రాంతాలకు తాగు నీళ్లు, సాగు నీళ్లు అందించడంలో వీరు విఫలమయ్యారని అన్నారు. ఈ నాయకులు ప్రస్తుతం ఎన్నికల సీజన్ లో “దుక్కి దున్నుతూ” తాము రైతులమని మోసపు ప్రకటనలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. డీకే శివకుమార్, కుమారస్వామి ఆయన కుటుంభ సభ్యులు “దున్నే ఎద్దులు కాదని, అవి పొలాలలో పడి దొంగతనంగా మేసే ఎద్దులని” ఆయన తీవ్రంగా విమర్శించారు. వీరు రాష్ట్రంలో పడి ప్రజల ఆస్తులను, ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారని నారాయణ రెడ్డి పేర్కొన్నారు.
కుటుంబ పాలనపై ధ్వజం
గౌడ కులస్తుల కులదైవంగా పూజలందుకుంటూ రైతునని చెప్పుకుంటున్న దేవెగౌడ “తన కుటుంబ అభివృద్ధి కోసమే రాజకేయాలు నడిపారని, వారి కోసమే పని చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.దేవెగౌడ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, దేశ ప్రధానిగా పని చేశారని, వివిధ పదవులు, హోదాలు అనుభవించారని, రైతులకు కానీ,రాష్ట్రానికి కానీ, గౌడ కులస్తులకు కానీ చేసింది ఏమీ లేదని అన్నారు.
దేవెగౌడ కుటుంబంలో ప్రస్తుతం ఆయన పెద్ద కుమారుడు రేవణ్ణ గౌడ మంత్రిగా ఉన్నారని, ఆయన భార్య శ్రీమతి భవానీ హాసన్ జిల్లా పంచాయతీ ప్రసిడెంట్ గా ఉన్నారని, రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ గౌడ హాసన్ నుండి ఎం.పి గా పోటీ చేస్తున్నారని గుర్తు చేశారు.
ఇక రెండవ కుమారుడు కుమారస్వామి రాష్ట్ర ముఖ్యమంత్రి కాగా ఆయన భార్య అనిత శాసనసభ్యురాలని, ఆయన కుమారుడు నిఖిల్ గౌడ మండ్య నుండి ఎం. పి గా రంగంలో ఉన్నారని అన్నారు.
కాగా ఆయన అల్లుడు బాలకృష్ణ ఎం.ఎల్.ఏ గా, మరో అల్లుడు డాక్టర్ మంజునాథ జయదేవ హాస్పిటల్ డైరెక్టర్ గా పని చేస్తున్నారని ఆయన తెలిపారు. ప్రస్తుతం దేవెగౌడ తుముకూరు నుండి ఎం. పి గా పోటీ చేస్తున్నారని గుర్తు చేసారు. దేవెగౌడ తన కొడుకులు నలుగురిని, వారి భార్యలను, కుమార్తెలు ఇరువురిని , వారి భర్తలను, వారి పిల్లలను అందరి పోటీ చేయించి రాష్టాన్ని సొంతం చేసుకుంటే బాగుంటుందని, గౌడ కులపెద్ద వెంటనే ఈ పని చేసి దేవెగౌడ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఆయన ఎద్దేవా చేశారు.
ఇకపోతే చక్కటి సూక్తులు చెప్పగల వీరప్పమొయిలీ ఇంతవరకు ప్రజలకు, ప్రత్యేకించి రైతులకు చేసింది సూన్యమని, ఆయన ప్రజల అండదండలతో గద్దె నెక్కి తన ప్రాభవాన్ని పెంచుకుంటున్నారని నారాయణ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికలలో రైతు సంఘం తరపున వీరికి తగిన గుణ పాఠం చెపుతామని నారాయణ రెడ్డి హెచ్చరించారు.
దేవెగౌడ పై రైతు సంఘం కార్యదర్శి ఆగ్రహం!
కర్ణాటక రాజ్య రైతు సంఘం మరియు గ్రీన్ బ్రిగేడ్ రాష్ట్ర శాఖ ప్రధాన కార్యదర్శి మంజే గౌడ దేవెగౌడపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవెగౌడను ఇంతకాలం అక్కున చేర్చుకున్న హాసన జిల్లాను వదలి ఆయన తుముకూరు నుండి పోటీ చేయడం, అదీ కూడా ఈ వయసులో అవసరమా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి పదవి నుండి, ప్రధాని పదవి వరకు ఆయనకు హాసన్ జిల్లా కట్టపెట్టిందని, అనుభవం లేని ఆయన మనుమడిని ఇక్కడ పోటీకి నిలపడం నమ్మిన ప్రజలను మోసం చేయడమేనని మంజే గౌడ అన్నారు. సోమవారం జరిగే విస్తృత స్థాయి జిల్లా రైతు సమాఖ్య సమావేశంలో తాము ఈ వైఖరి అనుసరించాలో నిర్ణయిస్తామని మంజేగౌడ తెలిపారు.
ఏది ఏమైనా దేవెగౌడ, ఆయన కుటుంభ సభ్యులు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల రైతుల ఆగ్రహ జ్వాలలు తగ్గించి వారిని తమకు అనుకూలంగా మార్చుకుంటారా? లేక ఈటికి ఎదురీదుతారా? అన్న అంశం మరో రెండు రోజులలో స్పష్టం కాగలదు