పులివెందుల ఎన్నిక ఈ సారి సెన్సేషనల్ అవుతుంది, ఎందుకంటే…

(యనమల నాగిరెడ్డి)

సాధారణంగా కడప జిల్లాలో  వై. ఎస్. కుటుంబానికి పెట్టని కోటలా ఉన్న పులివెందుల అసెంబ్లీ  నియోజకవర్గం ఎన్నిక గురించి కొత్తగా చెప్పుకునేందుకు ఏమీ వుండదు.

అయితే, అక్కడొక ఎన్నికంటూ జరుగుతుంది కాబట్టి మాట్లాడు కోవాలి. ఎలాగైనా సరే పులివెందులలో పసుపుపచ్చ జెండా ఎగరేయాలని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఈ సారి రెట్టించిన ఉత్సాహం చూపిస్తూ ఉండటంతో పులివెందుల గురించి చెప్పుకోక తప్పదు.

వైఎస్ ఆర్ లో కంటే పెద్ద ప్రత్యర్థిని చంద్రబాబు  వైఎస్ వారుసుడయిన జగన్ లో చూస్తున్నారు.  అందుకే వైఎస్ రాజకీయాలలో ఉన్నపుడు చేయనంత పెద్ద ప్రయత్నం ఆయన వారసుడు జగన్ మీద చేస్తున్నాడు. అయితే అందుకే పులివెందుల మళ్లీ  పతాక శీర్షిక కాబోతున్నది. ఇక ముందు ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు నాయకత్వం ఉంటుందో లేదో తెలియదు కాని, ఈ ఎన్నికతో పులివెందులను కైవసం చేసుకోవడం ‘చంద్రబాబు తరం’ కాలేదని  చెప్పాల్సి వస్తుందేమో. అందుకే ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది.

ఈ సారి కూడా వైస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి మీద  టీడీపీ అభ్యర్థిగా శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్ రెడ్డిని  పోటీ పెట్టారు.

ప్రస్తుత ఎన్నికలలో 12 మంది పోటీలో ఉన్నా పోటీ మాత్రం ప్రధానంగా పోటీ వీరి మధ్యనే ఉంటుంది.   సతీష్ కుమార్ రెడ్డికి ఓటమి కొత్త కాదు. ఆయన ఈ  విషయంలో హ్యాట్రిక్ కొట్టారు. ఇప్పటికే టీడీపీ తరఫున 3 సార్లు రాజశేఖర్ రెడ్డి తో పోటీ చేసి ఓడిపోయారు. ఇపుడు ఆయన కొడుకుతో కయ్యానికి కాలుదువ్వారు.

అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఆయనకు ఏటికి ఎదరీదడంలాగా కనిపిస్తుంది.

ఈ నియోజక వర్గం 1978లో రాజశేఖర్ రెడ్డి రెడ్డి కాంగ్రెస్ తరపున మొట్ట మొదటి సారి ఎం.ఎల్.ఏ గా ఎన్నికయ్యారు. అప్పటి నుండి 1983, 1985, 1989 ఎన్నికలు మొదలుకొని మొత్తం 8 సార్లు రాజశేఖర్ రెడ్డి ఈ నియోజకవర్గం నుండి గెలుపొందారు. మిగిలిన ఎన్నికలలో వివేకానంద రెడ్డి, పురుషోత్తం రెడ్డి గెలుపొందగా, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఒకసారి జగన్ తల్లి విజయమ్మ, మరోసారి జగన్  స్వయంగా గెలుపొందారు. ఒక్క మాటలో చెప్పాలంటే 1978 నుండి నేటి వరకు పులివెందుల రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి శత్రుదుర్బేధ్యంగా ఉంది.

1985 నుండి టీడీపీ ఎన్ని సార్లు ప్రయత్నించినా ఈ కోటను బద్దలు కొట్టలేకపోగా ప్రతి సారి పోటీ దారుల మెజారిటీ కూడా తగ్గించలేక పోవడం విశేషం. 2004, 2009 ఎన్నికలలో రాజశేఖర్ రెడ్డి వరుసగా 41వేలు, 68 వేల మెజారిటీతో గెలుపొందగా , ఒకసారి విజయమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత 2011లో వైస్సార్ కాంగ్రెస్ తరపున పోటీ చేసిన  విజయమ్మ 81వేల పై చిలుకు మెజారిటీ సాధించగా, 2014 ఎన్నికలలో జగన్ మోహన్ రెడ్డి 75 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

జగన్ తరపున భారతి ప్రచారం…

రాష్ట్ర వ్యాప్తంగా జగన్ మోహన్ రెడ్డి తన పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం సుడిగాలి పర్యటనలు చేస్తుండగా పులివెందులలో ఆయన భార్య వై. ఎస్. భారతి ఎన్నికల ప్రచార భాద్యతలు చేపట్టారు.  2011 ఎన్నికలలో విజయమ్మ కోసం, 2014లో జగన్ గెలుపు కోసం ప్రచారం చేసిన జగన్ భారతి ఈ ఎన్నికలలో కూడా జగన్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఆమెతో పాటు ఎం.పి అభ్యర్థి అవినాష్,  వై.ఎస్. కుటుంబీకులు, వారి ముఖ్య అనుచరులు జగన్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అది గెలుపు కోసం కాదు, ఆయన మెజారిటీ  రికార్డు స్థాయికి పెంచడానికే నని  పులివెందులలో ఒక సారి పర్యటిస్తే తెలిసిపోతుంది. ఇంటింటి ప్రచారంలో భారతికి ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారు. హారతులిచ్చి ఆశీర్వదిస్తున్నారు.

పులివెందులలో మహిళా ఓటర్లే ఎక్కువ

పులివెందుల నియోజకవర్గంలో మహిళా ఓటర్లే అధిక సంఖ్యలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 2,23,411 ఓట్లు ఉండగా అందులో 1,13,805 మంది  మహిళా ఓటర్లున్నారు. ఈ నియోజకవర్గంలో సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల, వేంపల్లి, చక్రాయపేట మండలాలున్నాయి.

జగన్ బలాలు

కాబోయే ముఖ్యమంత్రి జగనే అనే నమ్మకం ప్రజలలో బలంగా నాటుకుపోయింది. కుటుంబ సభ్యుల అండదండలు, ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి పై ఉన్న విపరీతమయిన అభిమానం, జగన్ పై చంద్రబాబు చేస్తున్న వేధింపుల వల్ల ప్రజలలో పెరిగిన సానుభూతి జగన్ బలాలుగా ఉన్నాయి.

బలహీనతలు

ఆయన తండ్రి రాజశేఖర్ రెడ్డి లాగా జగన్ అందరికీ అందుబాటులో ఉండడనే అపప్రధ ఉంది. Z ప్లస్ సెక్యూరిటీ ఉన్న వారిని కూడా సులభంగా కలుసు కోవచ్చునని, కానీ “జగన్ కోటరీని దాటి ఆయనను కలుసుకోవడం కష్ట సాధ్యమని” సాధారణ ప్రజలు అంటున్నారు. ఆయన గెలిస్తే పరిస్థితి మారుతుందని వారు ఆశిస్తున్నారు.

టీడీపీ తరపున సతీష్ కుమార్ రెడ్డి పోటీ

ఇకపోతే టీడీపీ తరపున శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి నాలుగో సారి వై. ఎస్. కుటుంబీకులతో పోటీ పడుతున్నారు. ఆయన ఇప్పటి వరకు పోటీ చేసిన ప్రతిసారి భారీ తేడాతో ఓడిపోయారు. ఈ సారి కూడా ఆయన అదృష్టం అంతంత మాత్రమే అంటున్నారు జనం. అయితే,జనం నోళలో నానుతున్న మాటెలా ఉన్నా సతీష్ రెడ్దిలో కూడా కొంత ధైర్యం కనిపిస్తుంది. కృష్ణ నీళ్లు.

కృష్ణ నీళ్లు పులివెందులకు తెచ్చే వరకు “గడ్డం తీయనని భీష్మ ప్రతిజ్ఞ” చేసిన సతీష్ రెడ్డి  ఆ నీళ్లను పులివెందులలో పారించి ముఖ్యమంత్రి సమక్షంలో గడ్డం తీసి తన పంతం నెగ్గించుకున్నారు.ఈ ఎన్నికలలో కృష్ట్ణ నీళ్లు తనను గట్టెక్కించగలవని ఆయన గట్టి నమ్మకంతో ఉన్నారు.రాజశేఖర్ రెడ్డి బతికుండగా తేలేని నీళ్లను తాను తెచ్చినట్లు చంద్రబాబు పులివెందులకొచ్చి చెప్పారు. ఈ ప్రాంతంలో దానిని  ఆయన ప్రచారాస్త్రంగా మార్చుకున్నారు.సతీష్ రెడ్డి ఈ ప్రచారాన్ని నమ్ముతున్నారు. జనం కూడా నమ్ముతారనేది ఆయన ధీమా.

అలాగే ఇటీవల దారుణ హత్యకు గురైన వివేకానంద రెడ్డి మరణం వల్ల చెలరేగిన వివాదాస్పద అంశాలు కూడా తనకు మేలు చేస్తాయని సతీష్ ఆశిస్తున్నారు. ఎం.ఎల్.సిగా వివేకా పై గెలుపొందిన  బి. టెక్ రవి, టీడీపీ పాతకాపులు, తన బందు బలగం అండతో, చంద్రబాబు ఎత్తులతో ఎన్నికలలో గెలవ గలనని ఆయన నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పధకాలు, ఆయన అండదండలే తనకు రక్ష అని, వీటి ఆసరాతో వై.ఎస్. కోటను ఈసారి బద్దలు కొట్టగలననే ధీమాతో సతీష్ పోరాడుతున్నారు.

అయితే ఆశించిన స్థాయిలో ప్రజాబలం లేకపోవడం, కాబోయే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే నని ప్రజలు బలంగా భావిస్తుండటం ఆయనకు ప్రధాన అవరోధంగా ఉన్నాయి.

అయితే  కడప జిల్లాలో  వై. ఎస్. కుటుంబానికి పెట్టని కోటలా ఉన్న పులివెందుల శాసనసభా నియోజకవర్గం మరోసారి వై. ఎస్.  వారసుడు, వైస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డికి పట్టం కట్టనున్నదనే చెప్పవచ్చు. ప్రధాన పోటీ దారుగా ఉన్న టీడీపీ ఎత్తులు ఇక్కడ పారవని ప్రజలు అంటున్నారు. చిత్రావతికి  కృష్ట నీళ్లిచ్చామని, దారుణంగా హత్య చేయబడిన వివేకానంద రెడ్డి హత్య కేసులో కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని టీడీపీ వర్గాలు మిన్ను మన్ను ఏకం చేసేంత ప్రచారం చేసినా పులివెందుల జనం పట్టించుకోవడం లేదు. ముఖ్యమంత్రి గా రాజశేఖర్ రెడ్డి ఉన్న కాలంలో స్వర్ణ యుగం అనుభవించామని, ప్రస్తుతం  ఆయన వారసుడు జగన్ మోహన్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి కానున్నాడని, తమకు మరోసారి స్వర్ణయుగం అందుబాటులోకి వచ్చే సమయంలో తాము మరొకరిని ఎలా గెలిపిస్తామని పులివెందుల జనం ప్రశ్నిస్తున్నారు. జగన్ గెలుపే ఖాయమని, మెజారిటీ విషమే తేలవలసి ఉందని వారు ఘంటా పదంగా చెపుతున్నారు. ఏతా వాతా తేలేదేమంటే పులివెందులలో జగన్ గెలవడం  మరోసారి టీడీపీ ఇక్కడ చతికిలపడటం ఖాయమని .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *