అధికార టిఆర్ఎస్ పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. ఓ వైపు ఆపరేషన్ ఆకర్ష్ తో ప్రతిపక్షాలను కుదేలు చేస్తున్న టిఆర్ఎస్ కు ఇది మింగుడుపడని విషయమే. మాజీ ఎంపీ జి. వివేక్ ప్రభుత్వ సలహాదారుని పదవికి రాజీనామా చేశారు. పార్లమెంటు ఎన్నికల్లో తనకు పెద్దపల్లి ఎంపీ సీటును కేసీఆర్ ఇస్తానని హామీనిచ్చారని కానీ ఇప్పుడు అది తప్పారన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సలహాదారు పదవిలో కొనసాగలేనని, అందుకే రాజీనామా చేస్తున్నట్టు వివేక్ వెల్లడించారు. పెద్దపల్లి లోక్ సభ స్థానాన్ని సీఎం కేసీఆర్ బోరకుంట్ల వెంకటేష్ కు కేటాయించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వివేక్ అసంతృప్తితో ఉన్నారు. శుక్రవారం రాజీనామా ప్రకటన చేసిన ఆయన తన రాజీనామా ఆమోదించాలంటూ కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వ సలహాదారు పదవి వల్ల తనకు ఒరిగిందేమీలేదని, తన తండ్రి వెంకటస్వామి లాగా తాను కూడా ప్రజాసేవ చేశానని అన్నారు. ప్రభుత్వ సలహాదారుని పదవి వల్ల తాను ఆర్ధిక పరంగా ఎటువంటి లాభాపేక్ష పొందలేదని స్పష్టం చేశారు.
వివేక్ తో బిజెపి నేతలు టచ్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అతనికి ఎంపీ సీటును కేటాయించే అవకాశం ఉన్నట్టుగా చర్చ జరుగుతోంద. ఇప్పటికే బిజెపి కీలక నేతలు వివేక్ తో చర్చించారని కీలక నేతల ద్వారా తెలుస్తోంది. వివేక్ పదవికి రాజీనామా చేయడంతో చర్చనీయాంశమైంది. మరో వైపు కాంగ్రెస్ నేతలు కూడా వివేక్ తో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. మరి వివేక్ టిఆర్ఎస్ ను వీడుతారా లేక అందులోనే కొనసాగుతారా అనే దాని పై స్పస్టత లేదు.