రాయలసీమలో మళ్లీ ప్రాంతీయ కదలిక.. కడప తీర్మానం

రాయలసీమ లో మళ్లీ ప్రాంతీయ కదలిక మొదలయింది. ఈ సారి ఆరుజిల్లాల సమస్యల మీద ఆందోళనకుఉప క్రమించాలని ఆదివారం నాడు కడపలో సమావేశమయిన రాయలసీమ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక నిర్ణయించింది. కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు లతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలను కూడా కలుపుకుని సమస్యలను కూలంకషంగా అధ్యయనం చేసి ప్రాంతీయ కార్యాచరణ మొదలుపెట్టాలని మాజీ మంత్రి ఎం వి మైసూరా రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం నిర్ణయించింది. కడప లోని హరిత హోటల్ లో జరిగిన ఈ సమావేశానికి ఆరు జిల్లాలనుంచి సుమారు 350 మంది వివిధ సంఘాల ఉద్యమాల ప్రతినిధులుహాజరయ్యారు.

ఈఆరు జిల్లాలలో ప్రభుత్వాలుపట్టించకోకుండా ఉన్న సమస్యలేమిటో అధ్యయనం చేసేందుకు ఒక కమిటీ వేయాలని, ఆ కమిటీకి ఆంధ ప్రదేశ మాజీ ప్రధాన కార్యదర్శి అజేయ్ కల్లాం కన్వీనర్ గా ఉండాలని తీర్మానించారు. ఈ బాధ్యతలను చేపట్టేందుకు కల్లాం అంగీకరించారు. ఈ విధంగా ఈ ఆరు జిల్లాల ప్రజలను సమీకరించి ఒక కార్యచరణ పథకం రూపొందించేందుకు ఒక ప్రాంతీయ మహాసభను ఏర్పాటు చేయాలని కూడా ఈ సమావేశం నిర్ణయించింది. మహాసభ తేదీ,స్థలం ను రాయలసీమ ఉద్యమ సంఘాల సమన్వయ వేదిక కన్వీనర్ బొజ్జా దశరథ రామిరెడ్డి నాయకత్వంలోని ఒక కమిటీ నిర్ణయిస్తుంది.

ఇక ముందు మైసూరా రెడ్డి తన పార్టీ కార్యకలాపాలకు స్వస్తిపలికి రాయలసీమకోసం కృషిచేస్తానని ప్రకటించడం ఆదివారం సమావేశంలోని ముఖ్యాంశం. నిజానికి ఈ సమావేశం కూడా ఆయన చొరవతోనే జరిగింది. అయితే, ఇప్పటికే రాయలసీమలో ఇపుడు అక్కడ అక్కడ చెల్లా చెల్లా చెదురుగా జరుగుతున్న ఉద్యమాలను సమన్వయ పరిచి ఒక బలమమయిన ప్రాంతీయ ఉద్యమం తీసుకురావాలనే ఆకాంక్ష సర్వత్రా ఉండటంతో సమయం తక్కువయినా మైసూరా రెడ్డి పిలుపునకు స్పందన బాగా లభించింది.

మాజీ డిజిపి ఆంజనేయరెడ్డి, రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథరామిరెడ్డి, కందుల గౌతమ్ కుమార్ రెడ్డి, జనవిజ్ఞాన వేదిక లక్ష్మారెడ్డిలతో పాటు పలు రైతు సంఘాలనాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, ఉద్యమాలలో వ్యక్తులు గాపాల్గొంటున్న వారు సమావేశానికి హాజరయ్యారు.

సమావేశం రాయలసీమ సమస్యలను క్షుణ్ణంగా సమీక్షించింది. ఒకపుడు గతంలో విలీనం (ఆంధ్ర తెలంగాణ) ఏవిధంగా నయితే, రాయలసీమ అసలు సమస్యలను పరిష్కరించలేకపోయిందో, ఇప్పటి విభజన (ఆంధ్ర, తెలంగాణ) కూడా పరిష్కరించలేకపోయిందని సమావేశానికిహాజరయిన వారు అభిప్రాయపడ్డారు. అంతేకాదు, ఆంధ్రప్రదనశ్ విభజన -2014 రాయలసీమ కు మరింత అన్యాయం చేసిందని సమావేశానికి వచ్చిన వారు పేర్కొన్నారు.

ఇంతజరిగినా రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ రాయలసీమ పట్ల ఎలాంటి శ్రద్ధ చూపకపోవడం పట్ల సమావేశం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రాంత సమస్యలను పరిష్కారిస్తామన్న అంశాన్ని తమ తమ పార్టీల ఎన్నికల మ్యానిఫెస్టోలల పొందుపరిచేందుకు కూడాఈ పార్టీలు సముఖంగా లేకపోవడం పట్ల సమావేశం విస్మయం వ్యక్తం చేసింది. రాయలసీమ సాగు నీటి సమస్యలను, ఉద్యోగావకాశాలను ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపర్చండని ఈ ప్రాంత నాయకులు అన్ని పార్టీలకు లేఖలు రాశారు, సమావేశాలు నిర్వహించారు. ఎవరినుంచి తగినంత స్పందన రాలేని సమావేశం లో ప్రసగించిన నాయకులు చెప్పారు. రాయలసీమ సమస్యలను అన్ని రాజకీయ పార్టీలు తమతమ ఎన్నికల మ్యానిఫెస్టోలలో పొందుపర్చాలని మరొక సారి కోరుతూ సమావేశం ఒక తీర్మానం చేసింది.

ఎన్నికల తర్వాత ఎవరూ అధికారంలోకి వచ్చినా రాలయసీమ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం వత్తిడి పెంచాలని,దీని కోసం పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని కూడా సమావేశం తీర్మానించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *