ఇక చాలు ఈ రాజకీయాలు: మైసూరా

సీమ డిమాండ్ల సాధనకే పూర్తిగా అంకితం

కడప: ప్రత్యక్ష రాజకీయాల నుంచి శాశ్వతంగా వైదొలగుతున్నాననీ, ఇకపై పూర్తిగా రాయలసీమ డిమాండ్ల సాధన కోసమే జీవితాన్ని అంకితం చేస్తానని రాయలసీమ ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి డాక్టర్ ఎం వి మైసూరా రెడ్డి ప్రకటించారు.
రాయలసీమ ప్రజాసంఘాలు, రైతు సంఘాలూ, రచయితలు, మేధావులు, విద్యార్థి సంఘాల సంయుక్త సమావేశంలో ఆదివారం ఆయన ప్రసంగించారు.

సీమ సమస్యలపై చర్చించడానికో, లేక డిమాండ్ల సాధనకై కార్యాచరణ కోసమో నేను సమావేశం ఏర్పాటు చేసిన ప్రతిసారీ నాకు ఏవేవో ఉద్దేశ్యాలు అంటగడుతున్నారు. నా చిత్తశుద్ధిని శంకిస్తూ, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నట్టు చెవులు కొరుక్కుంటున్నారు. అందుకే ఇకపై ప్రత్యక్ష రాజకీయాల జోలికి పోదల్చుకోలేదని మైసూరా స్పష్టం చేశారు.

ఇన్నేళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితంలో తాను ఏనాడు పదవులకై ఆశించి పని చేయలేదని స్పష్టం చేశారు. పదవిలో ఉన్నా లేకపోయినా, నిరంతరం తన ధ్యాసా, ఆశా తరతరాలుగా అన్యాయానికి గురై నిరంతర కరవులతో అలమటిస్తున్న రాయలసీమకు ఎంతో కొంత మంచి చేయాలన్నదేనని ఆయన అన్నారు.

దాదాపు మూడు దశాబ్దాల తన రాజకీయజీవితం ఇప్పటి దాకా కేవలం రాయలసీమ ప్రయోజనాలతో మాత్రమే ముడి పడి ఉందనీ, ఇంకేవో ప్రయోజనాల కోసం వెంపర్లాడటం తన స్వభావానికే విరుద్ధమనీ పేర్కొన్నారు. అధికార పక్షంలో ఉన్నా ప్రతి పక్షంలో ఉన్నా ఈ కరవు సీమకు నీటి ప్రాజెక్టుల కోసం, రోడ్డు, రైలు మార్గాల అభివృద్ధి కోసం, పరిశ్రమల కోసం పోరాడానని అన్నారు. అభివృద్ధి నిధుల కేటాయింపుల్లో సీమకు జరిగిన అన్యాయం గురించి చట్టసభల్లోనూ, బయటా గొంతెత్తి ప్రతిఘటించాం. పాదయాత్రలు మొదలుకొని, ధర్నాలు, సత్యాగ్రహాలు చేశామనీ, కోకొల్లలుగా వినతి పత్రాలు సమర్పించామని ఆయన గుర్తు చేసుకున్నారు.

రాయలసీమ నీటి హక్కుల కోసం జరిపిన పోరాటాల్లో అందరినీ కలుపుకొని ముందుకు సాగడానికే ప్రాధాన్యం ఇచ్చేవాడినని అన్నారు. తన కంటే పెద్దవారిని గౌరవించి వారి సలహాలూ మార్గదర్శకత్వం స్వీకరించాననీ, చిన్నవారితో కలిసిపోయి వారి సహకారం తీసుకున్నానని అన్నారు. సీమ డిమాండ్ల కోసం జరిపిన పోరాటాల్లో లాఠీ దెబ్బలు తిన్నామనీ, జైలు పాలయ్యామనీ, పోలీసుల దాష్టీకాన్ని రకరకాలుగా చవి చూశామని అన్నారు. అందరి సహకారంతో జరిపిన ఉద్యమాల వల్లే హంద్రీ-నీవా, తెలుగు గంగ వంటి ప్రాజెక్టులు కార్యరూపం దాల్చాయనీ, నేటికి 70 నుంచి 90 శాతం మేరకు పూర్తయ్యాయని అన్నారు.

గోదావరి జలాలను రాయలసీమకు తరలించడం కోసం మొన్నటికి మొన్న మంత్రులు, ఇతర ప్రభుత్వాధినేతలు, ప్రతిపక్షనాయకులకు లేఖలు రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు. గోదావరి జలాలను ఎత్తిపోతల ద్వారా పోలవరం ప్రాజెక్టు దిగువన కృష్ణా డెల్టా కు తరలించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. చింతలపూడి స్టేజ్-2 నుంచి 30 టిఎంసిలు నాగార్జునసాగర్ ఎడమ కాలువకు, సంగమం ఎత్తిపోతల ద్వారా 70 టిఎంసిలు నాగార్జునసాగర్ కుడి కాలువకు తరలించడానికి పథకాలను సిద్ధం చేస్తున్నారు. అందువల్ల మిగులుతున్న 100 టిఎంసిల నీటిని రాయలసీమకు కేటాయిస్తూ జీవో విడుదల చేయ వలసిందిగా ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రభుత్వం జివో జారీ చేస్తే సీమ ప్రజలకు ఈ జలాలపై హక్కు ఏర్పడగలదన్నారు.

పట్టిసీమ ఎత్తిపోతల పేరుతో, పోలవరం ద్వారా కృష్ణా డెల్టా కు తరలించే నీటిని, సీమకు కృష్టా జలాలు ఇస్తున్నామని ప్రకటించి, ఈ ఎన్నికల వేళ అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా సీమకు తరలిస్తున్నవి అనధికారిక జలాలని వివరించారు, వీటికి చట్టబద్ధమైన కేటాయింపులు లేవనీ, జివోల దన్ను లేదని అన్నారు.

నిరంతరం కటిక దారిద్ర్యంలో మగ్గిపోతున్న రాయలసీమ జిల్లాలు తరతరాలుగా వివక్షకు గురవుతూనే ఉన్నాయి. శ్రీ బాగ్ ఒడంబడిక నుంచి మొన్న రాష్ట్ర విభజన నాటి దాకా పాలకుల వివక్ష, సీమ సమస్యల పట్ల నిర్లక్ష్య ధోరణి నిరంతరంగా కొనసాగుతూనే ఉందన్నారు. గొంతు చించుకొని అరిచి వీధుల్లోకి వచ్చి పోరాడితేనే తప్ప ఏ చిన్న సౌలభ్యాన్ని కూడా పాలక పక్షాలు తాముగా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. మేం చేస్తున్న డిమాండ్లన్నీ రాయలసీమకు న్యాయంగా చెందవలసిన హక్కులేనన్న స్పృహ ఏ నాయకుడిలోనూ ఏ కోశానా కనిపించడం లేదనీ, ఈ పరిస్థితుల్లో ప్రత్యక్ష రాజకీయాలకు పూర్తిగా స్వస్తి చెప్పి సీమ డిమాండ్ల సాధన కోసం జీవితాన్ని పూర్తిగా అంకితం చేయాలని నిర్ణయించుకున్నానని మైసూరా ప్రకటించారు.

వివేకా మృతికి సంతాపం రాయలసీమ ప్రజా సంఘాల సమావేశంలో అంత క్రితం, గత శుక్రవారం హత్యకు గురైన మాజీమంత్రి, వైఎస్ఆర్ సిపి నాయకుడు వైఎస్ వివేకానందరెడ్డి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ, ఆయన ఆత్మశాంతికై రెండు నిముషాలు మౌనం పాటించారు.

ఇది కూడా చదవండి

https://trendingtelugunews.com/rayalaseem-leaders-meet-in-kadapa-plans-to-build-wider-regional-movement/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *