మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఈ నెల 15 తెల్లవారుఝామున ఆయన హత్యగావింపబడ్డారు. మొదట ఇది సహజ మరణంగానే బయటకు వచ్చింది. కానీ తలపైన, శరీరంపైనా పలుచోట్ల బలమైన గాయాలు ఉండటంతో ఆయన పిఎ అనుమానాలు ఉన్నాయంటూ పోలీసు కేసు నమోదు చేశారు.
పోలీసులు కూడా వంటిపై ఉన్న గాయాలు చూసి హత్యగా ప్రాధమిక నిర్ధారణకు వచ్చి కేసు విచారణ చేపట్టారు. పోస్టుమార్టం రిపోర్టు కూడా ఇది హత్యే అని నిర్ధారించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే వివేకాకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల్ని, పనిమనుషుల్ని, ఇతర కుటుంబసభ్యుల్ని దర్యాఫ్తులోభాగంగా విచారించింది సిట్ బృందం.
కాగా వివేకా హత్య కేసులో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. వివేకాకు అత్యంత సన్నిహితుడు పరమేశ్వరరెడ్డిపై అనుమానాలు వెల్లువెత్తాయి. దీనికి కారణం హత్య జరిగిన రోజు నుండి పరమేశ్వరరెడ్డి కనిపించకపోవడమే. నిందితుడి కోసం పోలీసు బలగాలు గాలింపు చర్యలు చేపట్టారు. అజ్ఞాతంలో ఉన్న పరమేశ్వరరెడ్డి హై బీపీతో కడప ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్లు సమాచారం.
ఈయన ఈమధ్యే వైసీపీ నుండి వేరే పార్టీలోకి మారేందుకు డీల్ కుదుర్చుకున్నట్టు తెలుస్తోంది. వివేకా హత్యకు పరమేశ్వరరెడ్డికి భారీగా ఆఫర్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. పరమేశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకుంటేగాని అసలు నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉందని పోలీసు వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.