డేటా లీక్ గురించి టిఆర్ఎస్, వైసిపీలకు 5 సూటి ప్రశ్నలేసిన నల్లమోతు శ్రీధర్

ఏపీ తెలంగాణ మధ్య నడుస్తున్న డేటా వార్ గురించి టెకీ గురూ నల్లమోతు శ్రీధర్ టిఆర్ఎస్, వైసిపి లకు పలు ప్రశ్నలు సంధించాడు. ప్రస్తుతం ఇవి హాట్ టాపికయ్యాయి.

22 సంవత్సరాలపాటు గా టెక్నాలజీ రంగంలో ఉన్న వ్యక్తిగా, టెక్నాలజీ పరంగా అనేక అంశాల పట్ల లోతుగా విశ్లేషిస్తున్న వ్యక్తిగా తాజాగా రాజకీయ పార్టీల డేటా లీక్ వ్యవహారం గురించి నిశితంగా స్టడీ చేసిన తర్వాత.. అన్ని రాజకీయ పార్టీలకు కొన్ని ప్రశ్నలు వేస్తున్నాను. వాటికి నాకు సమాధానం కావాలి.

  1. మొట్టమొదటి ఆరోపణ.. ప్రజల యొక్క డేటా ప్రైవసీ గురించి! TDP ప్రభుత్వం వివిధ పథకాల లబ్ధిదారుల సమాచారం సేవా మిత్ర యాప్‌కి బదలాయించి.. ప్రభుత్వ సమాచారాన్ని పార్టీ కోసం వాడింది అన్నది చాలా మంది మొదటి నుండి చెబుతున్న మాట.

నా ప్రశ్న: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లబ్ధిదారుల సమాచారం ఒక 50 లక్షల మందిది ఉంది అనుకుందాం. ఆ 50 లక్షల మంది సమాచారం YCP, TRS వంటి పార్టీల వద్ద 1, 2, 3, 4 వంటి సీరియల్ నెంబర్ల వారిగా ఇప్పుడు రెడీగా ఉందా? వాళ్లు దాన్ని సేకరించి పెట్టుకున్నారా? అలాగే సేవా మిత్ర యాప్‌లో అదే 50 లక్షల మంది సమాచారం పొల్లు పోకుండా యధాతధంగా ఉందా? ఈ రెండు డేటా సెట్లనూ ఒకదానితో మరొకటి కంపేర్ చేసుకున్నారా? ఇలా పూర్తి స్థాయిలో సమాచారం కంపేర్ చేసుకోకుండా ప్రభుత్వం లబ్దిదారుల డేటాని ప్రైవేట్ సంస్థకి అప్పగించిందని ఎలా ఆరోపిస్తారు?

అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా TRS Mission Call Campaign అనే యాప్‌కి ప్రభుత్వం వద్ద ఉన్న లబ్ధిదారుల డేటా తన పార్టీ యాప్ కోసం ఇచ్చింది. దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ లు, ఆధారాలు నిన్ను నేను నా టైమ్‌లైన్‌లో పోస్ట్ చేశాను. TDP ఆ పనిచేసిందో లేదో నిర్థారణ కాలేదు. కేవలం ఆరోపణ మాత్రమే ఉంది. కానీ TRS అదే పని దర్జాగా చేసినట్లు వారి అధికారిక యాప్ స్క్రీన్ షాట్‌లో పేర్కొనబడి ఉంది. మరి ఎవరు తప్పు చేసినట్లు? TRS వర్కింగ్ ప్రెసిడెంట్‌గా KTR ప్రెస్ మీట్లు పెట్టి, లబ్ధిదారుల డేటాని పార్టీకి ఉపయోగించి, మళ్లీ TDPపై విమర్శలు చేయడం ఎలా సబబు?

ఇక్కడ నా ఆవేదన ఒకటే.. TDP తప్పు చేసిందో లేదో తెలీదు. సరైన డేటా సెట్లు పోల్చకుండా కేవలం ఆరోపణల మీద వివాదం చేస్తున్నాం. TRS దర్జాగా ఆ పనిచేసి తన ప్రత్యర్థి పార్టీని విమర్శిస్తోంది. అందరూ కలిసి, ప్రజల డేటాతో రాజకీయ లబ్ధి పొందుతూ, వాళ్లకి కాల్స్ చేసి వారు తమ పార్టీకి ఓటు వేసేలా ప్రభావితం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

2. TDP ప్రభుత్వం YCP సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తోంది అన్న ఆరోపణ చేస్తున్నారు.

నా ప్రశ్న: TDP వారు YCP వారి ఓట్లు తొలగిస్తున్నారు అనడానికి బలమైన ఆధారాలు మీ దగ్గర ఏమున్నాయి? ఇది కేవలం ఆరోపణ మాత్రమేనా? YCP వారు TDP ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసి వారి వివరాలు సేకరించి.. ఆ లబ్దిదారులు ఎటూ TDPకి ఓటు వేస్తారు, సో వారి ఓట్లు ఉండకూడదు అన్న ఆలోచనతో Form 7 ద్వారా వారి ఓట్లు తొలగించిన ఉదంతాలు నా నోటీస్‌‌‌కి వచ్చాయి. మరి ఎవరిది తప్పు, ఎవరికి కరెక్ట్? రెండు పార్టీలు ఎవరికి వ్యతిరేకంగా ఉన్నవారి ఓట్లు వారివి తొలగించుకుంటూ పోతుంటే చివరకు మిగిలే ఓట్లు ఎన్ని? అసలు ఓట్లు తొలగించబడుతున్నాయి అన్న దానికి మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా? ఓట్లని తొలగించడానికి AP ప్రభుత్వం ఆధార్ నెంబర్లు వాడుకుంటోంది అంటున్నారు. ఆధార్ నెంబర్లు వాడుకుంటోంది అన్న ఆరోపణకి మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? చూపించండి.

కొంత మంది ప్రజల ఓటు హక్కుపోయింది. కానీ ఆ కొంతమందిలో YCP వాళ్లే కాదు, TDP వాళ్లూ ఉన్నారు. దానిపై ఎందుకు ఫోకస్ చేయరు? TDPకి ఓటు వేసే ఓటరు ఓటరు కాడా? అతను ప్రజాస్వామ్యంలో భాగం కాదా? జగన్ 7 లక్షల దొంగ ఓట్లని తొలగించడానికి మేము form 7 పెట్టాం అని స్వయంగా అన్నారు. ఏది దొంగ ఓటు, ఏది నిజమైన ఓటు అని అన్నది మీకెలా తెలుసు? అంత లోతుగా సమాజంలో సర్వే చేయించారా? ఏ రాజకీయ ప్రయోజనం కోసం ఓట్లని ఏరివేసే పనిలో ఉన్నారు? దొంగ ఓట్లని తొలగించే పని ఎలక్షన్ కమిషన్‌ని గానీ, రాజకీయ పార్టీలది ఎలా అవుతుంది? మరి మీరు ఆరోపిస్తున్నట్లు.. TDP కూడా form 7ని నింపిందే అనుకుందాం.. వాళ్లూ మీలాగే కేవలం దొంగ ఓట్లని ఏరివేద్దాం అన్న ఆలోచనతోనే form 7 నింపి ఉండొచ్చు కదా! మీరు చేస్తే బాధ్యత, అవతలి పార్టీ చేస్తే తప్పా?

 

3. 3.5 కోట్ల మంది ప్రజల డేటాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సేవా మిత్ర యాప్‌కి ఇచ్చింది అని ఆరోపిస్తున్నారు.

నా ప్రశ్న:1, 2, 3, 4, 5.. ఇలా మీ దగ్గర సీరియల్ వారీగా 3.5 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన సమాచారం సిద్ధంగా ఉందా? అలా మీ దగ్గర 3.5 కోట్ల మంది ప్రజల సమాచారం ఉండీ.. అది TDP యాప్‌లో ఉందని రెండు డేటా సెట్లని ప్రజల ముందు పెట్టినప్పుడు మాత్రమే ఆరోపణలు చేసే అర్హత ఉంటుంది. “3.5 కోట్ల మంది డేటా దొంగిలించబడింది” అనే మాట విన్నప్పుడల్లా నాకు నవ్వు వస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ జనాభా మొత్తం 3.5 కోట్లు కాబట్టి.. నోటికొచ్చిన లెక్కగా అందరి డేటా పోయినట్లు YCP చెబుతోంది.

ఇక్కడ అసలు కనీసం బుర్ర ఉన్న ఎవరూ ఆలోచించని మరో లాజిక్. 3.5 కోట్ల మంది లబ్దిదారులు ఉన్నారా? 2011 జనాభా లెక్కల ప్రకారం అప్పటి ఆంధ్రప్రదేశ్ జనాభా 4.97 కోట్లు. వారికి 3.5 కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారా? నిజంగానే దాదాపు ఆంధ్ర ప్రదేశ్‌లో నివసించే ప్రతి పౌరుడు ఏదో ప్రభుత్వ పధకం ద్వారా లబ్ధి పొందాడా? అయితే అక్కడి ప్రభుత్వం బాగానే పని చేసినట్లు కదా! ఆ లబ్ధిదారుల సమాచారం తొలగించబడింది అన్నదే కదా YCP, TRS ఆరోపణ! 3.5 కోట్ల జనాభా డేటా మొత్తం లీక్ అయినట్లు సరైన ఆధారాలు లేకుండా ఎలా వివాదం చేస్తారు? నిజంగా తప్పుదారి పట్టించడం కాదా?

4. ఏం తప్పు చేయకపోతే అశోక్ అనే వ్యక్తి ఎందుకు ఎస్కేప్ అవుతారు? చంద్రబాబు కేస్ దర్యాప్తుకి సహకరించవచ్చు కదా?

నా ప్రశ్న:పైన నేను వెల్లడించినవి కాస్త విచక్షణతో, విశాల హృదయంతో విశ్లేషిస్తే, కచ్చితంగా ఒక పార్టీని టార్గెట్ చేసి మరో రెండు పార్టీలు వ్యవహరిస్తున్న విషయం కాస్తో కూస్తో తెలివితేటలు ఉన్న ప్రతి ఒక్కరికి అర్థం అవుతాయి. అలాంటప్పుడు విచారణ నిష్పక్షపాతంగా జరుగుతుందని ఎవరు భరోసా ఇవ్వగలుగుతారు? YCP జగన్ మీద దాడి జరిగినప్పుడు వైజాగ్ నుండి హైదరాబాద్ వచ్చి కేసు పెట్టడం కరెక్టే అయితే.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తమ డేటా దొంగిలిస్తుంది అని చంద్రబాబు భయపడడం ఎలా తప్పు అవుతుంది? YCP జగన్ ఎప్పుడో ఆంధ్ర ప్రభుత్వం మీద తమకు నమ్మకం లేదని ఆరోపించారు. మరి అలాంటప్పుడు తెలంగాణ ప్రభుత్వం మీద తమకు నమ్మకం లేదని ఆంధ్ర ప్రభుత్వం అనడంలో తప్పు ఎలా ఉంది?

5. ఆధార్, ఓటర్ వివరాలు దొంగిలించబడ్డాయి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాటిని దొంగిలించింది అన్నది మరో ఆరోపణ.

నా ప్రశ్న: నిన్ననే దీని గురించి పాక్షికంగా ప్రస్తావించాను. YCP లోకేశ్వర్ రెడ్డి కేస్ ఫైల్ చేసేటప్పుడు, మీడియా ముందు తీసుకువచ్చిన ప్రింట్ అవుట్ లలో ఉన్న సమాచారం ఆధార్, ఓటర్ డేటాబేస్ నుండి తీయబడిన డేటానా? ఆయనకి ఆ డేటా ఎలా యాక్సెస్ అయింది? ఆయన ఆ సిస్టమ్స్‌ని హ్యాక్ చేసి లోపలికి వెళ్లి డేటా కంపేర్ చేశారా?

సరే ఎలాగోలా ఆయన దగ్గరకు డేటా వచ్చింది అనుకుందాం. ఆ ఒరిజినల్ ఆధార్, ఓటర్ ఐడి డేటా మొత్తం TDP యాప్‌లో సరిపోలుతోంది అని లోకేశ్వర్ రెడ్డి ఎలా నిర్థారించుకున్నారు? నాబోటి బయట వ్యక్తికి TDP సేవా మిత్ర యాప్‌లోకి వెళ్లడానికే అనుమతి లేదు. అలాంటప్పుడు సేవా మిత్రా యాప్‌లో ఫలానా డేటా ఉందని ఆయన ఎలా తెలుసుకోగలిగారు? అంటే ఆయన ఆ యాప్‌ని దొంగతనంగా హ్యాక్ చేశారా? TDP వారి డేటాబేస్ దొంగిలించారా?

రెండు డేటా సెట్లని కంపేర్ చెయ్యకుండా ఎలా ఆరోపణలు చేస్తారు? ఆధార్ దగ్గర నల్లమోతు శ్రీధర్ అనే వ్యక్తి fingerprint, ఆధార్ నెంబర్, ఫొటో ఎలా ఉన్నాయో TDP దగ్గర కూడా అదే ఫొటో ఉందని YCP ఎలా ఆరోపించగలుగుతోంది, వారి దగ్గర తగిన డేటా లేకుండా? ఇక్కడ ఒక అనుమానం వస్తోంది. TDP సేవా మిత్ర యాప్‌ని హ్యాక్ చేసి, అందులో డేటాని YCP దొంగిలించి, ఆ ఫోటోలు ప్రింటు తీసి.. దాన్ని ఆధార్ డేటా అని జనాల్ని నమ్మించడానికి ప్రయత్నించి YCP క్రైమ్ చేస్తున్నట్లు అన్పిస్తోంది. ఇంత లాజికల్‌గా ఏ బుర్రన్న వ్యక్తి ఆలోచిస్తున్నాడు? ఏదో గుడ్డెద్దు చేలో పడ్డట్టు డేటా పోయింది పోయింది అని అనడం, ఆయా పార్టీల అభిమానులు ఇదేమీ ఆలోచించకుండా పోలోమని జై కొట్టడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు.

చివరిగా ఒకటే మాట చెబుతున్నాను.. రాజకీయ పార్టీల కన్నా డేటా ప్రైవసీకి ప్రాధాన్యత ఇచ్చే టెక్నాలజీ వ్యక్తిని నేను. నాకు ఏ పార్టీ గొప్ప కాదు. TDPని కూడా చాలా సందర్భాల్లో విమర్శించాను. కానీ ప్రజలని పావులుగా చేసుకుని ఏ పార్టీకి ఆ పార్టీ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నించడం అసహ్యంగా ఉంది. ఇది ఖచ్చితంగా ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తుంది. రాజకీయాల గురించి రాయటం నాకు ఇష్టం లేక పోయినా, ఇక నేను రాయను అని గతంలో ప్రకటించినా, చాలా నెలల పాటు ఆ నిర్ణయాన్ని గౌరవించినా తెలివితేటలు కోల్పోతున్న సమాజాన్ని చూసి బాధేసి కాస్త బుర్రున్న వాళ్లు కనీసం ఇవన్నీ ఆలోచిస్తారని ఇంత వివరంగా రాయటం జరిగింది.

నిజాలు నిలకడ మీద తేలతాయి. ఒకవేళ ఎవరైనా ఈ వాదనను విబేధించేటట్లయితే.. పైన నేను రాసిన దాన్ని లైన్ బై లైన్ ఉటంకిస్తూ పూర్తి వివరంగా రిప్లై ఇవ్వండి. తప్పించి మీరు ఇప్పటి వరకూ నమ్మిన దాన్ని జనరలైజ్ చేసి కామెంట్లు రాయకండి.

ధన్యవాదాలు

నల్లమోతు శ్రీధర్

One thought on “డేటా లీక్ గురించి టిఆర్ఎస్, వైసిపీలకు 5 సూటి ప్రశ్నలేసిన నల్లమోతు శ్రీధర్

  1. Sir,
    People like you can coment on going issues like this.general people we don’t know what is happening.one bhramin and 7 goats story,every body knows it.ysrcp following the same.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *