ప్రముఖ సినీ నటి, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ అయిన విజయశాంతి రానున్న పార్లమెంటు ఎన్నికల బరిలో దిగనున్నట్లు సమాచారం అందుతోంది. ఆమె మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. కానీ ఆమెకు గుర్తింపు ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. రాములమ్మను స్టార్ క్యాంపెయినర్ గా నియమించింది. అయితే అనూహ్యంగా మొన్నటి ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్నది.
ఈ నేపథ్యంలో రాములమ్మను ఈసారి జరగనున్న పార్లమెంటు ఎన్నికల్లో బరిలోకి దింపాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెను ఖమ్మం పార్లమెంటు సీటుకు పోటీ చేయించే యోచనలో ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ మొదలైంది. ఈ విషయాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక యువ నేత వెల్లడించారు. ఆయన చెప్పిన ఈక్వేషన్స్ ఇలా ఉన్నాయి.
‘‘విజయశాంతి బిసి సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఆమెకు సినీ గ్లామర్ పుష్కలంగా ఉంది. రాములమ్మగా ఆమె ప్రజల్లో పాపులారిటీ సంపాదించింది. వామపక్ష భావజాలం అధికంగా ఉన్న ఖమ్మంలో రాములమ్మకు మరింత ఆదరణ ఉంటుంది. సామాన్యులు, దళితులు, గిరిజనుల ఓటర్లను ఆకర్షించే సత్తా రాములమ్మకు ఉంది. ఇదే కాకుండా విజయశాంతి భర్త కమ్మ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. ఖమ్మం జిల్లాలో కమ్మ సామాజికవర్గం వారి ప్రభావం కూడా తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ ఈక్వేషన్ ను కూడా వినియోగించుకునే చాన్స్ ఉంటుంది. అలాగే ఖమ్మం ఆంధ్రా సరిహద్దు నియోజకవర్గం కాబట్టి ఆంధ్రాలో టిడిపి సహకారం కూడా తీసుకునే చాన్స్ ఉంటుంది’’ అని ఆ యువ నేత విశ్లేషించారు.
అంతేకాకుండా ఖమ్మంలో మహా కూటమి మెజార్టీ సీట్లలో గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. టిఆర్ఎస్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేవలం ఒక సీటుకే పరిమితమైంది కాబట్టి రాములమ్మ ఖమ్మం పార్లమెంటుకు పోటీ చేస్తే కండ్లు మూసుకుని గెలవడం ఖాయమని ఆయన వెల్లడించారు. అందుకే అధిష్టానం రాములమ్మను ఖమ్మం బరిలోకి దింపేందుకు కసరత్తు చేస్తోందని చెప్పారు.
రాములమ్మ ఖమ్మం సీటులో పోటీ చేయవచ్చన్న ప్రచారంతో ప్రస్తుత టిఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ఆందోళన షురూ అయిందని తెలిపారు. పొంగులేటి డబ్బు రాజకీయాలకు రాములమ్మ ద్వారా కాంగ్రెస్ అధిష్టానం చెక్ పెట్టబోతున్నదని స్పష్టం చేశారు. ఉద్యమ నేపథ్యం, ప్రజాధరణ ఉన్న రాములమ్మను పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఎదుర్కోనే ప్రసక్తే లేదన్నారు.
రాములమ్మను బరిలోకి దింపడం ద్వారా ఖమ్మం జిల్లాలో ఉన్న వర్గ రాజకీయాలకు చెక్ పెట్టే యోచనలో అధిష్టానం ఉందని ఆ నేత మీడియాకు పంపిన సందేశంలో వెల్లడించారు.
మరి అసెంబ్లీ బరిలో పోటీ చేస్తానంటూ ఒక దశలో ముందుకొచ్చిన రాములమ్మకు పొత్తుల కారణంగా పోటీ చేసే అవకాశం రాలేదు. అయితే ఆమె అవకాశం ఉంటే పోటీ చేస్తాను. లేదంటే ప్రచారం చేస్తానని ప్రకటించారు. ఆమేరకు తన శక్తి మేరకు ప్రచారం చేశారు. కానీ ముందస్తు సమరంలో టిఆర్ఎస్ గాలి బలంగా వీచింది కాబట్టి కాంగ్రెస్ ప్రభావం చూపలేకపోయింది. అయితే ఈవిఎం లు ట్యాంపరింగ్ చేసి గెలిచారని కాంగ్రెస్ విమర్శల పర్వానికి దిగింది కూడా.
మరి పార్లమెంటు బరిలో పోటీ చేసి రాములమ్మ సత్తా చాటుతారా? లేదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.