మల్లన్నసాగర్ బాధిత గ్రామాల్లో మళ్లీ టెన్షన్ (వీడియో)

మళ్ళీ ఉద్యమ బాటలోకి వస్తున్నాయి మల్లన్న సాగర్ బాధిత గ్రామాలు. ఒకే ప్రాజెక్టు లో ఒక్కో గ్రామానికి ఒక్కో రకమైన నష్ట పరిహారం చెల్లింపు తీరుపై బాధిత గ్రామాలు రగిలిపోతున్నాయి. నష్టం జరుగుతుందన్న అవేదనతో మళ్ళీ పనులను నిలిపివేసి పోరుబాట పట్టారు బాధిత గ్రామైన ఎర్రవల్లి గ్రామస్తులు.

ముంపు గ్రామాలన్నింటికి సమన్యాయం చెయ్యాలని గ్రామ ప్రజలందరూ ఏకమై రోడ్డెక్కారు. తక్కువ ధరలకు భూములను కోల్పోయామని సాగర్ ఆయకట్టు పై వంటా వార్పు చేసి కొత్త వేడి రగిలించారు. కేసీఆర్ నేర్పిన ఉద్యమ బాటలోనే తాము పోరుబాట పట్టినట్లు చెబుతున్నారు. తమకు న్యాయం జరిగే వరకు ఉద్యమాన్ని ఆపకుండా పనులు జరగకుండా శాంతియుత నిరసనలు కొనసాగిస్తామని ఎర్రవల్లి ప్రజలు హెచ్చరిస్తున్నారు.

ఈ విషయమై మల్లన్న సాగర్ బాధిత ప్రజలు తెలంగాణ సిఎం కేసిఆర్ కు బహిరంగ లేఖ రాశారు. వారి లేఖ కింద ప్రచురిస్తున్నాం.

 

మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు అవేదనతో కేసీఆర్ గార్కి విజ్ఞపితో వ్రాయునది ….!!

తెలంగాణ సాధన కోసం కేసీఆర్ తో కలిసి ఉద్యమ అడుగులు వేసాము. రాష్ట్రం సాధించిన తరువాత కేసీఆర్ ని గజ్వెల్ గడ్డపై గెలిపించేందుకు గ్రామ గ్రామన తిరిగాము.
బంగారు తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ తలపెట్టిన నీటి ప్రాజెక్టులకు మల్లన్న సాగర్ ముంపు గ్రామాలు స్వచ్చందంగా భూములు ఇచ్చారు.
అన్యాయం జరుగుతుంది అని తెలిసినా తెలంగాణ అభివృద్ధి కోసం కేసీఆర్ అభివృద్ధి బాటలో రెండోసారి ఆకాండ విజయాన్ని కట్టపెట్టాము.
కేసీఆర్ ద్వారా తమకు న్యాయం జరుగుతుందని మూడు రోజులుగా ఆయకట్టు పై వంటా వార్పు కార్యక్రమం చేస్తున్నాము. తెలంగాణ రాష్ట్రాన్ని కోటి ఎకరాల మాగాణి చెయ్యాలనే కేసీఆర్ కలకోసం మల్లన్న సాగర్ ముంపు గ్రామాల తమకు అన్యాయం జరిగినా ఎకరానికి 6లక్షల 5వేలు తక్కువ ధర ప్రభుత్వం 123 చట్టం ప్రకారం ఇస్తే కాదనలేక కన్న ఊరిని కన్నతల్లిలాంటి నేలను వదిలేస్తున్నాము.

కానీ 6లక్షల నష్ట పరిహారం సరిపోదని ఉద్యమం చేసిన మల్లన్న సాగర్ ముంపు గ్రామాల్లో కొన్ని గ్రామాలు ఉద్యమాన్ని చేసాయి…కానీ ఇప్పుడు కేసీఆర్ అభివృద్ధి బాటలో కాకుండా అడ్డుకున్న ఆ గ్రామాలకె కేసీఆర్ న్యాయం చేస్తున్నారు. ఇన్ని రోజులు ఉద్యమం చేసిన ఆ గ్రామాలకు 11లక్షల 50వేలు ఎకరానికి ప్రకటించారు. ఇండ్ల సర్వే చేస్తూ స్పాట్ లో చెక్కుల పంపిణీ చేస్తున్నారు. కేసీఆర్ అభివృద్ధికి సహకరించిన మా గ్రామాలకు ఒక నష్ట పరిహారం… ఇన్ని సంవత్సరాలు భూములు ఇవ్వకుండా పోరాటం చేసిన వారికి మరో రకంగా నష్ట పరిహారం ఇవ్వడమేంటి?

కేసీఆర్ గారు ముంపు గ్రామాలన్నింటికి సమ న్యాయం చెయ్యాలని కోరుతున్నాము. గ్రామాల్లో ముంపు ప్రజలు ఎదురుకుంటున్న గోడును కేసీఆర్ గారికి అందించడానికి నిరసన తెలియజేస్తున్నాము. కానీ ఉద్యమం చేసి కేసీఆర్ గారు చేసే అభివృద్ధికి అడ్డుకట్ట వేయాలని ఎలాంటి ఉద్దేశం లేదని ప్రజలందరూ ఆవేదనతో గొడువేళ్ళబుచ్చుతున్నారు. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ముంపు ప్రజలందరికీ న్యాయం జరుగుతుందని రెండోసారి సైతం కేసీఆర్ గారికి ఓట్ల ద్వారా తమ మద్దతును తెలిపాము. కానీ నష్టపరిహారం ఊరి ఊరికి వేరువేరుగా ఇవ్వడం మాకు తీరని ఆవేదన కలిగిస్తున్నది. కాబట్టి దీన్ని సరిచేయగలరని ప్రార్థన.

ఇట్లు
మల్లన్న సాగర్ ముంపు గ్రామమైన ఎర్రవల్లి ప్రజలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *