సినీనటి భానుప్రియ కేసు మరో మలుపు తిరిగింది. భానుప్రియ ఇంట్లో పని మనిషిగా తూర్పుగోదావరి జిల్లా సామర్ల కోటకు చెందిన ప్రభావతి కూతురు పని చేస్తుంది. భానుప్రియ తన కూతురును వేదిస్తుందని, భానుప్రియ సోదరుడు లైంగికంగా వేధిస్తున్నాడని ప్రభావతి సామర్లకోటలో ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు విచారించిన సంగతి తెలిసిందే.
తన పై వార్తలు రావడంతో భానుప్రియ మీడియా ముందుకు వచ్చి నిజానిజాలు చెప్పారు. ప్రభావతి కూతురు తమ ఇంట్లో ఉన్న విలువైన వస్తువులతోపాటు నగదును కూడా అపహరించిందని వాటిని ప్రభావతితోనే పంపించిందన్నారు. వాటిని తిరిగి తీసుకురమ్మంటే తమపైనే రివర్స్ కేసు పెట్టారని భానుప్రియ తెలిపింది.
తల్లి ప్రోత్సాహంతో బాలిక నిజంగానే దొంగతనానికి పాల్పడిందని పోలీసులు తేల్చారు. ఇదే విషయాన్ని బాలిక కూడా మీడియా ముందు మరియు పోలీసుల ముందు తెలిపింది. అంతే కాకుండా భానుప్రియ కుటుంబ సభ్యులు తనను మంచిగానే చూసుకున్నారని ఎవరు కూడా వేదించలేదని చెప్పింది. బాలికతోపాటు బాలిక తల్లి ప్రభావతి పై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే భానుప్రియకు ఇప్పుడు కొత్త సమస్య వచ్చింది. 14 సంవత్సరాల బాలికను పనిలో పెట్టుకోవడం నేరమని బాలల హక్కుల సంఘం తెలిపింది. భానుప్రియ స్వయంగా మీడియాతో పనిలో పెట్టుకున్నట్టు చెప్పడం దీనికి బలమైన ఆధారంగా ఉంది. భానుప్రియ పై చర్యలు తీసుకోవాలని బాలల హక్కుల సంఘం డిమాండ్ చేసింది. దీంతో భానుప్రియ అరెస్టు తప్పకపోవచ్చని పోలీసులు అంటున్నారు. ఈ కేసులో అన్ని కోణాల్లోనూ విచారించి తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు అన్నారు. కేసు అడ్డం తిరగడంతో భానుప్రియ చిక్కుల్లో పడ్డారు.