టిఆర్ఎస్ కీలక నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన తన పదవికి రాజీనామా చేశారు. సుదీర్ఘ కాలం ఆ పదవిలో కొనసాగిన హరీష్ రావు ఉన్నఫలంగా ఆ పదవికి రాజీనామా చేయడం చర్చనీయాంశమైంది. ఇంతకూ హరీష్ రావు ఏ పదవికి రాజీనామా చేశారు? ఎందుకు చేశారు? పూర్తి వివరాలు ఇవీ…
తెలంగాణ ఉద్యమ కాలంలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించేందుకు ఆర్టీసిలో కార్మిక సంఘాన్ని ఏర్పాటు చేశారు కార్మికులు. ఆ సంఘం పేరు తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టిఎంయూ) దీనికి ప్రధాన కార్యదర్శిగా అశ్వథ్థామ రెడ్డి, వర్కింగ్ ప్రసిడెంట్ గా థామస్ రెడ్డి ఉన్నారు. ఈ సంఘానికి అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు గౌరవాధ్యక్షుడిగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆ గౌరవాధ్యక్ష పదవికి హరీష్ రావు రాజీనామా చేశారు. ఈ విషయాన్ని టిఆర్ఎస్ కార్యాలయం ధృవీకరించింది.
అసలు తెలంగాణ ఉద్యమ కాలంలో గౌరవాధ్యక్షులుగా ఉన్న హరీష్ రావు తెలంగాణ తొలి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగిన సమయంలో కూడా టిఎంయూ కు గౌరవాధ్యక్షులుగానే ఉన్నారు. తాజాగా కొత్త ప్రభుత్వం వచ్చింది. హరీష్ రావు మంత్రిగా ఇంకా నియమితులు కాలేదు. కానీ ఆయన ఉన్నఫలంగా ఎందుకు గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా హరీష్ రావు తన రాజీనామా లేఖను టిఎంయూ ప్రధాన కార్యదర్శి అశ్వథ్థామ రెడ్డికి పంపించారు. అయితే తమ సంఘం గౌరవాధ్యక్షులుగా ఉన్న హరీష్ రావు రాజీనామా చేసిన విషయం తమకు అధికారికంగా తెలియదని అశ్వథ్థామరెడ్డి తెలిపారు. ఆయన రాజీనామా చేసినట్లు మీడియా ద్వారా తెలిసిందన్నారు.
తెలంగాణ ఉద్యమ కాలంలో ఆ సంఘాన్ని ముందుండి నడిపిన హరీష్ రావు ఆ తర్వాత మంత్రిగా ఉన్న సమయంలో కూడా ఆ సంఘం గౌరవాధ్యక్షులగా ఉన్నారు. కానీ ఇప్పుడు సడెన్ గా ఎందుకు ఆ పదవికి రాజీనామా చేశారు. అసలు రాజీనామా చేయాల్సిన అవసరం హరీష్ రావు కు ఎందుకు వచ్చింది? ఏవైనా వత్తిళ్ల కారణంగా హరీష్ రావు తన పదవికి రాజీనామా చేశారా? అన్నదానిపై కార్మిక వర్గాల్లో చర్చోపచర్చలు సాగుతున్నాయి.
అయితే గత ప్రభుత్వ హయాంలో టిఎంయూ గుర్తింపు పొందిన సంఘంగా కొనసాగింది. ఆ సమయంలో కార్మికుల సమస్యల విషయంలో టిఎంయూ సమ్మె నోటీసు ఇచ్చింది. ఆ సమయంలో అసలు సంఘం గౌరవాధ్యక్షుడైన హరీష్ రావుకు తెలియకుండానే టిఎంయు సమ్మె నోటీసు ఇచ్చినట్లు ప్రచారం జరిగింది. ఆ సమయంలో సంఘం నాయకులకు, టిఎంయూ నేతలకు మధ్య అగాధం ఏర్పడినట్లు చెబుతున్నారు.
సమ్మె నోటీసు సమయంలో తెలంగాణ సిఎం కేసిఆర్ కార్మిక సంఘాల నేతల మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసి కార్మికులకు దేశంలోనే ఎక్కడా లేని రీతిలో బెన్ఫిట్స్ ఇస్తున్నామని, అయినా సమ్మె చేస్తామంటే తీవ్ర పరిణామాలుంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఒకవేళ సమ్మె చేస్తామని మొండిగా ముందుకు పోతే అవసరమైతే ఆర్టీసిని మూసిపారేస్తామని కూడా హెచ్చరించారు. దానికి కార్మిక నేతలే బాధ్యత వహించాలని సీరియస్ గా హెచ్చరించారు.
ఆ సమయంలో ఇటు ప్రభుత్వ హెచ్చరికలు, అటు యూనియన్ నేతల కౌంటర్ల మధ్య టిఎంయూ గౌరవాధ్యక్షులుగా ఉన్న హరీష్ రావు బాగా నలిగిపోయారు. ఆ సమయంలోనే ఆయన రాజీనామా చేయనున్నట్లు వార్తలొచ్చాయి. కానీ అప్పుడు యూనియన్ కు ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన వివాదాన్ని హరీష్ రావు తన చతురతతో సద్దుమణిగేలా చేశారు. కానీ అప్పటి నుంచి హరీష్ రావుకు, టిఎంయూ నేతలకు మధ్య సత్సంబంధాలు లేవని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే హరీష్ రావు తాజాగా తన గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామం ఒక్క ఆర్టీసి కార్మికుల మధ్యే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
హరీష్ రావుతో చర్చిస్తాం : అశ్వథ్థామరెడ్డి
టిఎంయూ గౌరవాధ్యక్ష పదవికి హరీష్ రావు రాజీనామా చేసిన విషయమై అశ్వథ్థామరెడ్డి ట్రెడింగ్ తెలుగు న్యూస్ తో స్పందించారు. ఆయన రాజీనామా ఎందుకు చేశారో తెలియదన్నారు. రాజీనామా చేసిన విషయం మీడియా ద్వారానే తెలిసిందన్నారు. అసలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తే హరీష్ రావు హైదరాబాద్ లో లేరని అన్నారు. ప్రస్తుతం హరీష్ రావు షిరిడీలో ఉన్నారని, ఆయన వచ్చిన తర్వాత కలిసి రాజీనామా విషయంపై చర్చించిన తర్వాత యూనియన్ తరుపున స్పందిస్తామన్నారు.