గ్రామాలు దేశానికి వెన్నెముక లాంటివని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలన్నది సీఎం కేసీఆర్ కల అని ఇవాళ హైదరాబాద్ లో తనను కలిసిన సర్పంచులతో హరీశ్ రావు అన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన పలువురు సర్పంచులు ఇవాళ హరీశ్ రావును కలవగా వారిని ఆయన అభినందించారు.
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చెరువుగా తీసుకెళ్లేది సర్పంచులేనన్నారు. అందుకే సీఎం కేసీఆర్ పంచాయతీలకు అధికారాలు, విధులు, నిధులు అందజేశారన్నారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం తీసుకొచ్చిన ఘనత సీఎందన్నారు. తండాలను పంచాయతీలుగా మారుస్తామని హామీ ఇచ్చి నెరవేర్చిన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కొత్తగా ఎన్నికయిన సర్పంచులు గ్రామాలను అన్ని రకాలుగా అభివృద్ధి పథంలోకి నడపాలన్నారు. నిత్యం ప్రజల్లో ఉండి వారి బాగోగులు చూసుకోవాలన్నారు. ఉప సర్పంచి పదవి అలంకారప్రాయం కాదని ఆ పదవికి అధికారాలు కల్పించిన ఘనత కేసీఆర్ దేనన్నారు.
సర్పంచ్ లు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు ఐక్యంగా పంచాయతీల బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎందరో గొప్ప రాజకీయ నేతలు సర్పంచులుగా తమ రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన వారేనన్నారు. ప్రజల్లో నిత్యం ఉండటం ద్వారా ప్రజా సమస్యలు, వాటి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా మన్ననలు పొందాలని వారికి సూచించారు.