ఇబ్బంది పెట్టే గతాన్ని చంద్రబాబు హాయిగా మర్చిపోతారు, ఇలా…

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వభావం కాస్తా కూస్తో ఎరిగిన వారు గత మూడేళ్లుగా ఆయన ప్రసంగాలు వింటుంటే విస్తు పోవలసి వస్తోంది. 2014 లో అధికారం చేపట్టి ఏడాది గడవకు ముందే తనేంచేశాడో ఆయన చాలా సలభంగా మర్చిపోయి మాట్లాడుతుంటారు. ఈ మధ్య ఈ మతిమరపు ఆయన బాగా ఎక్కువయింది. మొన్న శనివారం కోలకతాలో జాతీయ స్థాయిలో జరిగి సభలో కూడా కర్నాటకలో బిజెపి పార్టీ ఫిరాయింపులకు పాల్పడు తున్నదని ప్రసంగం చేస్తున్నపుడు ఆయన తన గతం మర్చిపోయారు. ఇది తన వ్యక్తిత్వాని తనే దిగ జార్చుకొనే విధంగా వుంది.

ఈ ప్రసంగం కొందరు వారు ముఖ్యమంత్రి కి ప్రత్యర్థులు కావచ్చు – సోషల్ మీడియాలో చొప్పించగా హల్ చల్ చేస్తోంది. అయితే వారు ఏ ఉద్దేశంతో సోషల్ మీడియాలో పెట్టినా ముఖ్యమంత్రి తనకు నెగిటివ్ గావుండే అంశాలు ప్రసంగాలలో రాకుండా చూచు కోవలసి వుంది. ముఖ్యమంత్రి చుట్టూ పలువురు మేధావులు పార్టీ సీనియర్ నేతలు వుంటారు. వారైనా కనీసం ఆయనకు సలహా ఎందుకు ఇవ్వడం లేదో తెలియదు.?

2014 ఎన్నికల తర్వాత తొలుత కెసిఆర్ పార్టీ ఫిరాయింపులకు తెర దీశారు. తదుపరి జరిగిన హైదరాబాద్ జంట నగరాల కార్పొరేషన్ ఎన్నికల్లో టిడిపి తరపున ప్రచారం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు కెసిఆర్ ను దునుమాడుతూ పార్టీ ఫిరాయింపులను రాజకీయ వ్యభిచారంగా అభివర్ణించారు. అందరూ చప్పట్లు కొట్టారు. రాజకీయ వర్గాలు విశ్లేషకులు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజాస్వామ్య యెడల గల నిబద్ధతను మెచ్చు కొన్నారు.

కెసిఆర్ కు ప్రభుత్వం నడిపే మెజారిటీ వున్నా అభద్రతా భావంతో ఈ చర్యకు తలపడి నట్లు భావించారు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా తగినంత మెజారిటీ వున్నా కొద్ది నెలల్లోనే పార్టీ ఫిరాయింపులకు తెర తీయడంతో మొత్తంగా పరువు పోయింది. రాజకీయాలో నిబద్ధత విశ్వసనీయత వుండాలని ఉపన్యాసాలు ఇచ్చే చంద్రబాబు ఈ చర్యతో సగటు రాజకీయ నేతగా మిగిలిపోయారు. ఈ అంశాలు ఎవరైనా ప్రస్తావించితే వారంతా వైసిపి వారుగా ముద్ర వేసి ఎదురు దాడితో టిడిపి నేతలు సరి పెడుతున్నారు. గాని ప్రజల దృష్టిలో చులకన కావడం వీరికీ పట్టడం లేదు. రాజకీయ నేతలకు మతి మరుపు వుంటుంది. కాని ప్రజలు మాత్రం ఎప్పుడూ మెలుకువగానే వుంటారు. ఇది గత చరిత్ర.

ఇదే కాదు. ఈ లాంటి సంఘటనలు చాలా సంభవించాయి. మచ్చుకు టిఆర్ఎస్ తో పొత్తు. టిఆర్ఎస్ తో పొత్తుకు తను ప్రతి పాదన చేసి నట్లు వారు నిరాకరించారని ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు. ఆ తర్వాత కాంగ్రెస్ తో పొత్తు పెట్టు కొన్నారు. పార్టీ రాజకీయ అవసరాలతో కాంగ్రెస్ తో పొత్తు దాని ఫలితాలు టిడిపి భరిస్తుందని భావించినా అదే పార్టీతో వైసిపి పొత్తు పెట్టుకొంటే ఏలా అపవిత్రం అవుతుంది? . ఎప్పుడో కెసిఆర్ ఆంధ్ర బిరియాని ఆవు పేడగా వుంటుందని లంకలో పుట్టిన వారంతా రాక్షసులు అయినట్టు ఎపి వారంతా దుర్మార్గులని చెప్పారని దాన్ని పేర్కొంటూ ముఖ్యమంత్రి తనయుడు మంత్రి లోకేష్ వ్యాఖ్యానించడం ఎంత వరకు సబబు?

అంటే కెసిఆర్ పార్టీ ఫిరాయింపులకు పాల్పడితే రాజకీయ వ్యభిచారం-అదే చంద్రబాబు చేస్తే అభివృద్ధి చూచి ప్రతి పక్ష ఎమ్మెల్యేలు పార్టీ మారారా? చంద్రబాబు టిఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటే తప్పు లేదు. గాని మరో పార్టీ జట్టు కడితే అది తప్పా? చంద్రబాబు పొత్తుకు యత్నం చేసినపుడు ఆంధ్ర బిరియాని ఆవు పేడగా కెసిఆర్ అభివర్ణించిన అంశం మంత్రి లోకేష్ కు గుర్తుకు రాలేదా?ప్రజలు వాచ్ డాగ్ లాగా వుంటారనే స్ప్రుహ లేక పోతే ఇలాంటి ప్రసంగాలే నేతలు చేస్తుంటారు.

ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి గాని ఆయన తనయుడు తప్పు మీద తప్పులు మాట్లాడు తున్నారు. మంత్రి లోకేష్ కు శిక్షణ ఇవ్వబడిందని ఆ మధ్య ప్రచారంలో వుండింది. ఆలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా శిక్షణ తీసుకుంటే మంచి దేమో. గతంలో టిడిపి నేతలు ఎవరైనా భిన్నంగా మాట్లాడితే ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిచి క్లాస్ తీసుకొనే వారు. ఇప్పుడు పార్టీ అధినేత తాను చేసిన పనులను తన సౌలభ్యం కోసం మర్చిపోవడం వింతగా ఉంది.

సాధారణంగా ముఖ్యమంత్రి చంద్రబాబు యే కాదు. ఎవరైనా సరే తమ పార్టీ ప్రయోజనం లేదా మరొక ఏదైనా కారణంతో కొన్ని తప్పులకు పాల్పడటం ఈ వ్యవస్థలో తప్పని సరి. ఆలాంటి సమయంలో ఆ అంశాన్ని తిరిగి తెర మీదకు రాకుండా జాగ్రత్త పడుతుంటారు. రాష్ట్ర విభజన అనంతరం కెసిఆర్ పార్టీ ఫిరాయింపులు ప్రారంభించితే ఆయనను తలదన్ను విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కథ నడిపి ప్రజా స్వామ్యానిని నడి వీధిలో ఖూనీ చేసి చరిత్ర కెక్కారు.ఇటీవల కాలంలో ఎపిలో జరిగిన విధంగా ఫిరాయింపులు మరే రాష్ట్రంలో సంభవించ లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కోలకతా సభలో మాట్లాడుతూ కర్నాటకలో ఎమ్మెల్యేలను పశువులుగా కొన డానికి బిజెపి కోట్ల రూపాయలను వెచ్చించు తున్న దని పేర్కొన్నారు. మరి ఎపిలో పార్టీ ఫిరాయించిన వారు పశువులేనా?ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్ని కోట్లు వ్యయం చేశారు.? ఇవన్నీ ప్రతి సామాన్య వ్యక్తికి వచ్చే సందేహాలే.

రాష్ట్రంలో ఈ అంశంపై భంగ పాటు చెంది వచ్చిన వ్యతిరేకత నుండి బయట పండేందుకు ప్రతి మహిళకు సెల్‌ఫోన్లు ఇన్నాళ్లు లేని విధంగా పదివేల రూపాయలు ఇవ్వాల్సిన దుస్థితి టిడిపి ప్రభుత్వంకు ఏర్పడింది. తాజాగా ఈ ప్రసంగంతో జాతీయ స్థాయిలో కూడా మరో మారు చులకన కావడం జరిగింది.

(వి.శంకరయ్య)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *