తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి చేరి రోజులు, వారాలు నెలలు గడిచిపోతున్నాయి. అయినా రేవంత్ ఆశించిన పోస్టు ఇంకా దక్కలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యదర్శి పదవిని రేవంత్ ఆశిస్తున్నారు. ఆ పోస్టు తప్ప మరేది ఇచ్చినా తీసుకోబోనని చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన అధిష్టానం ముందు స్పష్టంగా చెప్పారు. బయట కూడా ఇదే ముచ్చట చెబుతున్నారు. అయితే రేవంత్ కు పదవిపై కాంగ్రెస్ పార్టీ ఇంకా నాన్చివేత ధోరణి అవలంభిస్తోంది. ఎప్పుడో రేవంత్ రెడ్డికి పదవి రావాల్సి ఉంది. కానీ రకరకాల కారణాల వల్ల రేవంత్ కు తీపి కబురు అందడంలేదు. అయితే కాంగ్రెస్ పార్టీలోని సీనియర్లతోపాటు టిఆర్ఎస్ నేతలు కూడా రేవంత్ కు పదవి రాకుండా అడ్డుపుల్లలు వేస్తున్నారని రేవంత్ శిబిరం అనుమానాలు వ్యక్తం చేసింది. ఆరోపణలు కూడా చేసింది. ఈ పరిస్థితుల్లో రేవంత్ కు పదవి ఎప్పుడు దక్కుతుందా అన్న ఆసక్తి ఆయన అనుచరుల్లోనే కాకుండా రాజకీయ వర్గాల్లో కూడా నెలకొంది.
తెలంగాణ కాంగ్రెస్ లో జూన్ 30వ తేదీ వరకు ఆశావహులందరికీ పదవులు వరిస్తాయని, జూన్ 30 తర్వాత కాంగ్రెస్ దూకుడు పెంచుతుందని ఇన్ఛార్జి రామచంద్ర కుంతియా గతంలో ప్రకటించారు. అయితే తెలంగాణ కాంగ్రెస్ నాయకయత్వంలో కూడా మార్పులు చేర్పులు ఉంటాయన్న చర్చ జరిగింది. ఏమైందో కానీ ఇప్పటివరకు రేవంత్ కు పదవి మాత్రం రాలేదు. జూన్ 30లోగా రేవంత్ కు ప్రచార కార్యదర్శి పదవి ఖాయమని ప్రచారం కూడా సాగింది. కానీ ఆ ప్రచారం ఇప్పుడు సప్పబడ్డది. ఇదిలా ఉంటే రేవంత్ రెడ్డి మంగళవారం అమెరికా పర్యటనకు వెళ్తున్నారు. ఆయనతోపాటు మాజీ ఎంపి మధు యాష్కీ గౌడ్ కూడా అమెరికా వెళ్తున్నారు. వీరిద్దరూ అమెరికాలో జరగనున్న మహసభలో పాల్గొననున్నారు. రేవంత్ జూలై 15 తర్వాతే ఇండియాకు రానున్నారు. రేవంత్ అమెరికా పర్యటనకు వెళ్లిన నేపథ్యంలో ఆయనకు ప్రచార కార్యదర్శి పదవి దక్కడం మరో 20 రోజుల తర్వాతే అన్నట్లు రేవంత్ సన్నిహితులు చెబుతున్నారు.
రేవంత్ రెడ్డికి ముందుగా కాంగ్రెస్ పార్టీలో వర్కింగ్ ప్రసిడెంట్ పదవి ఇస్తారని చర్చ జరిగింది. అధిష్టానం నుంచి ఆ సంకేతాలు వెలువడ్డాయి. కానీ రేవంత్ దానికి అంగీకరించలేదు. ఆ పదవి ఒకవేళ కట్టబెట్టినా తీసుకోబోనని చెప్పారు. అదే విషయాన్ని అధిష్టానం వద్ద కూడా స్పష్టం చేశారు. దీంతో వర్కింగ్ ప్రసిడెంట్ పదవి ఇద్దామనుకున్న అధిష్టానం విషయాన్ని పెండింగ్ లో పెట్టింది. రేవంత్ అంగీకరిస్తే వర్కింగ్ ప్రసిడెంట్ పదవి ఎప్పుడో వచ్చేదని అంటున్నారు. అయితే తనకు పిసిసి ప్రచార కార్యదర్శి పదవి అయితేనే తీసుకుంటానని, లేదంటే సామాన్య కార్యకర్తగా ఉంటానని రేవంత్ తేల్చి చెప్పారు. దీంతో ఆయన కోరిన పదవి ఇస్తారని చర్చ జరిగినప్పుడల్లా ఏదో ఒక రూపంలో అడ్డుకట్ట పడుతూ వస్తోంది. ఇక రేవంత్ విదేశాల్లో ఉన్న సమయంలో ఆయనకు పోస్టు డిక్లేర్ చేసే అవకాశాలు లేవని చెబుతున్నారు. రేవంత్ ఇండియాకు వచ్చిన తర్వాతే ఆయన కోరిన పోస్టు కట్టబెట్టే చాన్స్ ఉందంటున్నారు. మరోవైపు రేవంత్ కు పదవి ఇవ్వగానే పార్టీకి గుడ్ బై చెప్పి అధికార టిఆర్ఎస్ పార్టీలో చేరిపోవాలన్న ఉద్దేశంతో ఉన్న నాయకులు కూడా ఆచితూచీ అడుగులు వేస్తున్నారు.