జర్నలిస్ట్ హౌసింగ్ జనరల్ బాడీ మీటింగ్ లో ఏం జరిగింది ?

గత ఆరుదశాబ్దాల కాలంగా వున్న జర్నలిస్టు కోపరేటివ్‌ హౌసింగ్ సొసైటీ ఆధీనంలో పౌర సదుపాయాల నిమిత్తం కేటాయించిన స్థలాలు అన్యాక్రాంతం కానున్నాయా ? ఆదివారం (జూలై ఒకటి,2018) నాడు గోపన్నపల్లి కాలనీలో జరిగిన  సొసైటీ జనరల్‌ బాడీ సమావేశంలో జరిగిన చర్చ తీరుతెన్నులు, నిర్ణయాలు  ఇందుకు ఆస్కారం కలిగిస్తున్నాయి.

పౌర సదుపాయాల నిమిత్తం వున్న స్థలాలను బి.ఓ.టి.(నిర్మించి, గడువు మేరకు నిర్వహించుకొని, గడువు తీరిన తరువాత నిర్మాణాలతో సహా స్థలాన్ని యజమానినులకి అప్పగించటం) పద్ధతిలో అభివృద్ధి చేసేందుకు 2013లో సొసైటీ జనరల్‌ బాడీ ఆమోదం తెలిపింది. దీనికి అనుగుణంగా పాఠశాల కోసం వుద్దేశించిన స్థలాన్ని ఒక ప్రయివేటు సంస్థకు ఆ పద్ధతిలో అప్పగించారు. మిగిలిన స్థలాలను ప్రయివేటు వ్యక్తులకు అప్పగించేందుకు నాటి తీర్మానాన్ని ప్రాతిపదికగా చేసుకొని ముందుకు పోతున్నామే తప్ప కొత్తగా చేసిందేమీ లేదని ప్రస్తుత పాలకవర్గం జనరల్‌ బాడీలో పేర్కొన్నది. పౌరసదుపాయాల కోసం నిర్దేశించిన స్థలాల్లో పౌర సదుపాయాలను ఏర్పాటు చేస్తే అభ్యంతరం లేదని దానికి భిన్నంగా పౌరసదుపాయాలను పక్కన పెట్టి వాణిజ్య భవనాల అభివృద్ధికి ఇవ్వటాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని కొందరు సభ్యులు వ్యతిరేకత తెలిపారు. దానిని పక్కదారి పట్టించేందుకు నిర్మాణాలలో ఆసుపత్రి రావచ్చు రాకపోవచ్చుగానీ ఒక క్లినిక్‌, ఒక డయాగ్నస్టిక్‌ సెంటర్‌ వస్తాయని సొసైటీ అధ్యక్షుడు ఇచ్చిన వివరణ అసమగ్రంగా వుండటంతో సభ్యులు సంతృప్తి చెందలేదు.

తమ ప్రతిపాదనలకు ఆమోద ముద్ర వేయించుకొనేందుకు పాలకమండలి సభ్యులు అనుసరించిన వ్యూహం చర్చనీయాంశమైంది. ప్రస్తుతం సొసైటీ వద్ద వున్న స్థలాలను అభివృద్ధికి ఇవ్వటం ద్వారా వచ్చే ఆదాయాన్ని, ఇప్పటికే సొసైటీ వద్ద వున్న నిధులతో ఇంకా స్థలాలు రాని వారినిమిత్తం పొలాన్ని కొని వారికి కూడా స్థలాలు కేటాయించేందుకు ప్రయత్నిస్తున్నామని దాన్ని కొందరు అడ్డుకోచూస్తున్నారనే భావం కలిగించి తద్వారా తమ నిర్ణయానికి స్థలాలు రాని వారితో ఆమోదం పొందేందుకు ప్రయత్నించారు, తీర్మానాన్ని ఆమోదింప చేయించుకున్నారు. చాలా వ్యూహాత్మకంగా ఈ తతంగం సాగింది.

సొసైటీ జనరల్‌ బాడీకి అందచేసిన వివరాల ప్రకారం జూబ్లీ హిల్స్‌ ఏ కాలనీలో వున్న 450 గజాల స్థలానికి నెలకు రు.1,20,000 రూపాయలతో ప్రారంభించి ప్రతి రెండు సంవత్సరాలకు పదిశాతం చొప్పున అద్దెను పెంచుతారు. ఒప్పంద గడువు( వ్యవధిని పేర్కొనలేదు) ముగిసే నాటికి మొత్తం 5,88,12,493 రూపాయలు సొసైటీకి వస్తాయి. జూబ్లీ హిల్స్‌ బి కాలనీలోని 350 గజాల స్థలానికి నెలకు లక్షా పదకొండువేలతో ప్రారంభించి పై మాదిరే ప్రతి రెండు సంవత్సరాలకు పదిశాతం పెంపుదలతో మొత్తం రు.5,23,47,000లు, గోపన్నపల్లిలోని 3,050 గజాలకు నెలకు రు.3,40,000 చొప్పున 20సంవత్సరాల వరకు ఏటా మూడు శాతం చొప్పున, 21వ సంవత్సరం నుంచి ఐదుశాతం చొప్పున పెంపుదలతో రు.16,49,95,200లు సొసైటీకి వస్తాయని అత్యధికంగా కోట్‌ చేసిన వారి వివరాలలో వున్నాయి. ఈ లెక్కన ఆ నిర్మాణాలను ప్రారంభించి పూర్తి చేసిన తరువాతే నెలవారీ అద్దెలు సొసైటికి వస్తాయి. అంటే ఈ స్దలాల అభివృద్ధికి కొత్త వారి స్ధలాలకు లంకె పెట్టటం బి.ఓ.టి పేరుతో ఇతరులకు అప్పగించే తమ నిర్ణయానికి ఆమోదం పొందే ఎత్తుగడ తప్ప ఈ డబ్బుతో స్థలాలు కొనే అవకాశం వుండదు.

మొదటి రెండు స్థలాలో వాణిజ్య సముదాయం అని పేర్కొన్నారు. గోపన్నపల్లి స్థలంలో పౌర సదుపాయాలు, మరియు షాపుల కొరకు అని పేర్కొన్నారు. పౌర సదుపాయాలు అంటే ఏమిటో పేర్కొనలేదు. ఇక్కడే తిరకాసు వుంది. ఈ మూడు స్ధలాలకు కలిపి కౌలు గడువు ముగిసే నాటికి వచ్చే మొత్తం రు.27,61,54,694. పోనీ ఈ మొత్తం లేదా సగమైనా తక్షణమే సొసైటీకి అందితే ఆ డబ్బుతో స్థలం కొనుగోలు చేస్తామంటే అర్ధం చేసుకోవచ్చు. అలాంటిదేమీ లేదు.గతంలో కూడా సౌసైటీ పాలకవర్గం ఇదే అభిప్రాయాన్ని వెల్లడించి నగరానికి సుదూరంగా కొన్ని ప్రాంతాలను పరిశీలించామని, దానికి గాను డబ్బు చెల్లించి స్థలాను పొందేందుకు ముందుకు వచ్చే వారు అంగీకారం తెలపాలని కోరింది. దాని గురించి పాలకవర్గం ఏమీ చెప్పకుండా మరోసారి అదే ప్రతిపాదనను ముందుకు తేవటం సభ్యులను మభ్య పెట్టటం తప్ప మరొకటి కాదని అనేక మంది ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు కేటాయిస్తామని ఒకసారి, ఇండ్లు నిర్మించి ఇస్తామని వాగ్దానం చేసిన ముఖ్య మంత్రి కెసిఆర్‌ తరువాత దాని గురించి అడిగేందుకు తమకు అప్పాయింట్‌ మెంట్‌ కూడా ఇవ్వటం లేదని, అందువలన ప్రత్యామ్నాయంగా స్థలం కొనుగోలు ప్రతిపాదనను ముందుకు తెచ్చినట్లు పాలకమండలి తెలిపింది. ఒకసారి కొనుగోలు ప్రారంభించిన తరువాత  ప్రభుత్వం దగ్గర స్థలాన్ని అడిగేందుకు  ఇబ్బంది అవుతుందని, మీరెలాగూ స్థలాలను కొనుగోలు చేసే స్థితిలో వున్నారు గనుక ప్రభుత్వం ఇవ్వాల్సిన అవసరం లేదనే వాదన ముందుకు వస్తుందేమో ఆలోచించాలని, ప్రభుత్వాన్ని విమర్శించటం మాని సానుకూల నిర్ణయం వచ్చే విధంగా ప్రయత్నించాలని కొందరు సభ్యులు సూచించారు.

ప్రస్తుతం సొసైటీలో ఇంకా స్థలాలు రాని వారు 600 మంది వరకు వున్నారు వారికి, మూడు వందల గజాల చొప్పున స్థలం ఇవ్వాలంటే 60ఎకరాల వరకు అవసరం అవుతుందని, సొసైటీ దగ్గర వున్న నాలుగు కోట్ల రూపాయల డబ్బుతో వచ్చే స్థలం ఎంత? దానిని ఎంత మందికి, ఎలా ఇస్తారనే ప్రశ్న తలెత్తింది. సొసైటీ దగ్గర వున్న సొమ్ము స్థలం కొనుగోలుకు అడ్వాన్సుగా ఇచ్చేందుకు, కొంత రాయితీ కల్పించేందుకు వినియోగిస్తామని సౌసైటీ పాలకవర్గం వివరణ ఇచ్చింది.ఆ సొమ్మును సభ్యులు తిరిగి సొసైటీకి చెల్లించాల్సి వుంటుంది.  వివిధ ప్రాంతాలలో స్థలాలకు ప్రభుత్వం నిర్ణయించిన రేటు మొత్తం చెల్లించి అయినా ప్రభుత్వం కేటాయించిన స్థలాలను తీసుకోగలం తప్ప  ప్రయివేటు మార్కెట్‌ రేటుకు ఎంత స్థలం కొనగలరు, ఆ ధరలను ఎంత మంది చెల్లించగలరు అన్న ప్రశ్న ముందుకు వచ్చింది. సొసైటీ ద్వారా కొనుగోలు చేసే స్థలానికి కొన్ని రాయితీలను పొందవచ్చని చెప్పారే తప్ప సభ్యుల చెల్లింపు స్థాయి గురించి పాలకమండలి పట్టించుకోలేదు. సొసైటీ పాలకవర్గం మాటలు నమ్మి తీర్మానానికి ఆమోదం తెలిపిన తరువాత కొంత మంది పునరాలోచనలో పడ్డారు.  సొసైటీ స్థలాలు కొనుగోలు చేయటం, తమకు రావటం ఎండమావి వంటిదే అని వ్యాఖ్యానించారు. ప్రయివేటు స్థలాలు కొనుగోలు చేయటం అంటే అది అక్రమాలకు తెరలేపటమే అని వ్యాఖ్యానించిన వారు కూడా లేకపోలేదు.
………..
( * రచయిత ఎం. కోటేశ్వరరావు, సీనియర్ పాత్రికేయులు, హైదరాబాద్.)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *