ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ నేతలు కొత్త వాదన తెరపైకి తెచ్చారు. అందులో సాధ్యాసాధ్యాలెంతవరకు ఉన్నాయన్నది పక్కన పెడితే ఈ నాయకులు లేవనెత్తిన అంశాలు తెలంగాణ రాజకీయాల్లో ట్రెండింగ్ న్యూస్ అయ్యాయి. ఇంతకూ ఢిల్లీ వెళ్లిందెవరు? వారు లేవనెత్తిన కొత్త వాదన ఏంటి? పూర్తి వివరాల కోసం చదవండి. స్టోరీ..
ఎఐసిసి అధినేత రాహుల్ గాంధీ బర్త్ డే శుభాకాంక్షలు చెప్పేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు చాలామందే కట్టకట్టుకుని వెళ్లి ఢిల్లీలో వాలారు. వారంతా పైకి బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పేందుకే ఢిల్లీకి పోయినట్లు చెబుతున్నా.. లోగుట్టు వేరే ఉందని ప్రచారం సాగుతోంది. అయితే ఢిల్లీ వెళ్లిన పెద్ద లీడర్లలో కోమటిరెడ్డి బ్రదర్స్, డికె అరుణ, బట్టి విక్రమార్క, ఎరవర్తి అనీల్ కుమార్, కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డితోపాటు కొత్తగా పార్టీలో జాయిన్ అయిన రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు. వీరంతా రోజుల తరబడి ఢిల్లీలో మకాం వేశారు.
రాహుల్ పుట్టిన రోజు పేరుతో ఈ బృందం నేతలు ఏకంగా తెలంగాణ పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఘాటుగానే ఫిర్యాదుల వర్షం కురిపించినట్లు చెబుతున్నారు. కోమటిరెడ్డి బ్రదర్స్, డికె అరుణ ఉత్తమ్ మీద గట్టిగానే ఫిర్యాదు చేశారని టాక్ నడుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణ సిఎం కేసిఆర్ తో టచ్ లో ఉన్నారని ఢిల్లీ వేదికగా ఈ నేతలు పెద్ద బాంబే పేల్చారు. వ్యాపారవేత్త మైహోం రామేశ్వరరావు మధ్యవర్తిత్వంలో కేసిఆర్ తో పిసిసి చీఫ్ ఉత్తమ్ టచ్ లో ఉన్నారని రాహుల్ కు ఫిర్యాదు చేశారు. కేసిఆర్ తో సంప్రదింపులు కూడా జరుపుతున్నారని రాహుల్ కు వివరించారు.
ఈ పరిస్థితుల్లో ఉత్తమ్ ను తక్షణమే పార్టీ చీఫ్ పదవి నుంచి తప్పించాలని వారు డిమాండ్ చేశారు. ఉత్తమ్ నాయకత్వంలోనే 2019 ఎన్నికలకు పోతే 15 సీట్లు కూడా కాంగ్రెస్ పార్టీకి రావని కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. ఉత్తమ్ మినహా ఏ నాయకుడిని పిసిస అధ్యక్షుడిగా నియిమించినా తాము కష్టపడి పనిచేస్తామని వివరించారు. కేసిఆర్ తో ఉత్తమ్ టచ్ లో ఉన్నారన్న ఫిర్యాదును కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసినట్లు చెబుతున్నారు. ఈ ఆరోపణల నేపథ్యంలో మరోసారి తెలంగాణ కాంగ్రెస్ నేతలతో భేటీ అవుతానని, పూర్తి అంశాలపై చర్చిద్దామని రాహుల్ గాంధీ చెప్పినట్లు చర్చ సాగుతోంది.
విశ్వసనీయ సమాచారం మేరకు ఉత్తమ్ మీద ఫిర్యాదు చేసిన వారిలో కోమటిరెడ్డి బ్రదర్స్ తోపాటు డికె అరుణ కూడా ఉన్నట్లు చెబుతున్నారు. మిగతా నేతలు బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, బండ కార్తిక రెడ్డి, అనీల్ ఉత్తమ్ మీద ఫిర్యాదు చేశారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
ఏది ఏమైనా రాహుల్ గాంధీ బర్త్ డే జరిగిన రెండు రోజుల తర్వాత ఉత్తమ్ బర్త్ డే జరిగింది. ఈ రెండు రోజుల గ్యాప్ లోనే ఢిల్లీలో పరిణామాలు వేగంగా జరిపోయాయని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. మరి ఉత్తమ్, జానా బర్త్ డే తర్వాత పిసిసి చీఫ్ పదవిలో మార్పులు ఏమైనా ఉంటాయా అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి.