అమ్మ కమ్మల కత

(గాలి నాగరాజ)

ఇది మా అమ్మ కమ్మల కత. ఈ కత లో పేదరికం వుంది. భావోద్వేగం వుంది. పేదరికం రగిలించిన భావోద్రకాలు, అశాంతి కూడా వున్నాయి.

నేను ఇంటర్ పూర్తి చేసే సరికి మా నాన్న పేదరికం బండి లాగలేననే నిర్ణయానికి వచ్చ్చేశాడు. దానికో దొడ్డిదారి కనుకొన్నాడు. అదేంటంటే నన్ను కువైట్ పంపించడం. ఒక కారు డ్రైవర్ ను చేసే పంపేస్తీ పేదరికం నుంచి ఉపశమనం కలుగుతుందనుకున్నాడు. కువైట్ కు పంపాలంటే అప్పట్లో 20 వేల పై మాటే. నిజం చెప్పాలంటే ఆయన చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు. ఇంటర్ పాస్ అయిన నన్ను కాలేజీ మానేయమన్నాడు.
ఆయన ఆలోచన కార్యరూపం దాల్చాలంటే నేను కారు డ్రైవింగ్ నేర్చుకోవాలి. అందుకు కనీసం 1000 రూపాయలు అవసరం. తిరుపతి చింతకాయల వీధిలోని ఒక డ్రైవింగ్ స్కూల్ యజమాని ఈ విషయం చెప్పాడు. ఈ డబ్బు సంపాదించే ఉపాయం తట్టడానికి మా నాయనకు యెంతో సమయం పట్టలేదు. మా అమ్మను చెవిలోని కమ్మలను ఇవ్వమన్నాడు. ఆమె ఇవ్వనన్నది. కువైట్ మా ముంగిట్లో కురిపించే సంపద గురించి కళ్ళకు కట్టినట్టు వివరించాడు. అయినా ఆమె వినలేదు. రెండు తగిలించాడు. చివరికి అనుకున్నది సాధించాడు. నాతొ పాటు మరో ముగ్గురు శిక్షణ పొందడానికి ఒక మాస్టారు ను అప్పచెప్పారు. ఆయనకు రోజుకు ఒకరు చొప్పున ఒక గోలి సోడా పొద్దున్నే ఇప్పించాలి. అప్పట్లో దాని ఖరీదు పావలా అనుకుంటా. చేతిలో కమ్మలు చేజారాయి. చేతి లోకి పూర్తిగా స్టీరింగ్ రాకుండానే డ్రైవర్ అయిపోయాను.
డ్రైవర్ అయితే అయ్యాను కానీ కువైట్ విమానం ఎక్కే దారి మాత్రం కనపడట్లేదు. అప్పు గా ఇస్తానన్న ఆసామి (మా బంధువే) ముఖం చాటేశాడు. నా చదువు ఒక సంవత్సరం అటకెక్కింది. అప్పటి నుంచి మా ఇంట్లో కమ్మలు ఆరని చిచ్చు రగిల్చాయి. రోజు లో ఏదో ఒక్కసారయినా కమ్మలను తండ్రి కొడుకులు ఎలా దిగమింగి నీళ్లు తాగామో లయ బద్దంగా పాట రూపం లో మా అమ్మ అందుకునేది. అది ఒక పట్టాన ఆగేది కాదు. మా నాయన చేతికి పని కలిగినప్పుడే దానికి ముగింపు. ఈ నస వంట మా అమ్మ పోవడం లాంటి సత్యాగ్రహానికి దారి తీసేది. కనీసం రెండు రోజులయినా అది కొనసాగేది. నరకాన్ని మరిపించేది, మురిపించేది.
ఎలాగోలా తంటాలు పడి చావు తప్పి కన్ను లొట్టపడినట్టు డిగ్రీ చదువు మా మా అనిపించాను. ఈ పాటి వెసులుపాటు కలిగించినందుకు విప్లవోద్యమ నాయకులకు అప్పుడప్పుడు మనసులోనే కృతఙ్ఞతలు చెప్పు తూ వుంటాను.
సమాజం లో దేనికి పనికిరాని వాడికి రెండు దారులు కనిపిస్తాయి. ఒకటి రాజకీయం. మరొకటి జర్నలిజం. అలా విప్లవ రాజకీయాల నుంచి పాత్రికేయం వైపు అడుగు పడింది. ఈ పని వెట్టి చాకిరి కంటే హీనం అని నేను పనిచేసిన మొదటి నెలలోనే తెలిసిపోయింది. నెల జీతంగా నా కిచ్ఛేది 250 రూపాయలు. అందులో తిరుపతి నుంచి రేణిగుంటలో వుండే పత్రిక కార్యాలయానికి దినసరి ప్రయాణ ఖర్చులకోసం 50 రూపాయలు మినహాయించాలి.
ఇంట్లో కమ్మల కతకు ముగింపు చెప్పాలంటే కనీసం ఆరు నెలలు పనిచేస్తేకానీ కుదరదు. ఎలాగో లా పనిచేసి 1200 రూపాయలు మా అమ్మ చేతిలో పోసి కొత్త కమ్మలు కొనే దారి చూపాను. ఆ విదంగా మా అమ్మ కమ్మల కత కంచికి చేరింది.

(ఫేస్ బుక్ నుంచి)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *